తుపాను నేపథ్యంలో పడవలను వెరావల్ హార్బర్‌లోనే ఉంచేసిన దృశ్యం
అహ్మదాబాద్: గుజరాత్‌ను భయపెట్టిన ‘వాయు’ తుపాను తన దిశను మార్చుకుంది. అరేబియా సముద్రంలో అల్లకల్లోలం రేపుతున్న ఈ తుపాను ప్రస్తుతం ఒమన్ వైపు పయనిస్తోంది. అయినప్పటికీ, గుజరాత్ తీరం వెంబడి వర్షాలు, గాలుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. ‘వాయు’ తుపాను హెచ్చరికలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఇప్పటికే మూడు లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ‘వాయు’ గమనం మార్చుకున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపినప్పటికీ మరో 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించినట్లు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తెలిపారు. ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని పాఠశాలలు శుక్రవారం కూడా మూసే ఉంటాయని ప్రకటించారు.
‘వాయు’ దిశ మారినప్పటికీ సౌరాష్ట్ర తీరం వెంబడి రాగల 24 గంటల్లో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. అరేబియా సముద్రంలో దాదాపు 900 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న వాయు తుపాను ప్రభావం తొలగిపోయినట్లు భావించలేమని అధికార వర్గాలు చెప్పాయి. వాయు ప్రభావంతో రాష్ట్రంలో ఎటువంటి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు సమాచారం లేదని తెలిపాయి. పోర్‌బందర్‌లోని 150 ఏళ్ల నాటి భూతేశ్వర్ మహాదేవ్ ఆలయం తీవ్ర గాలులు, భారీవర్షం ధాటికి కుప్పకూలిందని వెల్లడించాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైల్వే శాఖ 86 రైళ్లను రద్దు చేసి, 37 రైళ్ల ప్రయాణ మార్గాన్ని కుదించింది.
Comments
Please login to add a commentAdd a comment