పుదుచ్చెరి నావలూరులో తుపాను ధాటికి ఆటోపై భారీ వృక్షం కూలడంతో ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్
నాగపట్టణం/సాక్షి ప్రతినిధి, చెన్నై: భారీ వర్షాలు, ఈదురుగాలులతో విరుచుకుపడిన గజ తుపాను ధాటికి దక్షిణ తమిళనాడు, పుదుచ్చేరిలు శుక్రవారం అతలాకుతలమయ్యాయి. తమిళనాడులోనే 26 మంది మృతి చెందగా భారీ సంఖ్యలో ఆస్తినష్టం జరిగింది. వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇళ్లు కూలడం, పొలాల్లో పంటలు నాశనం కావడం తదితర ఘటనలు చోటుచేసుకున్నాయి. చాలాచోట్ల రోడ్లు కూడా దెబ్బతిని ఎన్నో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అటు కేంద్రం, రాష్ట్రం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. వందలకొద్దీ సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి దాదాపు 81 వేల మందిని శిబిరాలకు తరలించారు. జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్) బృందాలు పడవలతో రంగంలోకి దిగి ఉధృతంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. తుపాను విషయమై సీఎం పళనిస్వామితో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. తుపాను కారణంగా జరిగిన నష్టం, సహాయక చర్యల గురించి పళనిస్వామి వివరించారు. తమిళనాడును ఆదుకుంటామనీ, అవసరమైన సాయం చేస్తామని మోదీ హామీనిచ్చారు. కాగా, తమిళనాడు రాష్ట్ర విపత్తు స్పందన దళం తుపానును ఎదుర్కోవడంలో మెరుగ్గా పనిచేస్తోందని ప్రతిపక్ష డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రశంసించడం గమనార్హం.
వేకువజామున తీరం దాటిన తుపాను
శుక్రవారం తెల్లవారుజామున నాగపట్టణం, వేదారణ్యంల మధ్య తుపాను తీరం దాటింది. ఆ సమయంలో గంటలకు 120 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. తమిళనాడులోని కడలూరు, నాగపట్టణం, రామనాథపురం, తంజావూరు, పుదుకోట్టై, తిరువారూరు, తిరుచ్చి జిల్లాలు, పుదుచ్చేరిలోని కరైక్కాల్, పాండిచ్చేరి జిల్లాలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. నాగపట్టణంలోని వేలాంకణి పట్టణంలో ఉన్న ప్రఖ్యాత చర్చి, అక్కడ ఉన్న జీసస్ విగ్రహం తుపాను ధాటికి దెబ్బతిన్నాయి. 7 జిల్లాల్లో మొత్తంగా 4,987 చెట్లు దాదాపు 1,700 ఇళ్లు/గుడిసెలు కూలిపోయాయి.
తుపాను కారణంగా కొబ్బరి, అరటి, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయనీ, రైతులకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని రైతు నేత పీఆర్ పాండ్యన్ డిమాండ్ చేశారు. లోటు వర్షపాతంతో సతమతమవుతున్న తమిళనాడు రైతాంగానికి వరంలా గజ తుపాను కారణంగా వర్షాలు కురిశాయని వాతావరణ విభాగం అధికారులు అంటున్నారు. పుదుచ్చేరి పరిధిలోని పాండిచ్చేరి, కరైక్కాల్ జిల్లాల్లో కూడా తుపాను కారణంగా తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. దీనిపై త్వరలోనే కేంద్రానికి నివేదిక పంపుతామని కైరక్కాల్‌లో సీఎం నారాయణస్వామి చెప్పారు. పుదుచ్చేరిలో మొత్తం 190 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి, దాదాపు 6,000 మందిని అక్కడకు తరలించామన్నారు.
తంజావూరులో 10మంది మృతి
తుపాను కారణంగా ఒక్క తంజావూరు జిల్లాలో ఓ చిన్నారి సహా 10 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. తిరువారూరులో ఐదుగురు, పుదుకోట్టై, కడలూరుల్లో ముగ్గురు చొప్పున, తిరుచ్చిలో ఇద్దరు, నాగపట్టణంలో ఒకరు, తిరువణ్ణామలై, శివగంగైల్లో ఒకరు చొప్పున మరణించారు. తుపాను కారణంగా 15 మంది చనిపోయారని సీఎం ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబీకులకు రూ. 10 లక్ష నష్ట పరిహారాన్ని అందజేస్తామన్నారు.
రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: నాగపట్టణం, వేదారణ్యంల మధ్య తీరం దాటిన అనంతరం గజ తుపాను వాయుగుండంగా మారిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. తిరుపతి, కోడూరు, గూడూరు తదితరప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయని చెప్పింది. ఆదివారం దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది కూడా వాయుగుండంగా బలపడే అవకాశం ఉందనీ, దక్షిణ కోస్తా ఆంధ్ర, తమిళనాడులపై ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment