
్చ్చజలకళ సంతరించుకున్న ఇల్లందకుంట చెరువు
కరీంనగర్ సిటీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న ముసురు శనివారంతో ఊపందుకుంది. ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా అన్నిమండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా సగటున 12.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధింగా రామడుగు, చొప్పదండి మండలాల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. భారీ వర్షాల సూచన మేరకు సహాయ, పునరావాస చర్యలకు జిల్లాకు ప్రత్యేకాధికారిగా ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్.మీనాను ప్రభుత్వం నియమించింది.
ఆకాశం వైపు ఆశగా ఎదురుచూసిన రైతుకు వరుణుడు కరుణ చూపాడు. వివిధ పంటలపై ఆశలు వదులుకున్న పరిస్థితుల్లో ఆదుకున్నాడు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు మెట్ట పంటలకు ప్రయోజనం చేకూర్చాయి. అయితే ముంచెత్తిన వర్షాలతో పలుచోట్ల పంట చేలల్లో నీరు చేరి మునిగిపోయాయి. చొప్పదండి, గంగా ధర, రామడుగు, వీణవంక, హుజూరాబాద్, తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
పత్తి, వరి పొలాల్లో నీళ్లు చేరాయి. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. ఇదే వర్షాలు కొనసాగితే మత్తడి దుంకి కట్టలు తెగే పరిస్థితి వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ముందస్తుగానే అప్రమత్తమయ్యింది. అవసరమైన సహాయ, పునరావాస చర్యలకు ఉపక్రమించింది. పత్తి చేలు ఎండిపోతున్న దశలో వానలు పడడంతో ఆ పంటకు జీవం పోసినట్లయ్యింది. వాన భారీగా లేకున్నా ముసురుపడడంతో రైతులు కుదుటపడ్డారు. వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పత్తి పంటలకు మేలు
కురుస్తున్న వర్షాలు పత్తి పంటకు మేలును చేకూర్చాయి. జూన్‌లో వర్షాలు సరిగా లేకపోవడంతో పంటలు దెబ్బతినగా జులైలో తుపానుతో కూడిన వర్షాలు ఒకటి రెండు రోజులు పడడంతో పంటల విస్తీర్ణ పెరిగింది. ఇక జూలై నెలాఖరులో వానలు పడలేదు. తాజాగా ఆగస్టు రెండోవారంలో వానలు మొదలయ్యాయి. ప్రస్తుతం కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. తాజాగా పడుతున్న వర్షాలతో రైతులు కొంత మేర గట్టెక్కే అవకాశాలున్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు తెల్లబంగా రంపై అనేక ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం కురిసే వానలకు ఎరువులు వేసే అవకాశాలుంటాయి.
ప్రస్తుతం ముందుగా వేసిన పత్తి చేలకు పూతతోపాటు ఊడలు కూడా వచ్చాయి. భూగర్భజలాలు అడుగంటడం, బావుల్లో నీరులేకపోవడంతో వరి నారు ఎండిపోయే దశకు వచ్చింది. వర్షాధారంగా సాగు చేసిన వరి పరిస్థితి మరింత దారుణం. ఈ క్రమంలో కురిసిన వర్షాలు కొంత ఊరటనిచ్చాయి. వరి సాగు పూర్తిగా ఆగస్టు వర్షాలపైనే ఆధారపడి ఉందని చెప్పవచ్చు. వాడిపోయే దశలో ఉన్న మొక్కజొన్నకు ఈ వర్షాలు జీవం పోశాయి. దీంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరో పదిరోజులు ఇలాగే వర్షాలు కురియాలని రైతులు వరుణ దేవున్ని ప్రార్థిస్తున్నారు.
జిల్లా అంతటా వర్షం
జిల్లావ్యాప్తంగా శనివారం నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు వాతావరణ శాఖ వివరాల ప్రకారం అత్యధికంగా జిల్లా సగటున 12.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చొప్పదండిలో 16.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రామడుగులో 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గంగాధరలో 12.4, కరీంనగర్‌లో 13.9, మానకొండూర్‌లో 12, తిమ్మాపూర్‌లో 12.1, చిగురుమామిడిలో 12.6, సైదాపూర్‌లో 10.2, కేశవపట్నంలో 10.1, వీణవంకలో 12.4, హుజురాబాద్‌లో 11.7, జమ్మికుంటలో 14.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి, గన్నేరువరం, ఇల్లందకుంటలో వర్షపాతం కొలిచే యంత్రాలు లేక అధికారులు వివరాలు వెల్లడించలేదు. అక్కడ సగటున 10 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు తెలుస్తోంది. జూన్ నుంచి ఇప్పటివరకు 466.6 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 541.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. చొప్పదండి, జమ్మికుంట, వీణవంక, చిగురుమామిడి మండలాల్లో అధిక వర్షపాతం నమోదయ్యింది. మిగిలిన మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యింది.
కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం
భారీ వర్షాల నేపథ్యంలో సహాయ, పునరావాస చ ర్యల నిమిత్తం కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పా టు చేశారు. వర్షాలతో జరిగిన నష్టాన్ని, సహాయక చర్యల కోసం ఫోన్ చేసి వివరించవచ్చు. అందుబాటులో ఉన్న అధికారులు సంబంధిత క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపట్టనున్నారు. కంట్రోల్ రూం నంబర్ 1800 425 4731 (టోల్‌ఫ్రీ)కు ఫోన్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment