గడ్డ కట్టించే చలిలో అందరూ సొంత భద్రత చూసుకుంటారు.కాని ఆమె మాత్రం రోడ్డుపై నివసించే వారి కోసం ఏకంగా హోటల్ రూములే బుక్ చేసింది.
చికాగోలో మొన్నటి బుధవారం నుంచి జీవితం తెల్లబోయింది. పనులు గడ్డకట్టాయి. ఉత్తర ధ్రువపు మంచు ఫలకాలపై చోటు చేసుకున్న వాతావరణమార్పు అమెరికాలోని కొన్ని నగరాలను వొణికించడం మొదలెట్టింది. ముఖ్యంగా చికాగోని. వాతావరణ శాఖ వెంటనే హెచ్చరికలు మొదలెట్టింది. బయట పది నిమిషాలు నిలుచున్నా మంచుకాటు తప్పదని భయపెట్టింది. ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 27 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు మూతపడ్డాయి. కొంచెం ధైర్యం ఉన్న జనం బయట ఆటలకు ప్రయత్నించారు. బయట గుడ్డు పగలకొట్టి ఆమ్లెట్ వేయడం అసంభవం అని నిరూపించారు.
గుడ్డు పగలగొట్టిన మరుక్షణం అది గడ్డకట్టుకుపోతే ఆమ్లెట్ ఎలా వేయడం? వేడి నీళ్లను తీసుకొచ్చి బయటకు చిమ్మితే ఆ నీళ్లు కిందపడేలోపు ఐసుగడ్డలుగా మారుతున్నాయి. ఎవరో వండిన నూడుల్స్ బయటకు తెచ్చి ఫోర్క్‌తో పైకి ఎత్తితే నూడుల్స్ బిగుసుకుపోయి వాటిని చుట్టుకున్న ఫోర్క్ గాలిలో నిలబడింది. జనం ఇలా ఎవరి గొడవల్లో వారు ఉన్నారు. కాని ఒక్క మహిళ మాత్రం తానొక మనిషినని ఇది సాటి మనుషులకు సాయం చేయాల్సిన సమయం అని గుర్తించింది.ఆమె పేరు కాండిస్ పేనె. వయసు 36. షికాగోలో ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసులో మామూలు ఉద్యోగి. ఆమె రోజూ ఆఫీసుకు వెళ్లే దారిలో రోడ్డు పక్క డెబ్బై ఎనభై మంది పేవ్‌మెంట్ మీద నివసించే వారిని గమనించేది.
వారంతా అక్కడ చిన్న చిన్న గుడారాలు వేసుకొని జీవిస్తుంటారు. ఆ ఏరియాలో స్థానికులు ‘టెంట్ సిటీ’ అంటారు. ఇప్పుడు మారిన వాతావరణానికి పెద్ద పెద్ద భవంతులలో ఉన్నవారే వొణికే పరిస్థితి ఉంటే మంచు కమ్ముకుంటున్న ఈ రాత్రి వీరికి ఆసరా ఎవరు అనే ఆలోచన కాండిస్ పేనెకు వచ్చింది. బుధవారం రాత్రి వాళ్లు కనుక పేవ్‌మెంట్ల మీద ఉంటే గడ్డకట్టుకుని చనిపోతారని ఆమెకు అర్థమైంది. వాళ్లను తీసుకెళ్లి ఎక్కడైనా పెట్టేందుకు హోమ్ లేదు. తన ఇల్లు చాలదు. అందుకని తన దగ్గర ఉన్న డబ్బుతో వారికి హోటల్ రూములు బుక్ చేయాలని అనుకుంది. ఆ ప్రాంతంలో ఎన్ని హోటళ్లకు ఫోన్ చేసినా పేవ్‌మెంట్ మనుషులను తమ హోటల్లోకి రానివ్వమని చెప్పారు.
కాని ఒక్క హోటల్ ‘అంబర్ ఇన్’ అందుకు అంగీకరించింది. వెంటనే ఒక్క రోజుకు 70 డాలర్ల లెక్కన కాండిస్ అందులో 20 గదులు బుక్ చేసింది. అంతే కాదు తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘నేను ఇలా రూములు బుక్ చేశాను. టెంట్ సిటీలో ఉన్న దిక్కులేని వారిని కాస్త హోటల్ వరకూ తెచ్చి వదిలిపెట్టండి’ అని నగర వాసులను అభ్యర్థించింది. అంతే. దానిని చూసిన సహృదయులు వెంటనే స్పందించారు. వెంటనే సాయానికి ముందుకు వచ్చారు. డబ్బులు తమకు తామే అంబర్ ఇన్ హోటల్‌కు పంపడం మొదలెట్టారు. బుధవారం నుంచి ఆదివారం వరకు (మంచు తుఫాను అధికంగా ఉంటుందని తెలిసిన ఐదు రోజులు) యాభై రూములు బుక్ అయ్యాయి.
అంతే కాదు టెంట్ సిటీలో ఉన్న 80 మందినే కాక మరో ముప్పై నలభై మంది దిక్కులేనివారిని తీసుకొచ్చి హోటల్‌లో పెట్టారు.‘మొదట వాళ్లు టెంట్లను వదిలి రావడానికి సిద్ధపడలేదు. మా వస్తువులు పోతాయి అన్నారు. పోయిన వస్తువులకు కూడా డబ్బు ఇస్తాను అని వారిని తీసుకొచ్చాను’ అంది కాండిస్.మంచి మనసుతో ఒకరు ప్రయత్నిస్తే దానికి అందరూ తోడవుతారనేదానికి ఉదాహరణగా చాలామంది ఇప్పుడీ నిరుపేదల ఆహారానికి ఏర్పాట్లు చేశారు.
దుస్తులు అందచేశారు. కాండిస్‌ని ప్రశంసలతో ముంచెత్తారు.‘నేను మామూలు మనిషిని. ఇదంతా నాకు కొత్త. కాని ఈ పని చేశాక ఇలా రోడ్డు మీద నివసించేవారి కోసం శాశ్వతంగా ఒక హోమ్ నిర్మించాలని తలంపు మాత్రం వచ్చింది’ అంది కాండిస్.ప్రభుత్వాలే అన్నీ చేయవు. ప్రభుత్వాలకు అన్నీ తెలిసే వీలు ఉండదు.కాని తెలిసిన మనుషులం వెంటనే సాయానికి దిగాలని కాండిస్‌ని చూస్తే అనిపిస్తుంది.అన్నార్తుల కోసం దిగి వచ్చిన నల్ల థెరిసా అని కూడా అనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment