ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుత భారత్ రాష్ట్ర సమితి) ఉప ప్రాంతీయ పార్టీ. కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలు అయితే, ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం అప్పట్లో అధికారంలో ఉన్న పెద్ద ప్రాంతీయ పార్టీ. విశేషం ఏమిటంటే చిన్న పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్, పెద్ద పెద్ద పార్టీలను తనదారిలోకి తెచ్చుకోవడమే కాకుండా ఆ పార్టీల భవిష్యత్తు మీద బాగా దెబ్బకొట్టగలిగింది. తెలుగుదేశం పార్టీ చివరికి తెలంగాణలోని శాసనసభ ఎన్నికలలో పోటీచేయడం లేదని చేతులెత్తేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో పట్టు సాధిస్తున్నట్లే కనిపించి జారిపోయింది.
ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయం. తెలంగాణ ఇస్తే అంతా తమదే అధికారమని భ్రమపడ్డ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వేసిన ఉచ్చులో పడి విలవిలలాడుతోంది. దాని నుంచి బయటపడి అధికారం సాధించాలన్న తపనతో ఉన్న కాంగ్రెస్ చావో, రేవో తేల్చుకోవడానికి సిద్ధపడుతోంది. ఈసారి కనుక కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే, ఆ పార్టీ భవిష్యత్తు మరింత అంధకారంలో పడుతుందని క్యాడర్ భయపడుతోంది. దీని అంతటికి ఒకే ఒక్కడు కారణం అంటే ఆశ్చర్యం కాదు. ఆయనే బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అని వేరే చెప్పనవసరం లేదు.
2001 నుంచే ఉద్యమానికి మళ్లీ ఊపిరి
ఎప్పుడో 1998లో కాకినాడలో బీజేపీ ఒక ఓటు, రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసింది. అప్పటికి కేసీఆర్ అసలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరేవారే కాదు. ఆయన చంద్రబాబు నాయుడి కేబినెట్‌లో మంత్రి పదవితో సంతృప్తి చెంది రాజకీయం సాగించేవారు. 1999 శాసనసభ ఎన్నికలలో బీజేపీ పొత్తుతో మరోసారి టీడీపీ అధికారం పొందింది. అప్పుడు చంద్రబాబు ఈయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. కేవలం డిప్యూటీ స్పీకర్ పదవి మాత్రమే ఇచ్చారు. ఆ తరుణంలో ఆయనకు తెలంగాణ ఆలోచన బలంగా నాటుకుంది.
1969 నాటి ఉద్యమాన్ని పక్కనబెడితే, తదుపరికాలంలో కొందరు కాంగ్రెస్ నేతలు కానీ, ఇతరులు కానీ తెలంగాణ వాదాన్ని వినిపించినా దానిని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. అయితే 2001లో కేసీఆర్ సొంత పార్టీనిపెట్టి సిద్దిపేట సీటుకు రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధం అవడంతో ఏపీ చరిత్రలో పెద్ద మలుపునకు శ్రీకారం చుట్టినట్లయింది. సిద్దిపేటలో గెలిచి కేసీఆర్ సంచలనం సృష్టించడంతో ప్రత్యేక వాదులకు ఊపిరి వచ్చినట్లయింది.
ఆ తరుణంలో కాంగ్రెస్‌లోని తెలంగాణ నేతలకు ప్రత్యేకవాదం ద్వారా ఎన్నికలలో గెలవవచ్చనిపించింది. అప్పటికే పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో లేకపోవడంతో పార్టీ నేతలు టీఆర్‌ఎస్‌తో పొత్తు వైపు ఆలోచించడం జరిగింది. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ తన దారిలోకి తెచ్చుకోగలిగారు. అప్పట్లో కాంగ్రెస్‌లో పవర్ ఫుల్‌గా ఉన్న గులాం నబీ ఆజాద్‌ను టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం కేసీఆర్ ఇంటికి సీనియర్ కాంగ్రెస్ నేతలు వెంకటస్వామి, డి.శ్రీనివాస్ వంటివారు తీసుకు వెళ్లారు. దాంతో కేసీఆర్ ప్రభ మరింత పెరిగింది.
2004లో కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ పొత్తు చరిత్రాత్మకం
2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ పొత్తు కుదరడం ఒక చారిత్రక సన్నివేశం. కేవలం ఒక్క సీటు మాత్రమే ఉన్న టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం కాంగ్రెస్ పాకులాడుతోందన్న భావన రావడంతో తెలంగాణవాదానికి మరింత బలం చేకూరింది. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి ప్రముఖులు టీఆర్‌ఎస్‌తో పొత్తు లేకున్నా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పినా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒప్పుకునేవారు కాదు. అంతగా వారిని టీఆర్‌ఎస్ భయపెట్టగలిగింది. పొత్తు సందర్భంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు అవగాహనకు వచ్చి ఒప్పందంపై సంతకాలు కూడా చేసుకున్నాయి.
అప్పటి ప్రముఖ కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీ కర్ర విరగకుండా, పాము చావకుండా తెలివిగా ఒప్పందం తయారు చేశారు. దాంతో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి కాదులే అని చాలా మంది అనేవారు. కరీంనగర్ సభలో సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తనకు తెలుసునని, అవి నెరవేరతాయని పరోక్షంగా ప్రత్యేక రాష్ట్ర సంకేతం ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో టీఆర్‌ఎస్ కన్నా కాంగ్రెస్ పార్టీనే పెద్ద పార్టీగా ఉండేది. టీఆర్‌ఎస్‌కు 26 సీట్లే రాగా కాంగ్రెస్‌కు 48 సీట్లు వచ్చాయి. వైఎస్ మంత్రివర్గంలోనూ, అలాగే కేంద్ర మంత్రివర్గంలోనూ టీఆర్‌ఎస్ చేరింది.
రాజీనామా అస్త్రాలతో ఉద్యమం సజీవంగా
ఆ తర్వాత కాలంలో తెలంగాణ విషయంలో కేసీఆర్ గట్టిగా ఉన్నట్లు పలు సందర్భాలలో రుజువు చేసుకుని రాజీనామా అస్త్రాలు ప్రయోగించారు. చివరికి కాంగ్రెస్‌కు దూరం కూడా అయ్యారు. అలాంటప్పుడే ఆయన సమైక్యవాద పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీని తన దారిలోకి లాగగలిగారు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డిని తట్టుకుని నిలబడాలంటే టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవల్సిందేనని తెలంగాణ టీడీపీ నేతలు గట్టిగా మాట్లాడే పరిస్థితిని కేసీఆర్ సృష్టించారు.
అంతవరకు తమది సమైక్యవాద పార్టీ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ప్లేట్ మార్చి తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశారు. తెలంగాణ తీర్మానం తర్వాతే పొత్తు అని కేసీఆర్ క్లాజ్ పెట్టడమే ఆయన గొప్పదనం. దానికి లొంగిపోవడం చంద్రబాబు బలహీనత. 2009లో టీడీపీ, సీపీఐ, సీపీఎంలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేశారు. కానీ మహాకూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి రాలేకపోయింది.
2009లో గడ్డు పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని..
2009లో వైఎస్‌ఆర్ తిరిగి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. టీఆర్‌ఎస్ కేవలం పది అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లకు పరిమితం అయింది. దాంతో టీఆర్‌ఎస్ పని అయిపోయినట్లే అని అనుకున్నవారు కూడా లేకపోలేదు. కేసీఆరే దుకాణం బంద్ చేద్దామా అని అన్నట్లుగా ఒక పత్రిక పెద్ద కధనం కూడా ఇచ్చింది. కానీ అక్కడే పెద్ద మలుపు ఏమిటంటే వైఎస్‌ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం. తదుపరి కాంగ్రెస్ అధిష్టానం వైఎస్‌ఆర్ కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠం అప్పగించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ రోశయ్యకు, తదుపరి కిరణ్ కుమార్‌రెడ్డిలకు బాధ్యతలు ఇచ్చింది.
ఈ పరిస్థితిని కేసీఆర్ తనకు పూర్తిగా అనుకూలంగా మలచుకుని మళ్లీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, నిరసన దీక్షకు దిగడం, సోనియాగాంధీ తన పుట్టిన రోజున తెలంగాణ ప్రకటించడం జరిగిపోయాయి. అంతవరకు తెలంగాణ రాదనుకున్న ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించి కొత్త అంకానికి తెరదీశారు. దాంతో కాంగ్రెస్ కాస్త తగ్గి శ్రీకృష్ణ కమిటీని నియమించింది.
అదే అదనుగా ఉద్యమానికి ఉధృత ఊపు
అప్పటి నుంచి కేసీఆర్ వేగంగా పావులు కదిపి తెలంగాణలోని అన్ని పార్టీలను ఏకం చేసి, జేఏసీని సృష్టించి ఉద్యమానికి ఊపు తెచ్చారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌కు దూరం అయి సొంత పార్టీ పెట్టుకుని సవాల్ విసరడం, తదితర కారణాలతో కనీసం తెలంగాణలో అయినా అధికారంలోకి వస్తామన్న ఆశతో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి శ్రీకారం చుట్టగా, బీజేపీ సహకరించింది. టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోకుండా కాంగ్రెస్ తెలివితక్కువగా వ్యవహరించి రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలింది.
కేసీఆర్ వ్యూహం ముందు ఆ మూడు పార్టీలూ చిత్తు
2014 ఎన్నికలలో కేసీఆర్ ఒంటరిగా పోటీచేసి అనూహ్యంగా అధికారంలోకి రావడం, తర్వాత ఓటుకు కోట్లు కేసు ద్వారా చంద్రబాబును హైదరాబాద్ నుంచి పంపించివేయడం, కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను పలువురిని టీఆర్‌ఎస్‌లో కలిపేసుకోవడం, ప్రభుత్వ స్కీములు అమలు చేయడం ద్వారా తన పాలనను సుస్థిరం చేసుకున్నారు. 2018లో మరోసారి గెలిచి రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించారు.
ఇక ఇప్పుడు టీడీపీ పోటీలోనే లేమని చేతులెత్తేసింది. ఈ మొత్తం ప్రక్రియలో కేసీఆర్ వ్యూహం ముందు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల రాజకీయాలు వెలవెలబోయాయంటే ఆశ్చర్యం కాదు. ఇందులో కేసీఆర్ చాతుర్యం, చిత్తశుద్ధి సఫలం అయితే, మిగిలిన మూడు ప్రధాన పార్టీల అతి తెలివి వ్యవహారాలకు ప్రజలు చెక్ పెట్టారని చెప్పవచ్చు.
- కొమ్మినేని శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment