సిరిసిల్ల–కరీంనగర్ రోడ్డులోని ఆటోనగర్‌ను ముంచెత్తిన వరద
సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వాన ముంచెత్తింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షం కురవగా, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల లోతట్లు ప్రాంతాలు, కాలనీలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులుపడ్డారు. వరంగల్ అర్బన్, రూరల్, ములుగు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. కల్వర్టులు, రోడ్లు తెగి పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన చెరువుల్లో నీరు భారీగా వచ్చి చేరింది. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులో నీరు 15 ఫీట్లకు చేరింది. పట్టణ, నగర ప్రాంత కాలనీల్లోని ఇళ్లకు వరద నీరు భారీగా చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నర్సంపేట మండలం గురిజాలకు చెందిన గడ్డం అనిల్ (38) బైక్‌పై గ్రామ శివారులోని లోలెవల్ వంతెన దాటుతుండగా ప్రమాదవశాత్తు వాగులో పడి నీటి ఉధృతికి అతను కొట్టుకుపోయాడు. వరంగల్ మహానగరంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని భీమేశ్వర వాగు పొంగి పొర్లింది. అవతల చిక్కుకుపోయిన వారిని పోలీసులు జేసీబీ సాయంతో సురక్షితంగా తరలించారు. నిజామా బాద్ జిల్లా మోర్తాడ్‌లో ఆదివారం కురిసిన వర్షంతో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తిప్పలుపడ్డారు. ఇక, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం ఇజ్రాఇట్టంపల్లిలో ఆర్‌అండ్‌బీ రోడ్డును పునఃనిర్మాణం చేసే క్రమంలో మూడేళ్ల క్రితం రోడ్డు పక్కన ఉన్న ఇళ్లకంటే రెండు మీటర్ల ఎత్తు పెంచారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నర్సంపేట సర్వాపురంలోని ఓ కాలనీలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు
కరీంనగర్ జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి వర్షం కురిసింది. అత్యధికంగా హుజూరాబాద్‌లో 90 మి.మీ. వర్షపాతం నమోదు కాగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో సండ్రవాగు పొంగిపొర్లడంతో లక్ష్మీపూర్ వెళ్లే తాత్కాలిక రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లంతకుంట మండలంలో 102 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కుమ్రం భీమ్ ప్రాజెక్టు రెండుగేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఆదివారం జిల్లాలో 73.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్ డివిజన్‌లో 180 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మార్డి గ్రామానికి చెందిన లోద్ద గంగవ్వ(50) పొలంలో నాట్లు వేస్తుండగా పిడుగుపడి మృతిచెందింది.
మరో రెండ్రోజులు వర్షాలు
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితలద్రోణి ఏర్పడిందని పేర్కొంది. అల్పపీడనం, ఉపరితలద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని సూచించింది. కాగా, శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు అత్యధికంగా వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment