జూన్‌లో 58% అధిక వర్షపాతం
రాయలసీమలో అత్యధిక వర్షాలు
కోస్తాంధ్రలో అధికం
180 శాతంతో సత్యసాయి జిల్లా అగ్రస్థానం
ఈ నెలలోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు సీజన్ ఆరంభం నుంచే అధిక వర్షాలు కురిపించాయి. రాష్ట్రంలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం 91.2 మి.మీ. కాగా.. 143.7 మి.మీ. వర్షం కురిసింది. 52.5 మి.మీ. అధిక వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 58 శాతం అధికం.
సస్యశ్యామల ‘సీమ’
నైరుతి రుతు పవనాలు ఈ ఏడాది రాయలసీమను కరుణించాయి. రాయలసీమలోని 8 జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతమే నమోదైంది. కోస్తాంధ్రలోని అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే అత్యధిక వర్షం కురవగా.. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, బాపట్ల, ఏలూరు, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. ఇక తూర్పు గోదావరి, కాకినాడ, ఎనీ్టఆర్, పార్వతీపురం మన్యం, విజయనగరం, పశి్చమ గోదావరి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే.. రాష్ట్రంలోకెల్లా శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధికంగా 180 శాతం వర్షపాతం కురిసింది.
ఆ జిల్లాలో జూన్‌లో 55.1 మి.మీ.లకు గాను 154.2 మి.మీ. వర్షం పడింది. ఆ తర్వాత 177 శాతంతో అనంతపురం రెండో అత్యధిక వర్షం కురిసిన జిల్లాల్లో నిలిచింది. అక్కడ 63.6 మి.మీ.లకు 176.2 మి.మీ. వర్షం కురిసింది. రాష్ట్రంలో వాతావరణ విభాగం పరిధిలో కోస్తాంధ్ర, రాయలసీమ సబ్ డివిజన్లు ఉన్నాయి. ఈ లెక్కన కోస్తాంధ్రలో 105.6 మి.మీ.లకు 129.1 మి.మీ. (22 శాతం అధికం), రాయలసీమలో 70.7 మి.మీ.లకు 160 మి.మీ. (127 శాతం అధికం) వర్షపాతం నమోదైంది.
సీమలోనే ఎక్కువ ఎందుకంటే..
కోస్తాంధ్ర కంటే రాయలసీమలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడానికి కారణాలున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు జూన్ ఆరంభంలోనే రాయలసీమ మీదుగా కోస్తాంధ్రలోకి ప్రవేశించాయి. ఆ సమయంలో రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తాలోకి విస్తరించిన రుతుపవనాలు ముందుకు కదలకుండా 10 రోజులపాటు స్తబ్దుగా ఉండిపోయాయి. దీంతో ఆ సమయంలో రాయలసీమలో వర్షాలు కొనసాగాయి. కోస్తాంధ్రలో.. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో తేలికపాటి జల్లులే కురిశాయి. దీంతో రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతం రికార్డయింది.
జూలైలోనూ సమృద్ధిగా..
జూన్ నెలలో ఆశాజనకంగా కురిసిన వర్షాలు జూలైలో మరింత సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతు పవనాల ప్రభావం జూలైలో అధికంగా ఉంటుందని, ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురిసే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటున్నారు. అలాగే జూలై నెలలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడే అవకాశం ఉందని.. ఇవి కూడా వర్షాలు కురవడానికి దోహదపడతాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment