
సాక్షి, హైదరాబాద్: దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. దీంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా బుధవారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గత 24 గంటల్లో కామారెడ్డి జిల్లా నాగరెడ్డిపేట్‌లో 7 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా పాపన్నపేటలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.
మరోవైపు కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో 240 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, 41 మంది మృతి చెందారని హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే మరో 5 వేల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, దాదాపు 5,900 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పింది. హెలికాప్టర్ ద్వారా ఐదుగురిని రక్షించామని పేర్కొంది. వర్షాలు, వరదలు ఇంకా కొనసాగనున్న నేపథ్యంలో పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment