సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి అనుమతుల ప్రక్రియను వేగిరం చేసిన కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)... అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తోంది. ప్రతి అంశాన్ని అధ్యయనం చేస్తూ అన్నింటి వివరాలు, వివరణలు తీసుకుంటోంది. తాజాగా వ్యయ అంచనా (కాస్ట్ అప్రైజల్) అనుమతులు ఇచ్చేందుకు పలు కీలక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వివరణలు కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటి లభ్యత, వినియోగ సామర్థ్యం, తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు నీటి డిమాండ్‌తో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు కింది ఖర్చు, మత్స్య సంపదతో వచ్చే ఆదాయంపై స్పష్టత కోరింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ (పీఏవో) సీకేఎల్ దాస్ ఇటీవల రాష్ట్ర నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషికి లేఖ రాశారు.
అది కాళేశ్వరంలో భాగమా.. వేరేనా?
ఎల్లంపల్లి ప్రాజెక్టును 20 టీఎంసీల సామర్థ్యంతో గతంలోనే చేపట్టారని, దాన్ని ప్రస్తుతం కాళేశ్వరంలో భాగంగా చూస్తున్నారా, లేక విడిగా చూస్తున్నారా, దాని ఆయకట్టు, వ్యయం అంచనాలను కాళేశ్వరంలో కలిపారా అన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని సీడబ్ల్యూసీ కోరింది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఎల్లంపల్లి నుంచి 10 టీఎంసీల నీటిని సరఫరా చేస్తున్నారని.. దీనికి అయ్యే వ్యయ వివరాలను సమర్పించాలని సూచించింది. ఇక గోదావరిలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 63 టీఎంసీల మేర కేటాయింపులు ఉండగా.. 20 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించారని, దాని కింద 2 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా ఉందని ప్రస్తావించింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకోనున్న 225 టీఎంసీల్లో ఎల్లంపల్లికి మరో 20 టీఎంసీలు చూపారని, వాటిని ఎక్కడ నిల్వ చేస్తారని ప్రశ్నించింది. మరోవైపు ఇక్కడ మత్స్య సంపద ఆదాయాన్ని హెక్టార్‌కు రూ.50 వేలుగా చూపారని... కానీ చేపల పెంపకానికి అయ్యే ఖర్చును తొలగించి, మిగిలే ఆదాయ వివరాలను ఇవ్వాలని సూచించింది.
సమగ్ర వివరాలు కావాలి
కాళేశ్వరం ప్రాజెక్టుకు 13,558 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని, యూనిట్‌కు రూ.3 చొప్పున రూ.4,067 కోట్లు ఖర్చవుతుందని లెక్కించారని సీడబ్ల్యూసీ పేర్కొంది. తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రం కానప్పుడు ఇంత తక్కువ ధరకు విద్యుత్ ఎలా అందుతుందన్న దానిపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. ఇక ప్రాజెక్టులో వినియోగించే పెద్ద పంపులను ఏ ధరలకు తీసుకున్నారన్న దానిపై ప్రాజెక్టు డీపీఆర్‌లో సమగ్ర వివరాలు లేవని, స్పష్టత ఇవ్వాలని కోరింది. దీంతోపాటు ప్రాజెక్టుతో ప్రభావితమయ్యే జనాభా గణాంకాలు, అందిస్తున్న సహాయ పునరావాసం వివరాలు ఇవ్వాలని సూచించింది. ఈ అంశాలన్నింటిపై రాష్ట్ర నీటి పారుదలశాఖ ఇచ్చే వివరణల ఆధారంగా కాస్ట్ అప్రైజల్ అనుమతులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.
ప్రాజెక్టుకు మరింత వేగంగా రుణాలు
కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా చూసేందుకు ఇప్పటికే ఆంధ్రాబ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకుల కన్సార్షియంల నుంచి రూ.18,800 కోట్ల మేర రుణం తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం... ఆ నిధుల విడుదల ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలకు 20 శాతం మార్జిన్ మనీ చెల్లించడం కోసం ప్రతిసారీ ఆర్థిక శాఖ అనుమతి తీసుకుని, ఉత్తర్వులు ఇస్తున్నారు. దీనితో జాప్యమవు తున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ తనకు కేటాయించిన నిధుల నుంచి మార్జిన్ మనీ చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఆ శాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment