సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వరుణుడు కరుణ జల్లులు కురిపిస్తున్నాడు. వరుసగా మూడో ఏటా కరువుతీరా వర్షం కురుస్తోంది. నేలతల్లి పులకిస్తోంది. జూన్, జూలై నెలల్లో రాష్ట్రంలో 34 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాయలసీమలో సాధారణంగా కురిసే వర్షాల కంటే 82 శాతం అధిక వర్షాలు కురవగా, కోస్తాంధ్రలో 14 శాతం అధిక వర్షం కురిసింది. ఉత్తరాంధ్ర వరకే చూసినప్పుడు అక్కడి మూడు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలల్లో సగటున 222 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా 298 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో జూన్ ఒకటి నుంచి జూలై 31 వరకు రాష్ట్ర వర్షపాత వివరాలను వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం విడుదల చేసింది. అనంతపురంలో 121.9 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 252 మి.మీ. (103 శాతం అధికం) కురిసింది. వైఎస్సార్ కడప జిల్లాలో 163.9 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 330.5 మి.మీ. (102 శాతం అధికం) కురిసింది. చిత్తూరు జిల్లాలో 173.8 మి.మీ.కిగానూ 335.5 మి.మీ. (93 శాతం అధికం).. కర్నూలు జిల్లాలో 199.5 మి.మీ.కిగానూ 283.2 మి.మీ. (42 శాతం అధికం) కురిసింది.
కృష్ణాలో 45 శాతం అధికం..
కృష్ణా జిల్లాలో 314 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 456.6 మి.మీ (45 శాతం అధికం) వర్షం పడింది. గుంటూరు జిల్లాలో 241.5 మి.మీ.కిగానూ 308.4 మి.మీ. (28 శాతం అధికం), తూర్పుగోదావరి జిల్లాలో 336.9 మి.మీకి గానూ 423.5 మి.మీ. (26 శాతం అధికం), పశ్చిమగోదావరి జిల్లాలో 363.3 మి.మీ.కిగానూ 449 మి.మీ. (24 శాతం అధికం) వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలో 143.5 మి.మీ.కిగానూ 175.7 మి.మీ. (22 శాతం అధికం), ప్రకాశం జిల్లాలో 166.9 మి.మీ.కిగానూ 186.3 మి.మీ. (12 శాతం అధికం) వర్షం పడింది. విశాఖపట్నం జిల్లాలో 297.6 మి.మీ.కిగానూ 257.5 మి.మీ. (13 శాతం లోటు) వర్షం, విజయనగరం జిల్లాలో 325.3 మి.మీ.కిగానూ 288.8 మి.మీ. (11 శాతం లోటు), శ్రీకాకుళం జిల్లాలో 340.2 మి.మీ.కిగానూ 319 మి.మీ. (6 శాతం లోటు) వర్షపాతం నమోదైంది. 15 శాతం తక్కువ వర్షపాతం నమోదైనా వాతావరణ శాఖ దాన్ని సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తుంది. దీంతో ఉత్తరాంధ్రలో సాధారణం కంటే కొంచెం తక్కువ వర్షం పడినా అది సాధారణమే.
Comments
Please login to add a commentAdd a comment