
సాక్షి, హైదరాబాద్: అధిక ఉష్ణోగ్రతలు, ఉక్క పోతతో అల్లాడుతున్న జనానికి వాతావరణ శాఖ కాస్త చల్లని కబురు చెప్పింది. వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వానలు పడతాయని ప్రకటించింది. మరోవైపు ఈ మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదుకావొచ్చని పేర్కొంది.
19 జిల్లాల్లో వానలకు చాన్స్: ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో మంగళ, బుధ, గురు వారాల్లో ఉరు ములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన తేలిక పాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకా శం ఉందని వెల్లడించింది.
ముఖ్యంగా.. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్ద పల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జన గామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. వానలకు సంబంధించి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
జల్లులు పడినా ఎండల మంటలే..
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. దానితో ఆదివారం రాత్రి వాతావరణం కాస్త చల్లబడింది. అయినా సోమవారం ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా గుల్లకోట, అల్లిపూర్‌లో 46.8 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.4 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23 ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైనే నమోదైంది. వచ్చే మూడు రోజులు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగానే నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment