సాక్షి, చెన్నై: దక్షిణ తమిళనాడుపై గజ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు ఏడు జిల్లాల్లో ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఇప్పటికే నష్టనివారణ చర్యలకై రంగంలోకి దిగిన తమిళనాడు ప్రభుత్వానికి ఆర్థికంగా భరోసా కల్పించడానికి ఒక్కొక్కరు కదిలి వస్తున్నారు. కోట్ల రూపాయలను నష్టపోయిన తమిళనాడుకు ఆపన్నహస్తం అందించేందుకు సినీ తారలు, రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు, కార్పోరేట్ కంపెనీలు తమ వంతు బాధ్యతను తీసుకుంటున్నాయి. తాజాగా గజా తుఫాన్‌తో ఉక్కిరిబిక్కిరైన తమిళనాడులో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం కోలీవుడ్ టాప్ హీరో సూర్య కుటుంబం 50 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించింది. హీరో సూర్య, ఆయన సతీమణి జ్యోతిక, తండ్రి శివకుమార్, సోదరుడు కార్తీ నలుగురు కలిసి వారి తరఫున ఈ డబ్బును సీఎం సహాయనిధికి ఇవ్వనున్నారు.
కేరళ వరదల సమయంలోనూ హీరో సూర్య, ఆయన తమ్ముడు కార్తిలు అందరికంటే ముందుంగా స్పందించి విరాళాలు అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా గజ తుఫాన్‌తో నష్టపోయిన తమిళనాడుకు తమ వంతుగా ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ముందుగా స్పందించి విరాళాన్ని ప్రకటించారు. అదేవిధంగా మరో హీరో విజయ్ సేతుపతి తన వంతు సహాయంగా 25 లక్షల విరాళాన్ని తమిళనాడు ప్రభుత్వానికి అందజేశారు. డీఎంకే ట్రస్ట్ కోటి రూపాయలను, ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి నెల జీతాన్ని ప్రకటించారు. గతంలో కూడా కేరళ వరదలు, తిత్లీ తుఫాన్ సమయంలో చాలా మంది తమిళ, తెలుగు సినీ తారలు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment