శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అత్యంత భారీ వానలు
పూరీ వద్ద నేడు తీరం దాటనున్న వాయుగుండం
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచన
కళింగపట్నం, విశాఖ, భీమిలి, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం: పశి్చమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. ప్రస్తుతం కళింగపటా్ననికి 240 కి.మీ., పూరీకి ఆగ్నేయంగా 150 కి.మీ., పశి్చమ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణంగా 350 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ సోమవారం మధ్యాహ్నం పూరీకి సమీపంలో తీరం దాటే సూచనలున్నాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అనంతరం ఒడిశా, ఛత్తీస్‌గడ్ మీదుగా ప్రయాణిస్తూ బలహీన పడనుందని వెల్లడించారు.
వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై సోమవారం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం వరకూ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 10వ తేదీ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని, కోస్తాంధ్రలో మిగిలిన చోట్ల చెదురుమదురు వర్షాలు పడేందుకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కి.మీ. గరిష్టంగా 70 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో తీరం అల్లకల్లోలంగా మారింది. కళింగపట్నం, విశాఖపట్నం, భీమిలి, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రపు అలలు 1.3 నుంచి 1.6 మీటర్/సెకెను వేగంతో దూసుకొస్తుండటంతో, పర్యాటకులు ప్రమాదాలకు గురికాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment