(సాక్షి నెట్‌వర్క్) : రాయలసీమ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉమ్మడి వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ప్రకాశం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపిలేని వర్షం కురిసింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
రాజోలి ఆనకట్టకు భారీగా నీరు..
కర్నూలు, నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరు వైఎస్సార్ జిల్లా మండల పరిధిలోని రాజోలి ఆనకట్టకు భారీగా వచ్చి చేరుతోంది. కుందూ పరీవాహక గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ ఇందిరారాణి సూచించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. జిల్లాలో రికార్డు స్థాయిలో 73.2 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లాలో సగటున 53.4, కర్నూలు జిల్లాలో సగటున 19.8 మి.మీ. వర్షం కురిసింది.
రెండు రోజులుగా తిరుపతి జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం జిల్లాలో గరిష్టంగా బాలయపల్లి మండలంలో 118.2 మి.మీ వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా తిరుపతి అర్బన్‌లో 1.4 మి.మీ వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా తవణంపల్లె మండలంలో 83.6 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వివిధ మండలాల్లో ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ వర్షాలు కురిశాయి.
అటు సత్యసాయి జిల్లా, ఇటు అనంతపురం జిల్లావ్యాప్తంగా మోస్తరు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో మొదటిసారిగా పుట్లూరు మండలంలో 111.6 మి.మీ. భారీ వర్షం కురిసింది. ప్రకాశం జిల్లాలో శనివారం అర్ధరాత్రి, ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆదివారం ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. కృష్ణా జిల్లాలో సగటున 17.2 మి.మీ., ఎన్టీఆర్ జిల్లాలో 25.52 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది.
♦ వైఎస్సార్ జిల్లా చెన్నూరు వద్ద పెన్నా నదిలో ఆదివారం రాత్రి అకస్మాత్తుగా నీటి ఉధృతి ఎక్కువైంది. నదిలో షికారుకు వెళ్లిన చెన్నూరు కొత్త గాంధీనగర్‌కు చెందిన వెంకట సుబ్బయ్య, రాజు, రమణ(పెద్దోడు), వెంకట సుబ్బయ్య, సుబ్బరాయుడు, శ్రీను, రమణ, రాజేష్ పెన్నా నదిలో షికారుకెళ్లి పెన్నా నదిలో చిక్కుకున్నారు. మైదుకూరు రూరల్ సీఐ, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది బోటు సాయంతో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
♦శనివారం రాత్రి కురిసిన వర్షానికి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్.ఉప్పలపాడు సమీపంలోని ఇసుక వంకలో వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. కర్నూలు నుంచి ప్రొద్దుటూరు వస్తున్న ఆర్టీసీ బస్సు ఇసుక వంకలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న అర్బన్ సీఐ సదాశివయ్య పోలీసులు, రెస్క్యూ టీమ్ వెళ్లి వరద నీటిలో చిక్కుకున్న 13 మంది ప్రయాణికులను, డ్రైవర్, కండక్టర్‌ను తాడు సాయంతో ఉప్పలపాడు వైపు గట్టుకు తీసుకొచ్చారు.
రేపు అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మంగళవారం వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడనుంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి, ఆంధ్రప్రదేశ్‌ను ఆనుకుని ఉన్న తెలంగాణపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్ర, రాయలసీమలపై బలంగా ఉన్నాయి. వీటన్నిటి ఫలితంగా సోమవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడా భారీ వర్షాలు కురవనున్నాయి.
సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు.. పార్వతీపురం మన్యం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
మంగళవారం ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోను, బుధవారం ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు కూడా సంభవిస్తాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment