వెరావల్‌లో తీరం వెంట ఎగసిపడుతున్న భారీ అలలు.
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ఉత్తరభారతంలో ఒక వైపు సూర్యుడి ప్రతాపంతో జనం అల్లాడుతుండగా మరోవైపు ‘వాయు’తుపాను గుజరాత్ వైపు ప్రచండ వేగంతో దూసుకువస్తోంది. గుజరాత్ తీరంలోని కచ్, సౌరాష్ట్ర ప్రాంతంపై ‘వాయు’ ప్రభావం మరో 24 గంటలు ఉంటుందని, భారీ వర్షాలు కురియడంతోపాటు గంటకు 170 కిలోమీటర్ల వేగంతో తీవ్రగాలులు వీస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా తీరం ప్రాంతాల్లోని పది జిల్లాల లోతట్టు ప్రాంతాలకు చెందిన 3 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎన్‌డీఆర్‌ఎఫ్, సైన్యం, నావికా దళం, వాయుసేన ప్రభావిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. ప్రభుత్వం, స్థానిక విభాగాలు అందించే సూచనలు, సలహాలను పాటించి సురక్షితంగా ఉండాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులను ట్విట్టర్‌లో కోరారు.
వాతావరణ శాఖ హెచ్చరిక
‘వాయు’తుపాను అతితీవ్రంగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పోర్‌బందర్, కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూల మధ్య గురువారం ఉదయం భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. తీరం దాటిన తర్వాత తుపాను సాధారణంగా బలహీన పడుతుంది. ఇందుకు విరుద్ధంగా, ‘వాయు’మరింత తీవ్రంగా మారనుందని తెలిపింది. వెరావల్‌కు దక్షిణంగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ‘వాయు’ గురువారం మధ్యాహ్నం వెరావల్, దక్షిణ ద్వారక మధ్య తీరాన్ని తాకే అవకాశ ముందని తెలిపింది. అరేబియా సముద్రంలో అలలు ఉవ్వెత్తున లేచి తీరాన్ని తాకుతాయని తెలిపింది.
అధికార యంత్రాంగం అప్రమత్తం
తుపాను హెచ్చరికలతో గుజరాత్, డయ్యూ యంత్రాంగాలతోపాటు కేంద్రం అప్రమత్తమైంది. జాతీయ విపత్తు నిర్వహణ సహాయ దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్), సైన్యం ప్రభావిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. యుద్ధ నౌకలు, నావికా దళ విమానాలను కూడా సిద్ధం చేశారు. తీరంలోని నౌకాశ్రయాలను ముందు జాగ్రత్తగా మూసివేయాలని ఆదేశించినట్లు ప్రభుత్వం పేర్కొంది. పోర్‌బందర్, డయ్యూ, భావ్‌నగర్, కెశోద్, కాండ్లా ఎయిర్‌పోర్ట్‌లను 13వ తేదీ అర్ధరాత్రి వరకు మూసివేస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని కొన్ని బస్ సర్వీసులను రద్దు చేసింది. విద్యా సంస్థలకు 12, 13 తేదీల్లో సెలవులిచ్చారు. ఇప్పటికే 70 రైళ్లు రద్దుచేశారు. వచ్చే రెండు రోజులపాటు కొన్ని రైళ్లను రద్దు చేయడమో లేక దారిమళ్లించడమో చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ముంబైకి రాకపోకలు సాగించే 400 విమానాలకు అంతరాయం కలిగింది.
జామ్‌నగర్‌కు విమానంలో బయల్దేరిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు
Comments
Please login to add a commentAdd a comment