![Cyclonic storm Gaja reach Tamil Nadu today Weather Department alerts - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/16/DsFo4oOWwAEUPEa.jpg.webp?itok=OKcY7UtS)
సాక్షి, చెన్నై/విశాఖపట్నం: తీవ్ర తుపానుగా మారిన ‘గజ’ సైక్లోను తమిళనాడు వైపు దూసుకొస్తోంది. శుక్రవారం వేకువజామున ఆ రాష్ట్ర తీరాన్ని తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ గురువారం హెచ్చరించింది. ఆ సమయంలో గంటకు 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తుపాను ప్రభావంతో ఇప్పటికే చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షం కురుస్తోంది. నాగపట్నానికి 140 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన గజ తుపాను.. కడలూరు, పాంబన్ మీదుగా ముందుకు కదులుతోంది.
ఆ తీరం వెంబడి ఉన్న కడలూరు, నాగపట్నం, పుదుకొట్టై, తిరువారూర్, తంజావూరు, రామనాథపురం జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు, తీర ప్రాంత ప్రజల్ని ప్రత్యేక శిబిరాలకు తరలిస్తున్నారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాలు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. పొరుగున ఉన్న పుదుచ్చేరిలోని కారైక్కాల్ జిల్లాలోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. గురు, శుక్రవారం ఆ ఆరు జిల్లాల్లో విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.
గురువారం సాయంత్రానికే దుకాణాలు, కార్యాలయాలు మూతపడడంతో ఆ జిల్లాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఈస్ట్ కోస్ట్ రోడ్డు మీదుగా కడలూరు–చెన్నైని కలిపే రహదారిని తాత్కాలికంగా మూసి వేశారు. అలాగే, చెన్నై నుంచి మైలాడుదురై మీదుగా వెళ్లే రైళ్లు కొన్ని రద్దు కాగా, మరికొన్ని విరుదాచలం వైపు మళ్లించారు. ఎలాంటి విపత్కర పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయి విపత్తు నిర్వహణ, అగ్ని మాపక సిబ్బందిని సన్నద్ధం చేశారు. తుపాను నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని తీర ప్రాంత భద్రతా దళం హెచ్చరించింది.
కోస్తాకు తప్పిన ‘గజ’ ముప్పు..
దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు గజ తుపాను ముప్పు తప్పింది. తుపాను ప్రభావం ఈ రెండు ప్రాంతాలపై తప్పకుండా ఉంటుందంటూ కొద్దిరోజులుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత నెల్లూరు–చెన్నైల మధ్య అది తీరాన్ని దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. అయితే క్రమేపీ తుపాను తన దిశ మార్చుకుంటూ తమిళనాడు వైపు పయనిస్తోంది. దీంతో కోస్తా, రాయలసీమకు గజ ముప్పు తొలగిపోయినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment