
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్‌లో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. రాబోయే మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. హిందూ మహాసముద్రం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో గురువారం అల్పపీడనం ఏర్పడి తీవ్ర అల్పపీడనంగా మారిందని తెలిపింది.
దీనికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. ఇది తర్వాతి 24 గంటలలో తీవ్రంగా మారి హిందూ మహాసముద్రం, దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. మరఠ్వాడా నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment