వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు తెలంగాణవ్యాప్తంగా అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు తెలంగాణవ్యాప్తంగా అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటల్లో వరంగల్ జిల్లా పరకాలలో 8 సెంటీమీటర్లు, మొగుళ్లపల్లిలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
ఈ నెలలో వర్షాలు తరచూ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ పంటలైన పత్తి, కంది, వరి పంటలకు ఈ వర్షాల వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశోధన సంచాలకులు ప్రొఫెసర్ డి.రాజిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఎండిపోయే దశకు చేరుకున్న వివిధ పంటలకు వారం కిందట కురిసిన వర్షాలతో ప్రయోజనం చేకూరిందని... ఇప్పుడు మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో ఆయా పంటలు నిలదొక్కుకుంటాయన్నారు.
అయితే పొలాల్లో నీరు అధికంగా చేరితే దాన్ని తొలగించాలని రైతులకు ఆయన సూచించారు. వర్షాల వల్ల భూగర్భ జలాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కాగా, ఇప్పటికే ఎండిపోయిన మొక్కజొన్న మాత్రం చేతికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం దాదాపు 8 నుంచి 10 లక్షల ఎకరాల్లోని మొక్కజొన్న పూర్తిగా చేతికందకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు.
4 రోజులపాటు భారీ వర్షాలు
Published Sun, Sep 11 2016 1:57 AM | Last Updated on Tue, Sep 4 2018 5:02 PM
Advertisement