కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం... దీని ప్రభావంతో ఉత్తర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
వాతావరణ శాఖ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కోస్తా ఆంధ్రా, యానాం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని, ఈ ఆవ ర్తనం క్రమంగా బలపడి గురువారం ఉదయం కల్లా పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగుడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ప్రధానంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు జారీ చేసింది.
2.06 సెంటీమీటర్ల వర్షపాతం..
బుధవారం రాష్ట్రంలో సగటున 2.06 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సిద్దిపేట జిల్లాలో 5.47 సెంటీమీటర్లు, మేడ్చ ల్ మల్కాజిగిరి జిల్లాలో 4.3 సెంటీమీటర్లు, జోగులాంబ గద్వాల జిల్లాలో 3.12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అన్ని జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వివరించింది.
నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో ఇప్పటివరకు 59.77 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 83.64 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 40 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళికా శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆరు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment