సాక్షి, అమరావతి: గడచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు తగ్గింది. గత వారం 27 శాతం లోటు వర్షపాతం ఉంటే ఇప్పుడది 19 శాతానికి తగ్గిపోయింది. ఈ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాగు పనులు ఊపందుకున్నాయి. దీంతో బుధవారానికి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 17.54 లక్షల హెక్టార్లకు పెరిగింది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో వరి నాట్లు పుంజుకున్నాయి. గోదావరి వరద తాకిడికి గురైన ప్రాంతాలు మినహా ఉభయ గోదావరి జిల్లాల్లోనూ నాట్లు జోరుగా పడుతున్నాయి. అలాగే విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాధారిత పంటలతోపాటు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనూ వరి నాట్లు ప్రారంభించారు. అయితే రాయలసీమ జిల్లాలు మాత్రం ఇంకా లోటు వర్షపాతంలోనే ఉన్నాయి.
నాలుగు రాయలసీమ జిల్లాలుసహా మొత్తం ఏడు జిల్లాలు బుధవారానికి 20 శాతం నుంచి 50 శాతం వరకు లోటు వర్షపాతంలో ఉన్నాయి. విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు సాధారణ స్థితిలో ఉండగా శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాలు లోటు వర్షపాతంలో ఉన్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వచ్చే రెండు మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో మరికొన్ని జిల్లాల్లోనూ పరిస్థితి మెరుగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అదే జరిగితే పంటల సాగు విస్తీర్ణం వ్యవసాయ శాఖ లక్ష్యాన్ని చేరుతుందని భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని రిజర్వాయర్లకు ఇప్పుడిప్పుడే నీరు రావడం ప్రారంభమైంది. ఈసారి శ్రీశైలం, సాగర్‌లు నిండేందుకు ఆస్కారం కనిపిస్తున్నందున సాగర్ కుడికాలువకు నీరిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తగ్గిన వర్షపాతం లోటు...
ఈ ఖరీఫ్ సీజన్‌లో నైరుతీ రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మొత్తంగా 556 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికి 275.4 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. అయితే 224.1 మిల్లీమీటర్లే కురిసింది. అయితే గత వారం 27 శాతం లోటు వర్షపాతం ఉండగా.. తాజాగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మెరుగైంది. వర్షపాతం లోటు ప్రస్తుతం 19 శాతానికి తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో సాగు విస్తీర్ణం సైతం పెరుగుతోంది. వాస్తవానికి ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం లక్ష్యం 38.30 లక్షల హెక్టార్లుగా ఖరారు చేశారు.
సాధారణ పరిస్థితుల్లో ఇప్పటికి 22.17 లక్షల హెక్టార్లు అంటే సుమారు 79 శాతం విస్తీర్ణంలో పంటలు వేసి ఉండాల్సింది. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ఇప్పటివరకు 17.74 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వేసిన పంటల్లో ఎక్కువగా జొన్న, సజ్జ, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలతోపాటు వరి ఉంది. మొక్కజొన్న, రాగి, కంది, పత్తి, చెరకు వంటి పంటలైతే 75 శాతం వరకు వేసినట్టు వ్యవసాయ శాఖ లెక్కలేసింది. ఈ సీజన్‌లో ఇప్పటికి 7.44 లక్షల హెక్టార్లలో వరినాట్లు పడాల్సి ఉండగా.. 6.33 లక్షల హెక్టార్లలో వేశారు. ఖరీఫ్‌లో మొత్తంగా 15.19 లక్షల హెక్టార్లలో వరి పంటను సాగు చేయాలన్నది లక్ష్యం. ఇదిలా ఉంటే.. గోదావరి వరదలతో నీట మునిగి దెబ్బతిన్న వరి నారు మళ్లు తిరిగి పోసుకునేందుకు వీలుగా నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది.
గమనిక: +19 % నుంచి –19% వరకు ఉంటే సాధారణ వర్షపాతం కింద, +20%, ఆపైన ఉంటే అధిక వర్షపాతం కింద, –20 % నుంచి –59 % వరకు ఉంటే లోటు వర్షపాతం కింద, –59 % నుంచి –99 % వరకు ఉంటే భారీ లోటు వర్షపాతం కింద పరిగణిస్తారు)
Comments
Please login to add a commentAdd a comment