ఎకరాకు బిల్లు47,000
♦ ‘కాళేశ్వరం’ వార్షిక విద్యుత్ వ్యయం రూ.8,677 కోట్లు
♦ కాళేశ్వరం ద్వారా సాగునీటి సరఫరాకు సగటున ఎకరానికి విద్యుత్ బిల్లు రూ.46,732
♦ డీపీఆర్ ప్రకారం కాళేశ్వరం వార్షిక విద్యుత్ అవసరాలు 13,558 మిలియన్ యూనిట్లు
♦ ఎత్తిపోతల పథకాలకు ప్రస్తుతం యూనిట్ విద్యుత్ చార్జీ రూ.6.40
♦ నీటిని ఎత్తిపోసేందుకు విద్యుత్ సరఫరా వ్యయం ఏటా రూ.8,677 కోట్లు
డీపీఆర్‌లో ప్రభుత్వం చూపిన విద్యుత్ చార్జీలు ఏటా రూ.4,067 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి సరఫరా కోసం సగటున ఎకరానికి రూ.46,732 విద్యుత్ బిల్లు కానుంది! డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టు వార్షిక విద్యుత్ అవసరాలు 13,558 మిలియన్ యూనిట్లు. ప్రస్తుతం ఎత్తిపోతల పథకాలకు యూనిట్‌కు రూ.6.40 చొప్పున చార్జీలను విద్యుత్ శాఖ వసూలు చేస్తోంది. ఈ లెక్కన కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు విద్యుత్ సరఫరా వ్యయం ఏటా రూ.8,677 కోట్లు కానుంది. ఈ పథకం కింద 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టును ప్రభుత్వం ప్రతిపా దించగా, సగటున ఎకరా ఆయకట్టుకు నీటి సరఫరాకు ఏటా ఒక పంటకు రూ.47,526 విద్యుత్ బిల్లుల భారం పడనుంది.
డీపీఆర్‌లో లెక్కలు తగ్గించి..
కాళేశ్వరం వార్షిక విద్యుత్ వ్యయాన్ని ప్రభు త్వం డీపీఆర్‌లో సగానికి తగ్గించి చూపింది. భవిష్యత్తులో రూ.3కే యూనిట్ చొప్పున విద్యుత్ లభ్యత ఉంటుందని, దీంతో ఏటా 13,558 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు రూ.4,067 కోట్ల వ్యయం కానుందని పేర్కొం ది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ శాఖ యూనిట్‌కు రూ.6.40 చొప్పున చార్జీ వసూలు చేస్తోంది.
ఎత్తు పెరిగే కొద్దీ.. బిల్లుల మోతే..
మేడిగడ్డ బ్యారేజీ నుంచి కొండపోచమ్మ బ్యారేజీ వరకు నీటి తరలింపు కోసం సగటున ఎకరాకు రూ.46,732 నుంచి రూ.47,526 విద్యుత్ బిల్లు కానుండగా, ఒక్కో బ్యారేజీ కింద ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు వ్యయం ఒక్కోలా ఉండనుంది. బ్యారేజీల ఎత్తు పెరుగుతున్న కొద్దీ మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు విద్యుత్ అవసరాలు పెరిగనున్నాయి. సముద్ర మట్టానికి 500/600 మీటర్ల ఎత్తులో ఉండనున్న మల్లన్నసాగర్, కొండపోచమ్మ బ్యారేజీల కింది ఆయకట్టుకు నీటి సరఫరా కోసం ఎకరాకు రూ.80 వేల వరకు విద్యుత్ బిల్లు కానుందని విద్యుత్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మొత్తం 225 టీఎంసీల గోదావరి జలాలను తరలించే లక్ష్యంతో కాళేశ్వరం బహుళార్థక ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. 225 టీఎంసీల్లో ఆవిరి, సీపేజీ, ఇతర నష్టాలు, తాగు, పరిశ్రమల అవసరాలను తీసేస్తే సాగునీటికి 124 నుంచి 134 టీఎంసీలు మిగలనున్నాయి. కాళేశ్వరం ద్వారా 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటి సరఫరాతో పాటు 18,82,970 ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరిస్తామని ప్రభుత్వం డీపీఆర్‌లో పేర్కొంది. 124–134 టీఎంసీలను 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకే నీటి సరఫరా కోసం కేటాయించినా, సగటున ఒక్కో టీఎంసీతో 17 వేల ఎకరాలకు పైగా సాగు నీటి సరఫరా జరపాల్సి ఉండనుంది.