
హాస్టల్‌లో విశ్రాంతి తీసుకుంటున్న విద్యార్థులు
నారాయణఖేడ్: కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం వండిన పప్పు మిగలడంతో శుక్రవారం ఉదయం వేడిచేసి విద్యార్థులకు వడ్డించారు. దీంతో అది తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు వాంతులు చేసుకున్నారు.
అస్వస్థతకు గురైన పిల్లలకు ఓఆర్‌ఎస్ పాకెట్లు తాగించారు. కాగా నిత్యం అన్నం పలుకుగానే ఉంటుందని, సరిగా ఉడకడం లేదని విద్యార్థులు వాపోయారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని.. రోజూ అన్నం, పప్పు, సాంబారునే వడ్డించడంతో తినలేకపోతున్నామని పేర్కొన్నారు. ఇదే విషయమై గురుకులం వార్డెన్ ఎల్లంను వివరణ కోరగా, గురువారం సాయంత్రం వండిన పప్పు ఉదయం బాగుందని చెబితేనే వడ్డించామన్నారు. విద్యార్థుల్లో కొందరు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ దశరథ్‌సింగ్ గురుకులాన్ని సందర్శించి అస్వస్థతకు గురైన విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment