Cyclone Gaja
-
తుపాన్ బాధితులకు రజనీకాంత్ పది ఇళ్లు
చెన్నై,పెరంబూరు: గత ఏడాది గజ తుపాన్ కారణంగా ఇళ్లు కోల్పోయిన డెల్టా జిల్లా ప్రాంత ప్రజల కు నటుడు రజనీకాంత్ 10 ఇళ్లను కట్టి ఇచ్చా రు. వాటిని సోమవారం ఉదయం ఆ ప్రాంత ప్రజలకు అందించారు. వివరాలు.. గత ఏడాది గజతుఫాన్ తమిళనాడును వణికించింది. డెట్టా జిల్లాకు చెందిన ప్రజలు తీవ్రంగా నష్టపోయా రు. నటుడు రజనీకాంత్ తన అభియాన సంఘాలకు డెల్టా జిల్లా ప్రాంత బాధితులను ఇతోదికంగా సాయం చేసి ఆదుకోవాల్సిందిగా పిలుపు నిచ్చారు. రజనీ ప్రజా సంఘం తరఫున డెల్లా జిల్లాలో ఇళ్లు కోల్పోయిన వారికి 10 ఇళ్లను కట్టించి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు నాగపట్టణం, తంజావూరు జిల్లాలలో ఇళ్లు కట్టించే పనులకు పూనుకున్నారు. -
తుపాను బాధితులకు ఇల్లు కట్టించిన లారెన్స్
పెరంబూరు: గజ తుపాన్ బాధితులు 18 మందికి నటుడు, నృత్యదర్శకుడు రాఘవలారెన్స్ ఇల్లు కట్టించి ఇచ్చారు. గత ఏడాది గజ తుపాన్ తమిళనాడులో బీభత్సానికి గురి చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నాగపట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో గజ తుపానుకు పులువురు నిరాశ్రులయ్యారు. దీంతో ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, సినీ ప్రముఖులు ఆ ప్రాంత ప్రజలను కలిసి పరామర్శించడంతో పాటు తగిన సాయం అందించారు. అదే విధంగా నటుడు రాఘవలారెన్స్ తుపాన్ బాధిత ప్రాంతాలను సందర్శించి ఇల్లు కోల్పోయిన వారిలో కొందరికి ఉచితంగా ఇల్లు కట్టించి ఇస్తానని మాట ఇచ్చారు. అన్నట్లుగానే ఆయన నాగపట్టణం జిల్లాలోని తిరుక్కువలై సమీపంలోని కచ్చనగరం సెరనల్లూర్ గ్రామంలోని 18 మంది కుటుంబాలకు రూ.10 లక్షల ఖర్చుతో ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో మంగళవారం లారెన్స్ ఆ ప్రాంతానికి వెళ్లి ఆ 18 కుటుంబాలకు ఇళ్లను స్వాధీనం చేసి గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా తాయ్ అనే సేవా సంస్థను ప్రారంభించిన లారెన్స్ ఆ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ తాయ్ సంస్థ ద్వారా పిల్లలు పట్టించుకోని తల్లిదండ్రులకు తగిన సాయం అందించడంతోపాటు పేద విద్యార్థులకు విద్యాదానం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందుకోసం తన ప్రతి చిత్రం విడుదల అనంతరం 15 రోజుల పాటు పిల్లలకు విద్యాదానం, వృద్ధులకు చేయూతకు కేటాయించినట్లు తెలిపారు. -
గజ తుఫాన్ బాధితులకు ఆది పినిశెట్టి సాయం
దక్షిణ భారతాన్ని వరుస తుఫాన్లు వణికిస్తున్నాయి. ఇప్పటికీ తిత్లీ తుఫాన్ నుండి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా తేరుకోకముందే గజ తుఫాన్ తమిళనాడును జలమయం చేసేసింది. బాదితులను ఆదుకునేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఆదుకునేందుకు విరాళాలను ప్రకటించారు. తాజాగా మరో యంగ్ హీరో ముందుకొచ్చాడు. హీరో ఆది పినిశెట్టి గజ తుఫాన్ బాధితులకు తన వంతు తాను సాయం అందించడానికి ముందుకొచ్చాడు. ఆది పినిశెట్టి తన టీమ్ తో కలిసి హెల్ప్ చేయడానికి కాస్త సమస్యగా ఉన్న కొన్ని ఏరియాలను గుర్తించి.. అక్కడికి వెళ్లి సుమారు 5 టన్నుల రిలీఫ్ మెటీరియల్.. ఫుడ్, మెడిసన్, బెడ్ షీట్స్, సోలార్ లైట్స్, దోమ తెరలు అంధించారు. 4 గ్రామాల్లో దాదాపు 520 కుటుంబాలకు, వారి వారి రేషన్ కార్డులని పరిశీలించి చేయూతనందించారు. అంతేకాకుండా...ఈ తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని, వారిని ఆదుకోవాలని ఆది పినిశెట్టి కోరారు. -
లారెన్స్ దాతృత్వం.. మొదటి ఇళ్లు ఆమెకే కట్టిస్తాడట!
ఇటీవలె తమిళనాడులో గజ తుపాను సృష్టించిన బీభత్సం గురించి తెలిసిందే. దీని ధాటికి ఎంతో మంది వీదిన పడ్డారు. ఎంతో ఆస్తి నష్టంతో పాటు.. ప్రాణనష్టమూ సంభవించింది. అయితే వీరిని ఆదుకోవడానికి తమిళ సినీ ప్రముఖులు ఎంతో మంది ముందుకువచ్చారు. గజ తుపాను ధాటికి ఓ వృద్దురాలి ఇళ్లు కూలిపోయింది.అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. రాఘవ లారెన్స్ కంటపడింది. తుపాను బాధితులకు అండగా.. ఓ యాభై మందికి ఇళ్లు నిర్మించి ఇస్తానని ప్రకటించారు. అందులో భాగంగా మొదటి ఇళ్లును ఆ వృద్దురాలికే కట్టిస్తానని మాటిచ్చారట. ఇంకా ఎవరైనా ఆపదలో ఉంటే.. తనకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. pic.twitter.com/hJTrvAH5zh — Raghava Lawrence (@offl_Lawrence) November 25, 2018 -
గజ తుపాను బాధితులకు ‘లైకా’ భారీ విరాళం
తమిళనాడును వణికించిన గజ తుఫాను బాధితులను ఆదుకునేందుకు సినీ తారలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే హీరో సూర్య కుటుంబంతో పాటు నటులు విజయ్ సేతుపతి, జీవి ప్రకాష్ కుమార్‌లు తమ వంతు సాయాన్ని ప్రకటించారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ విరాళాన్ని ప్రకటించింది. లైకా ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా 2.ఓ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పటికే శంకర్ పది లక్షలు, రజనీ యాభై లక్షల విరాళాన్ని ప్రకటించగా... తాజాగా లైకా సంస్థ అధినేత సుభాస్కరణ్ రూ.1.01కోట్లను సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. #SaveDelta pic.twitter.com/tnKAYfZcVZ — Lyca Productions (@LycaProductions) November 20, 2018 -
గజ తుఫాన్: హీరో సూర్య కుటుంబం విరాళం
సాక్షి, చెన్నై: దక్షిణ తమిళనాడుపై గజ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు ఏడు జిల్లాల్లో ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఇప్పటికే నష్టనివారణ చర్యలకై రంగంలోకి దిగిన తమిళనాడు ప్రభుత్వానికి ఆర్థికంగా భరోసా కల్పించడానికి ఒక్కొక్కరు కదిలి వస్తున్నారు. కోట్ల రూపాయలను నష్టపోయిన తమిళనాడుకు ఆపన్నహస్తం అందించేందుకు సినీ తారలు, రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు, కార్పోరేట్ కంపెనీలు తమ వంతు బాధ్యతను తీసుకుంటున్నాయి. తాజాగా గజా తుఫాన్‌తో ఉక్కిరిబిక్కిరైన తమిళనాడులో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం కోలీవుడ్ టాప్ హీరో సూర్య కుటుంబం 50 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించింది. హీరో సూర్య, ఆయన సతీమణి జ్యోతిక, తండ్రి శివకుమార్, సోదరుడు కార్తీ నలుగురు కలిసి వారి తరఫున ఈ డబ్బును సీఎం సహాయనిధికి ఇవ్వనున్నారు. కేరళ వరదల సమయంలోనూ హీరో సూర్య, ఆయన తమ్ముడు కార్తిలు అందరికంటే ముందుంగా స్పందించి విరాళాలు అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా గజ తుఫాన్‌తో నష్టపోయిన తమిళనాడుకు తమ వంతుగా ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ముందుగా స్పందించి విరాళాన్ని ప్రకటించారు. అదేవిధంగా మరో హీరో విజయ్ సేతుపతి తన వంతు సహాయంగా 25 లక్షల విరాళాన్ని తమిళనాడు ప్రభుత్వానికి అందజేశారు. డీఎంకే ట్రస్ట్ కోటి రూపాయలను, ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి నెల జీతాన్ని ప్రకటించారు. గతంలో కూడా కేరళ వరదలు, తిత్లీ తుఫాన్ సమయంలో చాలా మంది తమిళ, తెలుగు సినీ తారలు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
గజ తుపాను ధాటికి 45 మంది మృతి
చెన్నై: తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా గజతుపాను ధాటికి 45 మంది ఇప్పటివరకు మృతిచెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అనధికారింగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. తుపాను కారణంగా 1.70 లక్షల చెట్లు నేలకూలినట్లుగా అంచనా వేశారు. అలాగే 347 ట్రాన్స్ఫార్మర్లు, 39,938 స్తంభాలు ధ్వంసమయ్యాయి. 4730 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో 2.49 లక్షల మందికి ప్రభుత్వం పునరావసం కల్పించింది. తుపాను ధాటికి తిరువారూర్ జిల్లా పూర్తిగా అతలాకుతలం అయింది. తిరువారూర్, నాగపట్నం జిల్లాల్లో వరద ప్రాంతాలను సందర్శించి, బాధితులను ప్రతిపక్ష నేత స్టాలిన్ పరామర్శించారు. ఆస్తినష్టం అంచనాపై ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబాలను రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. -
‘గజ’ తుపాను మృతులు 59
సాక్షి ప్రతినిధి, చెన్నై: దక్షిణ తమిళనాడుపై గజ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. తుపాను కారణంగా చనిపోయిన వారి సంఖ్య అనధికారిక లెక్కల ప్రకారం శనివారం నాటికి 59కి చేరింది. కొండచరియలు విరిగిపడటంతో కొడైకెనాల్లో నలుగురు చనిపోయారు. దాదాపు ఏడు జిల్లాల్లో ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది. గజ తుపాను నాగపట్నం–వేదారణ్యం మధ్యన శుక్రవారం తీరం దాటిన విషయం తెలిసిందే. తీరం దాటుతున్న సమయంలో అత్యంత తీవ్రతతో వీచిన ఈదురుగాలులు, వర్షాలు కడలూరు, తంజావూరు, తిరువా రూరు, నాగపట్నం, దిండు గల్లు, పుదుక్కోటై, రామనాధపురం జిల్లాల్లో పెను విధ్వంసం సృష్టించాయి. ఈ తుపాను కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని కారైక్కాల్ జిల్లాలోనూ తీవ్ర ప్రభావం చూపింది. తంజావూరు, నాగపట్నం, తిరువారూరు జిల్లాల్లో రూ. 10 వేల కోట్లు నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. కొడైకెనాల్ పరిసరాల్లో 50కి పైగా ప్రాంతాల్లో రోడ్లు తెగిపోవడంతో, వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. 22 వేల ఇళ్లు పాక్షికంగాను, పూర్తిగాను దెబ్బతిన్నాయి. తుపానువల్ల తంజా వూరు, తిరువారూరు, నాగపట్నం, తదితర జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంటనష్టం సంభవించింది. కాగా, తుపాను సహాయ చర్యలను ప్రభుత్వం సమర్ధవంతంగా నిర్వహించడంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి. కాగా, ఈ తుపాను వల్ల 36 మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. పుదుకోట్టైలో ఏడుగురు, కడలూరులో ముగ్గురు, నాగపట్నంలో నలుగురు, తంజావూరులో నలుగురు, తిరుచ్చిలో ఇద్దరు, దిండుగల్‌లో ఇద్దరు, శివగంగైలో ఇద్దరు సహా మొత్తం 36 మంది ప్రాణాలు కోల్పోయారని జాతీయ విపత్తు సహాయ దళం ప్రకటించింది. -
‘గజ’ తుపాను బీభత్సం
నాగపట్టణం/సాక్షి ప్రతినిధి, చెన్నై: భారీ వర్షాలు, ఈదురుగాలులతో విరుచుకుపడిన గజ తుపాను ధాటికి దక్షిణ తమిళనాడు, పుదుచ్చేరిలు శుక్రవారం అతలాకుతలమయ్యాయి. తమిళనాడులోనే 26 మంది మృతి చెందగా భారీ సంఖ్యలో ఆస్తినష్టం జరిగింది. వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇళ్లు కూలడం, పొలాల్లో పంటలు నాశనం కావడం తదితర ఘటనలు చోటుచేసుకున్నాయి. చాలాచోట్ల రోడ్లు కూడా దెబ్బతిని ఎన్నో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు కేంద్రం, రాష్ట్రం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. వందలకొద్దీ సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి దాదాపు 81 వేల మందిని శిబిరాలకు తరలించారు. జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు పడవలతో రంగంలోకి దిగి ఉధృతంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. తుపాను విషయమై సీఎం పళనిస్వామితో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. తుపాను కారణంగా జరిగిన నష్టం, సహాయక చర్యల గురించి పళనిస్వామి వివరించారు. తమిళనాడును ఆదుకుంటామనీ, అవసరమైన సాయం చేస్తామని మోదీ హామీనిచ్చారు. కాగా, తమిళనాడు రాష్ట్ర విపత్తు స్పందన దళం తుపానును ఎదుర్కోవడంలో మెరుగ్గా పనిచేస్తోందని ప్రతిపక్ష డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రశంసించడం గమనార్హం. వేకువజామున తీరం దాటిన తుపాను శుక్రవారం తెల్లవారుజామున నాగపట్టణం, వేదారణ్యంల మధ్య తుపాను తీరం దాటింది. ఆ సమయంలో గంటలకు 120 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. తమిళనాడులోని కడలూరు, నాగపట్టణం, రామనాథపురం, తంజావూరు, పుదుకోట్టై, తిరువారూరు, తిరుచ్చి జిల్లాలు, పుదుచ్చేరిలోని కరైక్కాల్, పాండిచ్చేరి జిల్లాలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. నాగపట్టణంలోని వేలాంకణి పట్టణంలో ఉన్న ప్రఖ్యాత చర్చి, అక్కడ ఉన్న జీసస్ విగ్రహం తుపాను ధాటికి దెబ్బతిన్నాయి. 7 జిల్లాల్లో మొత్తంగా 4,987 చెట్లు దాదాపు 1,700 ఇళ్లు/గుడిసెలు కూలిపోయాయి. తుపాను కారణంగా కొబ్బరి, అరటి, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయనీ, రైతులకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని రైతు నేత పీఆర్ పాండ్యన్ డిమాండ్ చేశారు. లోటు వర్షపాతంతో సతమతమవుతున్న తమిళనాడు రైతాంగానికి వరంలా గజ తుపాను కారణంగా వర్షాలు కురిశాయని వాతావరణ విభాగం అధికారులు అంటున్నారు. పుదుచ్చేరి పరిధిలోని పాండిచ్చేరి, కరైక్కాల్ జిల్లాల్లో కూడా తుపాను కారణంగా తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. దీనిపై త్వరలోనే కేంద్రానికి నివేదిక పంపుతామని కైరక్కాల్‌లో సీఎం నారాయణస్వామి చెప్పారు. పుదుచ్చేరిలో మొత్తం 190 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి, దాదాపు 6,000 మందిని అక్కడకు తరలించామన్నారు. తంజావూరులో 10మంది మృతి తుపాను కారణంగా ఒక్క తంజావూరు జిల్లాలో ఓ చిన్నారి సహా 10 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. తిరువారూరులో ఐదుగురు, పుదుకోట్టై, కడలూరుల్లో ముగ్గురు చొప్పున, తిరుచ్చిలో ఇద్దరు, నాగపట్టణంలో ఒకరు, తిరువణ్ణామలై, శివగంగైల్లో ఒకరు చొప్పున మరణించారు. తుపాను కారణంగా 15 మంది చనిపోయారని సీఎం ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబీకులకు రూ. 10 లక్ష నష్ట పరిహారాన్ని అందజేస్తామన్నారు. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం సాక్షి, విశాఖపట్నం: నాగపట్టణం, వేదారణ్యంల మధ్య తీరం దాటిన అనంతరం గజ తుపాను వాయుగుండంగా మారిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. తిరుపతి, కోడూరు, గూడూరు తదితరప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయని చెప్పింది. ఆదివారం దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది కూడా వాయుగుండంగా బలపడే అవకాశం ఉందనీ, దక్షిణ కోస్తా ఆంధ్ర, తమిళనాడులపై ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
22 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
చెన్నై: గజ తుపాను ప్రభావంతో తమిళనాడు ప్రభుత్వం 22 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. తుపాను కారణంగా సుమారు 80 వేల మంది ప్రజలను 438 పునరావాస కేంద్రాలకు తరలించారు. ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షంతో పాటు భారీగా గాలులు వీస్తుండటంతో పుదుకోటైలో ఓ ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందగా, కారైక్కాల్‌లో విద్యుత్ షాక్ తగిలి ఒకరు చనిపోయారు. తీవ్ర ప్రభావిత ప్రాంతాలలో సహాయక బృందాలను ఏర్పాటు చేసి పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తోంది. గజ తుపాను కారణంగా మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. -
తమిళనాడు..‘గజ’ గజ!
సాక్షి, చెన్నై/విశాఖపట్నం: తీవ్ర తుపానుగా మారిన ‘గజ’ సైక్లోను తమిళనాడు వైపు దూసుకొస్తోంది. శుక్రవారం వేకువజామున ఆ రాష్ట్ర తీరాన్ని తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ గురువారం హెచ్చరించింది. ఆ సమయంలో గంటకు 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తుపాను ప్రభావంతో ఇప్పటికే చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షం కురుస్తోంది. నాగపట్నానికి 140 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన గజ తుపాను.. కడలూరు, పాంబన్ మీదుగా ముందుకు కదులుతోంది. ఆ తీరం వెంబడి ఉన్న కడలూరు, నాగపట్నం, పుదుకొట్టై, తిరువారూర్, తంజావూరు, రామనాథపురం జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు, తీర ప్రాంత ప్రజల్ని ప్రత్యేక శిబిరాలకు తరలిస్తున్నారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాలు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. పొరుగున ఉన్న పుదుచ్చేరిలోని కారైక్కాల్ జిల్లాలోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. గురు, శుక్రవారం ఆ ఆరు జిల్లాల్లో విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. గురువారం సాయంత్రానికే దుకాణాలు, కార్యాలయాలు మూతపడడంతో ఆ జిల్లాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఈస్ట్ కోస్ట్ రోడ్డు మీదుగా కడలూరు–చెన్నైని కలిపే రహదారిని తాత్కాలికంగా మూసి వేశారు. అలాగే, చెన్నై నుంచి మైలాడుదురై మీదుగా వెళ్లే రైళ్లు కొన్ని రద్దు కాగా, మరికొన్ని విరుదాచలం వైపు మళ్లించారు. ఎలాంటి విపత్కర పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయి విపత్తు నిర్వహణ, అగ్ని మాపక సిబ్బందిని సన్నద్ధం చేశారు. తుపాను నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని తీర ప్రాంత భద్రతా దళం హెచ్చరించింది. కోస్తాకు తప్పిన ‘గజ’ ముప్పు.. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు గజ తుపాను ముప్పు తప్పింది. తుపాను ప్రభావం ఈ రెండు ప్రాంతాలపై తప్పకుండా ఉంటుందంటూ కొద్దిరోజులుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత నెల్లూరు–చెన్నైల మధ్య అది తీరాన్ని దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. అయితే క్రమేపీ తుపాను తన దిశ మార్చుకుంటూ తమిళనాడు వైపు పయనిస్తోంది. దీంతో కోస్తా, రాయలసీమకు గజ ముప్పు తొలగిపోయినట్లయింది. -
నేడు తీరం దాటనున్న ‘గజ’
-
నేడు తీరం దాటనున్న ‘గజ’
సాక్షి, చెన్నై: తమిళనాడు వైపు దూసుకొస్తున్న గజ తుఫాన్ చెన్నైకి 300 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గురువారం సాయంత్రం కడలూరు, పంబన్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఎనిమిది జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని కడలూరు, నాగపట్నం, పుదక్కోట, తంజావూరు, తిరువారూరు, కారైకాల్, రామనాథపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ఎనిమిది జిల్లాల్లోని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అంతేకాకుండా మధురై, రామేశ్వరం వైపు వెళ్లే పలు రైళ్లును రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. తుపాన్ తీరం దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దక్షిణ కోస్తాపై గజ తుఫాన్ ప్రభావం గజ తూఫాన్ కారణంగా బంగాళాఖాతంలో అలల ఉధృతి పెరగడంతో నెల్లూరు జిల్లాలోని మైపాడు, కోడూరుపాడు, తుమ్మలపెంలోకి సముద్ర అలలు చొచ్చుకొచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు చిత్తూరు జిల్లాలోని 30మండలాల్లో కూడా గజ తుపాన్ కారణంగా వర్షాలు కురుస్తున్నాయి.