భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 18 మంది మృతి
పదుల సంఖ్యలో గల్లంతు
పొంగిపొర్లుతున్న చెరువులు, వాగులు..
జలాశయాల్లోకి చేరుతున్న నీరు
ప్రధాన రహదారులపై వరదలతో స్తంభించిన ప్రజారవాణా
అప్రమత్తమైన ప్రభుత్వం.. సహాయక చర్యలు ముమ్మరం.. రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం రేవంత్, మంత్రులు
భారీ వర్షాలపై కేంద్రం ఆరా..
సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్‌రూం ఏర్పాటు
మరో రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
రాత్రీ పగలూ ఎడతెరిపి లేకుండా ఒకటే వాన.. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు కుండపోత.. అడుగు బయటపెట్టలేకుండా ఎటు చూసినా నీళ్లే.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు మిగిలింది కన్నీళ్లే. వాగులు, వంకలు ఉప్పొంగుతూ, చెరువులు అలుగుపారుతూ.. ఊర్లు, రోడ్లను ముంచేస్తూ అతలాకుతలం చేస్తున్నాయి. వరద దాటే ప్రయత్నం చేసిన ఎన్నో ప్రాణాలను మింగేస్తున్నాయి. ఇది మరో రెండు రోజులూ కొనసాగుతుందని, మరింతగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ చేసిన హెచ్చరికలు ఆందోళన రేపుతున్నాయి.
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న వానల తీవ్రత శనివారం రాత్రి నుంచి మరింత పెరిగింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఆగకుండా కురిసింది. దీనితో జనజీవనం అతలాకుతలమైంది. వరద పోటెత్తి, రహదారులు కోతకు గురై రాకపోకలు స్తంభించాయి. రైలు మార్గాలు దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలూ నిలిచిపోయాయి. చెరువులు, కుంటలు నిండి అలుగెత్తాయి. వాగులు, వంకలు పోటెత్తాయి. దీనితో పదులకొద్దీ గ్రామా లు జలదిగ్భంధం అయ్యాయి. పలుచోట్ల వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి.
మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాలు, సహాయక చర్యలు, ముందు జాగ్రత్తల గురించి దిశానిర్దేశం చేశారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్
భారీ వర్షాల నేపథ్యంలో సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో 040–23454088 నంబర్ ద్వారా.. వర్షాలు, వరదల పరిస్థితిపై కలెక్టర్లతో సంప్రదిస్తూ.. అవసరమైన సహాయ సహకారాలు, సూచనలను అందిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
రికార్డు స్థాయిలో వర్షపాతం..
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు సరికొత్త రికార్డును నమో దు చేశాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 9.87 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఒక్కరోజే ఇంత భారీగా వానలు కురవడం గత పదేళ్లలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్‌లో సెప్టెంబర్ 1 నాటికి 58.15 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతంనమోదుకావాల్సి ఉండగా.. ఈసారి 76.19 సెంటీమీటర్లు కురిసింది. ఇది సాధారణం కంటే 31శాతం అధికం కావడం గమనార్హం. మొత్తం సీజన్‌లో నమోదవాల్సిన వర్షపాతం.. మరో నెల రోజులు ఉండగానే కురిసింది.
మరో రెండు రోజులు భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షా లు, కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. సోమవారం అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ.. ఆదిలాబాద్, నిజామాబాద్, రా జన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగా రెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, నల్లగొండ, సూర్యా పేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మెదక్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారా యణపేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తడిసి ముద్దయిన హైదరాబాద్
రెండు రోజులుగా కురుస్తున్న వానలతో హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దయింది. శనివారం రాత్రి నుంచీ ఆదివారం మధ్యాహ్నం వరకు ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. నాలాలలో వరద పెరిగి, డ్రైనేజీలు పొంగుతున్నాయి. దీనితో లోతట్టు ప్రాంతాల కాలనీలు, బస్తీలు జలమయం అయ్యాయి. హుస్సేన్‌సాగర్ నిండిపోవడంతో తూముల ద్వారా మూసీలోకి నీటి విడుదల చేస్తున్నారు. మూసీ పరీవాహక ప్రాంతాలకు జీహెచ్‌ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. దాదాపు 165 వాటర్ ల్యాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో.. జీహెచ్‌ఎంసీ, హైడ్రా, వాటర్‌బోర్డుల ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు ఎప్పటికప్పుడు నీటిని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యాయి.
ఖమ్మం.. అల్లకల్లోలం
భారీ వర్షాల ధాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లా అల్లకల్లోలమైంది. పాలేరు, మున్నేరు, వైరా, ఆకేరు, కట్టలేరు నదులు పోటెత్తాయి. చాలాచోట్ల రాకపోకలు స్తంభించాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా వర్షం పడటం, ఎగువన మహబూబాబాద్ జిల్లాలో అతి భారీ వర్షం కురవడంతో.. ఒక్కసారిగా మున్నేరు, ఆకేరు ఉగ్రరూపం దాల్చాయి. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనట్టుగా ఖమ్మం నగరానికి వరద పోటెత్తింది. 35 కాలనీలు నీటమునిగాయి. తమను కాపాడాలంటూ కాలనీలు, గ్రామాల వాసులు నేతలు, అధికారులకు ఫోన్లు చేశారు.
ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇంకా చాలా మంది తమ భవనాలపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 39 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి.. 5వేల మంది వరద బాధితులను తరలించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క హైదరాబాద్ నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వరదలను, సహాయక చర్యలను పరిశీలించారు.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు కూడా పలుచోట్ల సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మణుగూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పాల్వంచ మండలంలో సీతారామ ప్రధాన కెనాల్‌కు గండి పడింది. ములకలపల్లి మండలంలో సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండి పడింది.
వరంగల్.. ఎటు చూసినా వరదే!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవడంతో.. జలదిగ్బంధమైంది. మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి, మసి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. 56 చెరువులు తెగిపోయాయి. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వేట్రాక్ కింద కట్ట కొట్టుకుపోయింది. దీనితో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
నెల్లికుదురు మండలం రావిరాల, మరిపెడ మండలం తండా ధర్మారం గ్రామపంచాయతీ సీతారాం తండాలు నీటమునిగాయి. ఇళ్లపైకి ఎక్కిన గ్రామస్తులు.. ‘ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఆదుకోండి’ అంటూ అధికారులు, బంధువులకు ఫోన్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా వందల కొద్దీ పాత ఇళ్లు కూలిపోయాయి.
వేములవాడ నుంచి భద్రాచలానికి 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. శనివారం రాత్రి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం– తోపనపల్లి శివార్లలో వరదలో చిక్కుకుంది. ప్రయాణికులు వరద మధ్య బస్సులోనే రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.
ఉమ్మడి నల్లగొండ వాన బీభత్సం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు సూర్యాపేట జిల్లా కాగితరామచంద్రాపురం వద్ద, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం శివారు రంగులబ్రిడ్జి వద్ద గండ్లు పడ్డాయి. సూర్యాపేట మండలం పిల్లలమర్రి– పిన్నాయిపాలెం మధ్య మూసీ ఎడమ కాలువకు గండిపడింది. వేల ఎకరాలు నీట మునిగాయి. పలుగ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి.
పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపైకి వరద చేరి రాకపోకలు నిలిచిపోయాయి. మఠంపల్లి మండలం చౌటపల్లిలో ఊరచెరువుకు, హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డ చెరువు, మేళ్లచెరువులో నాగుల చెరువులు తెగిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో రామన్నపేట, చౌల్లరామారం, అడ్డగూడూరులలో చెట్లు విరిగిపడ్డాయి.
ఉమ్మడి మెదక్ నిలిచిన రాకపోకలు
మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో నారింజ వాగు ఉప్పొంగడంతో కర్ణాటక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా నర్సాపూర్–హైదరాబాద్ రహదారిపై చెట్లు కూలిపడటంతో వాహనాలు నిలిచిపోయాయి. గుండువాగు, పెద్దవాగు, గంగమ్మ వాగులు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ పట్టణం జలదిగ్బంధమైంది.
ఉమ్మడి రంగారెడ్డి దెబ్బతిన్న పంటలు
రంగారెడ్డి ఉమ్మడి జిల్లా పరిధిలో కాగ్నా, ఈసీ, మూసీ నదులకు వరద పోటెత్తింది. దీనితో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జిల్లాలో టమాటా, ఆకుకూరల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరు పరిధిలోని గౌతాపూర్ సబ్‌స్టేషన్‌లో వరద నీరు చేరడంతో.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఉమ్మడి ఆదిలాబాద్ నిండుకుండల్లా ప్రాజెక్టులు
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ వరదలతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. కుమురం భీం, కడెం, వట్టివాగు, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జైనథ్ మండలం పెండల్‌వాడ, సాంగ్వి, ఆనంద్‌పూర్‌లలో పంటలు నీట మునిగాయి. బోథ్ మండలం పొచ్చెర జలపాతం ఉప్పొంగుతోంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి వాగు అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నిర్మల్ జిల్లా కేంద్రంలో సిద్దాపూర్ వాగు పొంగడంతో సిద్దాపూర్, కౌట్ల, ముజ్జిగి గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. నిర్మల్ మండలం చిట్యాల వంతెనపై నుంచి ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు తప్పి వాగులో పడిపోయింది. వాహనంలోని వారికి ఈతరావడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
ఉమ్మడి కరీంనగర్ రోడ్లు జలమయం
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వర్షం దంచికొట్టింది. కలెక్టరేట్ ఆవరణలోని భారీ వృక్షం కూలిపడి, విద్యుత్ స్తంభం విరిగింది. వీణవంక, మామిడాలపల్లిలో వాగులు ఉప్పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సింగరేణిలోని ఓపెన్ కాస్ట్‌లలో బొగ్గు వెలికితీతకు ఆటంకం ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పపెల్లి– తాండ్య్రాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందపల్లెలోని బ్రిడ్జిపై వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి బస్టాండ్, రంగంపల్లి, పెద్దకల్వల, సుల్తానాబాద్ బస్టాండ్, రామగుండం–మల్యాలపల్లి సమీపంలో రాజీవ్ రహదారి (ఎస్‌హెచ్–1)పై వరద నీరు చేరి.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఉమ్మడి పాలమూరు దెబ్బతిన్న రోడ్లు
రెండు రోజులుగా కురుస్తున్న వానలు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. మహబూబ్‌నగర్ లోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. జడ్చర్ల పట్టణంలోని యాసాయకుంట తెగి పలు కాలనీలు నీటమునిగాయి. పెద్దగుట్ట రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి.
హైదరాబాద్– శ్రీశైలం రహదారిపై దోమలపెంట వద్ద కొండచరియలు విరిగిపడి.. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మిడ్జిల్ మండలం మున్ననూర్ వాగు వద్ద కేఎల్‌ఐ ప్రధాన కాల్వకు గండిపడి 167 జాతీయ రహదారిపై నీళ్లు చేరాయి. ఇదే రహదారిపై మహమ్మదాబాద్‌లో రెండు చోట్ల రోడ్డు కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి.
ఉమ్మడి నిజామాబాద్ దంచికొట్టిన వాన
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా పోచారం ప్రాజెక్టు నిండి అలుగు పోస్తోంది. మాచారెడ్డి, బీబీపేట, లింగంపేట, తాడ్వాయి మండలాల్లో వాగులు పొంగడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పొలాలు నీట మునిగాయి. చెట్లు కూలిపడటంతో మెదక్–ఎల్లారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
వానలకు 18 ప్రాణాలు బలి
వానలు, వరదల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా 18 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు జరుగుతోంది.
⇒ పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో పవన్ నక్కల వాగులో కొట్టుకుపోయి మృతిచెందాడు. రామగిరి మండలం రాజాపూర్‌లో అంకరి రాజమ్మ (65) విద్యుత్ షాక్‌తో మృతిచెందింది. కమాన్‌పూర్ మండలం జూలపల్లిలో వ్యవసాయ కూలీ ఇలాసారం కిరణ్ (36)కు ఫిట్స్ వచ్చాయి. వర్షంతో ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోవడంతో మృతి చెందాడు.
⇒ నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్కమేడులో వర్షానికి పాత ఇల్లు పైకప్పు కూలి హన్మమ్మ (60), అంజులమ్మ (40) మృతిచెందారు.
⇒ రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం దేవునిపల్లికి చెందిన ఎరుకలి శేఖర్ (35) పల్లం చెరువులో మునిగి కన్నుమూశాడు. ఇదే జిల్లాలోని ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడలో రైతు యాదయ్య (50) పశువుల కొట్టానికి విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి మృతి చెందాడు.
⇒ కుమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బొందగూడకు చెందిన టేకం గణేశ్ (35) గ్రామశివార్లలో వాగుదాటుతూ కొట్టుకుపోయి మృతి చెందాడు.
⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన తండ్రీకూతుళ్లు నునావత్ మోతీలాల్, అశి్వని.. మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమాయిగూడెం వద్ద వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. మధిర మండలం దెందుకూరులో గేదెలు కాసేందుకు వెళ్లిన పద్మావతి వరదలో కొట్టుకుపోయి మృతి చెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో వరద నీటిలో చిక్కుకుని ఓ యువకుడు మృతి చెందాడు. అశ్వాపురం మండలంలో తోగువాగు ఉప్పొంగడంతో ఇద్దరు పశువుల కాపర్లు కొట్టుకుపోయి మృతి చెందారు.
⇒ వరంగల్ జిల్లా రాజీపేటలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన రాములు (58) మృతిచెందాడు. ఇదే జిల్లా దుగ్గొండి మండలం మందపల్లిలో వృద్ధురాలు కొండ్ర సమ్మక్క (75) వరద నీటిలో పడిపోయి మృతి చెందింది.
⇒ సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నాగం రవికుమార్ వాగు దాటే క్రమంలో కారుతో సహా కొట్టుకుపోయి మరణించాడు. ఉత్తమ్ పద్మావతినగర్ వద్ద యారమాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి బైక్‌పై వరదను దాటుతూ ప్రమాదానికి గురై మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment