నేడు, రేపు భారీ వర్షాలు
వాతావరణ కేంద్రం వెల్లడి
అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకు సీఎం ఆదేశం
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి
కలెక్టరేట్లలో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేయండి
గ్రేటర్‌లో మ్యాన్‌హోళ్లు, నాలాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టండి
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడటంతో తెలంగాణ వ్యాప్తంగా మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్పపీడనం ఏర్పడటంతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్‌లోనూ అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు. అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ విభాగం అధికారులు జీహెచ్‌ఎంసీని కోరారు. గత 24 గంటల్లో నల్లగొండ జిల్లా దేవరకొండలో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పెద్దేముల్, సరూర్‌నగర్, పిట్లం, కల్వకుర్తిలలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
లోతట్టు ప్రాంతాలవారిని తరలించండి: సీఎం
రాష్ట్రంలో రెండ్రోజుల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్రలతో సోమవారం సీఎం మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేయాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ప్రారంభించాలని, ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని స్పందించాలని సూచించారు.
రాష్ట్ర స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్ (040- 23454088) ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డిలతో కూడా సీఎం మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అవసరమైన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు.
ప్రధాన రహదారుల్లోని మ్యాన్‌హోళ్లు, నాలాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. గణేశ్ నిమజ్జనం, బక్రీద్ ఉన్నందున మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్ష పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు హైదరాబాద్‌లో 119 యాక్షన్ టీ మ్‌లతోపాటు సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సీఎంకు వివరించారు. ప్రజలు కూడా వర్షాల సమయంలో అత్యవసరమైతే తప్ప రోడ్ల మీదకు రావద్దని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు
సీఎం ఆదేశాలతో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ఎస్పీలతో కలసి డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (విపత్తు నిర్వహణ కమిటీ) సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. వర్షాల వల్ల ప్రభావితమయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఆయా కేంద్రాల్లో మంచినీరు, విద్యుత్, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని అన్నారు. అంబులెన్సులు, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకొని అత్యవసర సేవలు అందించాలని వైద్య, ఆరోగ్యశాఖకు సూచించారు. చెరువు కట్టల పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు గమనించాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు.