Irrigation supply
-
వర్షాభావం ఎదురైనా.. నీళ్లు ఇద్దాం!
సాక్షి, హైదరాబాద్: రుతుపవనాల ఆలస్యంతో వర్షాభావ పరిస్థితులు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. రాష్ట్రంలో సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూడాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులు కొనసాగితే.. రైతులకు సాగు నీటిని సరఫరా చేసేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని.. అందుకు ఎంత ఖర్చ యినా ఫర్వాలేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల కోసం ఏర్పాట్లు చేయాలని, అన్ని రిజర్వాయర్లను నింపాలని సూచించారు. వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమన్నారు. అయితే.. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా సాగునీటి విడుదలకు కొన్నిరోజులు విరామం ఇచ్చి, తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జూలై తొలి వారం నాటికి వర్షపాతం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, ఇతర అంశాలపై మరోసారి సమీక్షించుకుని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై సీఎం కేసీఆర్ సోమవారం సచివాలయంలో సమీక్షించారు. కాళేశ్వరం ద్వారా ఎత్తిపోతలతో.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలను ఆగస్టులోనే సమీక్షించి.. కొరత ఏర్పడిన పక్షంలో శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం ద్వారా 30– 35 టీఎంసీల నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోయాలని సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఏడాది మల్లన్నసాగర్లో మరో 10 టీఎంసీలు నింపాలన్నారు. రంగనాయకసాగర్‌లో 3 టీఎంసీల సామర్థ్యానికిగాను 0.69 టీఎంసీలే ఉన్నాయని ఇంజనీర్లు వివరించగా.. మిడ్‌మానేరు నుంచి వెంటనే 2 టీఎంసీలను ఎత్తిపోయాలని, దీంతో రంగనాయకసాగర్ కింద వానాకాలం పంటలకు నీరు అందించడానికి వీలవుతుందని సూచించారు. నిజాంసాగర్‌లో ఉన్న 4.95 టీఎంసీల నీళ్లు ఆగస్టు చివరివరకు 3 తడులకు సరిపోతాయని, తర్వాత మరో 3 తడులకు 5 టీఎంసీలు అవసరమని ఇంజనీర్లు సమీక్షలో వివరించారు. దీనితో ఆగస్టులో కొండపోచమ్మసాగర్ ద్వారా 5 టీఎంసీలను నిజాంసాగర్‌కు తరలించాలని సీఎం సూచించారు. జలాశయాలన్నీ నింపి పెట్టుకోవాలి వానాకాలం ముగిసి జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో ఆగిపోయాక కూడా.. అక్టోబర్, నవంబర్ నెలల్లో కాళేశ్వరం వద్ద గణనీయంగా గోదావరిలో ప్రవాహాలు ఉంటాయి. రెండో పంట అవసరాలకు ఆ నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్లలో తగినంత నీటిని నింపి పెట్టుకోవాలని సమీక్షలో నిర్ణయించారు. ఇందుకోసం ఎన్ని పంపులు, ఏ సమయంలో ఆన్ చేయాలనే విషయంపై ఒక ఆపరేషన్ మ్యాన్యువల్ తయారు చేయాలని సీఎం ఆదేశించారు. వార్ధా ప్రాజెక్టుకు అనుమతులివ్వండి వార్ధా బ్యారేజీ ప్రాజెక్టు కోసం రూ.4,252.53 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, పరిపాలన అనుమతులు త్వరగా ఇవ్వాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కోరగా.. దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ శాంతికుమారి, ఈఎన్సీలు మురళీధర్, ఎన్.వెంకటేశ్వర్లు, శంకర్, సీఈలు హమీద్‌ఖాన్, రమణారెడ్డి, శ్రీనివాస్, అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘పాలమూరు’ లిఫ్టింగ్‌కు సిద్ధం చేయండి తాగునీటి అవసరాల కోసం ఆగస్టు చివరికల్లా పాలమూరు–రంగారెడ్డి నుంచి నార్లాపూర్, ఏదుల, కరివెన, ఉద్ధండాపూర్ జలాశయాల్లోకి నీటిని ఎత్తిపోయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అందుకు అవసరమైన అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లను తొలగించి, సమర్థులైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని సూచించారు. ఇక తాగునీటి అవసరాల కోసం మిడ్‌మానేరు నుంచి గౌరవెల్లి జలాశయంలోకి నీటిని ఎత్తిపోయాలని ఆదేశించారు. గౌరవెల్లి ఆయకట్టుకు సాగునీటి సరఫరా కోసం కాల్వల నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. 26 నుంచి రైతుబంధు వానాకాలం పంటల కోసం జూన్ 26 నుంచి రైతుబంధు సొమ్ము పంపిణీని ప్రారంభించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పోడు భూముల పట్టాల పంపిణీ పూర్తయ్యాక పట్టాలు పొందిన గిరిజన రైతులకు రైతుబంధు అందేలా చర్య లు తీసుకోవాలని సూచించారు. -
దిగుబడులు వరించాయ్
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: రాష్ట్ర ధాన్యాగారంగా పేరొందిన ఉభయ గోదావరి జిల్లాల్లో రైతులు ఈ రబీలో సాగునీటి ఇబ్బందులను అధిగమించి మంచి దిగుబడులు సాధించారు. రెండో పంట విరగ పండటంతో రైతుల మోములో ఆనందం తొణికిసలాడుతోంది. పోలవరం ప్రాజెక్ట్‌లో భాగమైన కాఫర్ డ్యామ్ నిర్మాణం కోసం ఈ సారి అఖండ గోదావరి దిగువన రబీకి క్రాప్ హాలిడే ప్రకటించాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే.. రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టించారు. కాఫర్ డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని.. అదే సందర్భంలో గోదావరి జిల్లాల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించి తీరాలని ఆదేశించారు. గోదావరిలో సహజ ప్రవాహ జలాలు నిండుకున్నా ప్రతి ఎకరాకు సాగునీరివ్వాలనే ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు చేశారు. ప్రణాళిక ఫలించి ఎకరాకు 48 నుంచి 50 బస్తాల (బస్తా 75 కిలోలు) దిగుబడి రావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. విషమ పరీక్ష పెట్టినా.. రబీ ప్రారంభంలో అఖండ గోదావరిలో సహజ జలాలు నిండుకున్నాయి. మార్చి నెలాఖరు నాటికే సాగునీటి సరఫరా నిలిపివేయాలని నిర్ణయించారు. ఒక పక్క కాఫర్ డ్యామ్ నిర్మాణ అంశం, మరో పక్క తగ్గిన గోదావరి ఇన్‌ఫ్లోతో సాగు నీటిఎద్దడి ప్రభుత్వానికి తొలుత విషమ పరీక్ష పెట్టాయి. ముందస్తు ప్రణాళికతో స్వల్ప వ్యవధిలో చేతికొచ్చే వరి రకాలు సూచించి.. వెదజల్లు సాగు విధానాన్ని ప్రోత్సాహించారు. ఫలితంగా ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షన్నర హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో రైతులు వెదజల్లు పద్ధతికి ముందుకొచ్చారు. అనుకున్నట్టుగానే దిగుబడిలో కూడా సక్సెస్ అయ్యారు. గత రబీతో పోల్చుకుంటే ఈసారి దిగుబడి ఎకరాకు 75 కిలోలు అధికంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఇటీవల వ్యవసాయ శాఖ సమీక్షలో స్పష్టం చేశారు. రైతు పొలంలో ధాన్యం దిగుబడి శాతం లెక్కిస్తున్న వ్యవసాయ అధికారులు ఫలించిన ప్రణాళిక ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లోని తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు సాగునీరు సరఫరా అవుతుంది. మూడు డెల్టాల్లో రబీ వరికి కనీసం 94 టీఎంసీల నీరు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే, గోదావరి నదిలో సహజ జలాలు 46.21 టీఎంసీలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీంతో సీలేరు నుంచి 62.756 టీఎంసీలను గోదావరి నదిలోకి రప్పించి రబీ, తాగునీటి అవసరాల కోసం 98.216 టీఎంసీల నీటిపి విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 20 వరకూ సాగునీరు విడుదల చేసి ప్రతి ఎకరాకు అందించారు. శివారు భూములకు సైతం నీరందడంతో రైతులంతా ఇబ్బందులు లేకుండా గట్టెక్కారు. ప్రభుత్వ కృషితో విజయవంతం ప్రభుత్వ కృషితో రబీ వరి సాగు విజయవంతమయ్యింది. నీటి ఎద్దడి తలెత్తిన సమయంలో సీలేరు నుంచి అదనపు జలాలు విడుదల చేయడంతో పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరు అందించగలిగాం. ప్రతి ఎకరాకు నీరిచ్చాం. తొలుత మార్చి నెలాఖరు నాటికి కాలువలను మూసివేయాలని నిర్ణయించినప్పటికీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నీటి విడుదల కాలాన్ని పొడిగించింది. సమష్టి కృషితో రబీని విజయవంతం చేయగలిగాం. – ఆర్.శ్రీరామకృష్ణ, ఎస్ఈ, ధవళేశ్వరం సర్కిల్ పంట దక్కుతుందనుకోలేదు ఈ ఏడాది దాళ్వా తొలి దశలోనే తీవ్ర నీటి ఎద్దడి తలెత్తింది. తడారిపోతున్న పొలాలను చూసి ఈ పంట దక్కదేమో అనుకున్నాం. శివారు భూముల్లోని రైతుల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సకాలంలో స్పందించి సీలేరు జలాలు విడుదల చేసి మమ్మల్ని ఆదుకున్నారు. మద్దతు ధర కూడా దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో సంతోషంగా ఉంది. – నరాల నాగేశ్వరరావు, దుగ్గుదూరు, కాజులూరు మండలం నీరివ్వకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్లం మా గ్రామంలో ఈ పంటకు నీరు అందదేమోనని ఆందోళన పడ్డాం. వ్యవసాయ అధికారులు ముందునుంచీ హెచ్చరిస్తున్నా దేవుడి మీద భారం వేసి ముందుకెళ్లాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజంగానే మా పాలిట దేవుడిగా వరమిచ్చారు. సీలేరు నుంచి నీరు తీసుకుని వచ్చి మా పంటలను కాపాడారు. 50 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. –మావిరెడ్డి సుబ్బారావు, రైతు, చోడవరం, రామచంద్రపురం మండలం -
ఎకరాకు బిల్లు47,000
♦ ‘కాళేశ్వరం’ వార్షిక విద్యుత్ వ్యయం రూ.8,677 కోట్లు ♦ కాళేశ్వరం ద్వారా సాగునీటి సరఫరాకు సగటున ఎకరానికి విద్యుత్ బిల్లు రూ.46,732 ♦ డీపీఆర్ ప్రకారం కాళేశ్వరం వార్షిక విద్యుత్ అవసరాలు 13,558 మిలియన్ యూనిట్లు ♦ ఎత్తిపోతల పథకాలకు ప్రస్తుతం యూనిట్ విద్యుత్ చార్జీ రూ.6.40 ♦ నీటిని ఎత్తిపోసేందుకు విద్యుత్ సరఫరా వ్యయం ఏటా రూ.8,677 కోట్లు డీపీఆర్‌లో ప్రభుత్వం చూపిన విద్యుత్ చార్జీలు ఏటా రూ.4,067 కోట్లు సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి సరఫరా కోసం సగటున ఎకరానికి రూ.46,732 విద్యుత్ బిల్లు కానుంది! డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టు వార్షిక విద్యుత్ అవసరాలు 13,558 మిలియన్ యూనిట్లు. ప్రస్తుతం ఎత్తిపోతల పథకాలకు యూనిట్‌కు రూ.6.40 చొప్పున చార్జీలను విద్యుత్ శాఖ వసూలు చేస్తోంది. ఈ లెక్కన కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు విద్యుత్ సరఫరా వ్యయం ఏటా రూ.8,677 కోట్లు కానుంది. ఈ పథకం కింద 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టును ప్రభుత్వం ప్రతిపా దించగా, సగటున ఎకరా ఆయకట్టుకు నీటి సరఫరాకు ఏటా ఒక పంటకు రూ.47,526 విద్యుత్ బిల్లుల భారం పడనుంది. డీపీఆర్‌లో లెక్కలు తగ్గించి.. కాళేశ్వరం వార్షిక విద్యుత్ వ్యయాన్ని ప్రభు త్వం డీపీఆర్‌లో సగానికి తగ్గించి చూపింది. భవిష్యత్తులో రూ.3కే యూనిట్ చొప్పున విద్యుత్ లభ్యత ఉంటుందని, దీంతో ఏటా 13,558 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు రూ.4,067 కోట్ల వ్యయం కానుందని పేర్కొం ది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ శాఖ యూనిట్‌కు రూ.6.40 చొప్పున చార్జీ వసూలు చేస్తోంది. ఎత్తు పెరిగే కొద్దీ.. బిల్లుల మోతే.. మేడిగడ్డ బ్యారేజీ నుంచి కొండపోచమ్మ బ్యారేజీ వరకు నీటి తరలింపు కోసం సగటున ఎకరాకు రూ.46,732 నుంచి రూ.47,526 విద్యుత్ బిల్లు కానుండగా, ఒక్కో బ్యారేజీ కింద ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు వ్యయం ఒక్కోలా ఉండనుంది. బ్యారేజీల ఎత్తు పెరుగుతున్న కొద్దీ మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు విద్యుత్ అవసరాలు పెరిగనున్నాయి. సముద్ర మట్టానికి 500/600 మీటర్ల ఎత్తులో ఉండనున్న మల్లన్నసాగర్, కొండపోచమ్మ బ్యారేజీల కింది ఆయకట్టుకు నీటి సరఫరా కోసం ఎకరాకు రూ.80 వేల వరకు విద్యుత్ బిల్లు కానుందని విద్యుత్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం 225 టీఎంసీల గోదావరి జలాలను తరలించే లక్ష్యంతో కాళేశ్వరం బహుళార్థక ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. 225 టీఎంసీల్లో ఆవిరి, సీపేజీ, ఇతర నష్టాలు, తాగు, పరిశ్రమల అవసరాలను తీసేస్తే సాగునీటికి 124 నుంచి 134 టీఎంసీలు మిగలనున్నాయి. కాళేశ్వరం ద్వారా 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటి సరఫరాతో పాటు 18,82,970 ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరిస్తామని ప్రభుత్వం డీపీఆర్‌లో పేర్కొంది. 124–134 టీఎంసీలను 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకే నీటి సరఫరా కోసం కేటాయించినా, సగటున ఒక్కో టీఎంసీతో 17 వేల ఎకరాలకు పైగా సాగు నీటి సరఫరా జరపాల్సి ఉండనుంది. -
సాగునీటి సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పొదలకూరు : రైతులకు సాగునీరు సరఫరా చేయడంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. మండల పరిధిలోని సంగం ఆనకట్ట నుంచి కనుపూరు కాలువకు సాగునీటి విడుదలను ఎమ్మెల్యే శనివారం రైతులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులకు సాగునీటి పంపిణీపై అవగాహన లేకపోవడంతోనే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకుని వ్యవసాయ పనుల్లో మునిగి ఉన్నా అధికారులు ఇప్పటి వరకు సాగునీటిపై స్పష్టత లేకుండా ఉండడం దురదృష్టకరమన్నారు. జిల్లాలో రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిధులను వెచ్చించకపోవడం దారుణమన్నారు. సాగునీటి కాలువల్లో నాచు, గుర్రపు డెక్క పేరుకుపోయి నీటి పారుదల సమస్యలు ఉన్నా కాలువలకు నీటిని విడుదల చేయడాన్ని తప్పుపట్టారు. కనుపూరు కాలువకు సాగునీరు సక్రమంగా అందాలంటే సంగం ఆనకట్టపై ఇసుక బస్తాలు వేయాలని అధికారులకు ఎన్ని పర్యాయాలు చెప్పినా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఇందువల్ల కాలువ నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేపరిస్థితి లేదన్నారు. అధికారుల తప్పిదం వల్ల సాగునీరు అందకుంటే రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో జిల్లాలో కాలువల ఆధునీకరణకు మంజూరు చేసిన ప్యాకేజీలను ఇప్పటి వరకు అధికారులు పూర్తిచేసింది లేదన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులు సాగుచేస్తున్న పంటలు ఎండకుండా ఉండాలంటే ప్రాజెక్టు, ఇరిగేషన్ అధికారులు పూర్తిసహకారం అందివ్వాలన్నారు. పంటలు రైతుల ఇళ్లకు చేరేవరకు మూడు నెలల పాటు తాను పర్యటిస్తుంటానన్నారు. ఎక్కడ సాగునీటి ఇబ్బందులు ఏర్పడినా కాలువ వెంబడి తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తే రైతుల పంటలు పండుతాయన్నారు. సాగునీటిని రైతులు సైతం వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకుని పంట లు పండించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు దాసరి భాస్కర్‌గౌడ్, స్టీరింగ్ కమిటీ సభ్యుడు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, వెంకటాచలం జెడ్పీటీసీ సభ్యుడు ఎం.వెంకటశేషయ్య, విరువూరు సర్పంచ్ బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, ఎంపీటీ సీ సభ్యుడు కొల్లి రాజగోపాల్‌రెడ్డి, సూరాయపాళెం, తాటిపర్తి మాజీ సర్పంచులు ఎం.మల్లారెడ్డి, పలుకూరు పోలిరెడ్డి, వెంకురెడ్డి, జి.శ్రీనివాసులు, ఏడెం శివకుమార్‌రెడ్డి, ఇరిగేషన్ అధికారులు శివకుమార్‌రెడ్డి, రమేష్, విరువూరు, సూరాయపాళెం, మహ్మదాపురం రైతులు ఉన్నారు.