చెడ్డపేరు తెస్తే విధుల నుంచి తప్పిస్తాం | If Any Govt Employee Gives A Bad Name To Institution He Will Be Suspended From Duty | Sakshi
Sakshi News home page

చెడ్డపేరు తెస్తే విధుల నుంచి తప్పిస్తాం

Published Wed, Dec 18 2019 8:39 AM | Last Updated on Wed, Dec 18 2019 8:39 AM

If Any Govt Employee Gives A Bad Name To Institution He Will Be Suspended From Duty - Sakshi

ప్రిన్సిపాల్‌పై విచారణ జరుపుతున్న ఆర్సీఓ బాలస్వామి

సాక్షి, సంగారెడ్డి: గురుకులానికి చెడ్డపేరు తీసుకు వచ్చేలా వ్యవహరిస్తే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని, శాఖాపరమైన చర్యలతోపాటు అవసరమైతే ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేస్తామని గురుకుల పాఠశాలల రీజినల్‌ కోఆర్డినేటర్‌(ఆర్సీఓ) బాలస్వామి హెచ్చరించారు. నారాయణఖేడ్‌ మండలం జూకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్‌ మధుసూదన్‌రావుతోపాటు పలు పలువురు అధ్యాపకుల తీరును నిరసిస్తూ వర్కర్లు ధర్నా చేయడం, తల్లిదండ్రుల ఆరోపణలపై ఆర్సీఓ మంగళవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రిన్సిపాల్‌తోపాటు కొందరు అధ్యాపకులపై ఆరోపణలు వచ్చాయని అన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ప్రిన్సిపాల్‌ మద్యం సేవించి వర్కర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, భోజనం బాగుండడం లేదని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. సరిపడా సరుకులు ఇవ్వడం లేదని, మటన్‌ కాంట్రాక్టర్‌తో ఇబ్బందులు ఎదురవడం, కాంట్రాక్టు మార్చడం, మెనూ ప్రకారం వంటకాలు ఉండడం లేదని పలు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ ఆరోపణలపై అంశాలవారీగా విచారణ చేసి గురుకుల పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి డా.ప్రవీణ్‌కుమార్‌కు నివేదిస్తామని అన్నారు. కొందరు లెక్చరర్లు, సిబ్బందితో కూడా సఖ్యతగా ఉండడం లేదని తెలపారు. ఈ అంశాలను విచారణ చేసి నిజం అని తేలితే శాఖాపరంగా తీసుకోవాల్సిన చర్యలతోపాటు అవసరమైతే ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ కూడా చేస్తామని అన్నారు. గురుకుల పాఠశాలకు చెడ్డపేరు తీసుకువస్తే ఊరుకునేది లేదని అన్నారు. ప్రిన్సిపాల్‌ గతంలో సస్పెన్షన్‌కు గురై ఇక్కడ బాధ్యతల్లో చేరారని, ఆయన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని సూచిస్తామన్నారు. 

తాగుబోతు ప్రిన్సిపాల్‌ వద్దు..  
పేరెంట్స్‌ కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల బాధ్యులు ఆర్సీఓను కలిసి ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదు చేశారు. బాధ్యతగా ఉండాల్సిన ప్రిన్సిపాల్, కొందరు అధ్యాపకులు తాగివచ్చి గురుకులం పేరును చెడగొడుతున్నారని, ఇలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.  తాగుబోతు ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి తొలగించి గురుకులాన్ని మెరుగుపర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఇదిలా ఉండగా ఆర్సీఓ విచారణ జరుపుతున్న తరుణంలోనే ప్రిన్సిపాల్‌ మధుసూదన్‌రావు తాను ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తించనని రాజీనామా లేఖను ఆర్సీఓకు అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement