సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడిందని, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరి తల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని ఒకట్రెండు చోట్ల సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవచ్చని, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అలాగే సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, కొమురం భీం, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. మరోవైపు గత 24 గంటల్లో కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 9 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. అలాగే ఏన్కూరులో 7 సెంటీమీటర్లు, వెంకటాపూర్, ఖమ్మం అర్బన్, జూలూరుపాడులలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షాలు కురిశాయి. చింతకాని, ఎల్లారెడ్డి, డోర్నకల్, బయ్యారం, అశ్వారావుపేట, మణుగూరు, కొత్తగూడెం, మధిర, గోవిందరావుపేట, నాగరెడ్డిపేట, భిక్నూరు, తల్లాడ, బోనకల్, గార్ల, జుక్కల్‌లలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. వర్షాలు ఊపందుకోవడంతో అన్నదాత కాస్తంత ఊరట చెందుతున్నాడు. ఇప్పటివరకు వర్షాలు సరిగా లేకపోవడంతో అనేక చోట్ల వేసిన విత్తనాలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. తాజా వర్షాలతో ఈ పరిస్థితి నుంచి బయటపడొచ్చని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.
11 జిల్లాల్లో అధికం... హైదరాబాద్‌లో లోటు
రాష్ట్రవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఈ సీజన్‌లో జూన్ ఒకటో తేదీ నుంచి ఈ నెల ఏడో తేదీ నాటికి రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 169.66 మిల్లీమీటర్లు కాగా, 189.1 ఎంఎం కురిసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 397.4 ఎంఎం, అతితక్కువగా జోగులాంబ గద్వాల జిల్లాలో 80.9 ఎంఎం వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 11 జిల్లాల్లో సాధారణంకంటే అధిక వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, కొమురం భీం, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్ (అర్బన్), కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. హైదరాబాద్ జిల్లాలో మాత్రం లోటు వర్షపాతం నమోదైందని తెలిపింది. హైదరాబాద్‌లో ఈ కాలంలో సాధారణంగా 126.6 ఎంఎం వర్షం కురవాల్సి ఉండగా 100.6 ఎంఎం వర్షం మాత్రమే కురిసింది. అంటే 21 శాతంలో లోటు వర్షపాతం నగరంలో నమోదైంది. మిగిలిన 19 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డు అయినట్లు తెలిపింది.
15 వరకు వరి నార్లు పోసుకోవచ్చు...
దీర్ఘకాలిక వరి నార్లు పోసుకోవడానికి జూన్ 30తో గడువు ముగిసింది. కానీ స్వల్పకాలిక వరి సాగు కోసం ఈ నెల 15 వరకు నార్లు పోసుకోవచ్చని వ్యవసాయశాఖ తెలిపింది. అలాగే పత్తి, మొక్కజొన్న, కంది విత్తనాలు చల్లుకోవడానికి ఈ నెల 15 వరకు అవకాశముందని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. సోయాబీన్ విత్తనాలు చల్లుకోవడానికి గత నెల 30తో గడువు ముగిసింది. అయితే చాలాచోట్ల వర్షాలు రాకపోవడంతో సోయా పంట చేతికి రాకుండా పోయిందంటున్నారు. దీంతో రైతులు తిరిగి వేసుకోవడానికి కూడా అవకాశం లేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
భారీ వర్షాలతో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిస్తున్న భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లోని ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. సింగరేణి సంస్థ రామగుండం రీజియన్‌లోని ఆర్జీ–1,2,3 ఏరియాల్లోని ఓసీపీ–1,2,3, మేడిపల్లి ఓసీపీల్లో రోజుకు 42వేల చొప్పున రెండు రోజుల్లో 84వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది.
మూడో రోజు నిలిచిన ‘కాళేశ్వరం’ పనులు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మూడు రోజలుగా నిలిచిపోయాయి. అన్నారం బ్యారేజీ వద్ద గోదావరిలో వరద ఉధృతికి అడ్డుకట్ట వేసి పక్కకు మళ్లిస్తున్నారు.
- కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డతండా గ్రామానికి చెందిన ఓ మహిళ భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. అయినవారి చావే బాధాకరం అయితే.. వర్షాల వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న మల్లన్న వాగు ను దాటి... ఆ మృతదేహాన్ని ఇంటికి చేర్చడం బంధువులకు ఆ బాధలోనూ ఓ అనివార్యత. పది మంది గ్రామస్తులు ఓ తాడు సాయంతో నానా అగచాట్లు పడి ఆ మృతదేహాన్ని అతి కష్టంగా వాగు దాటించారు. భౌతికకాయాన్ని గౌరవంగా ఇంటికి చేర్చలేకపోతున్నామని, బురద నీటి లో తడుస్తూ తీసుకురావాల్సి వచ్చిందని వాపోయారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఈ కష్టాలు తప్పడంలేదని, వాగును దాటేందుకు వంతెన లేకపోవడం వల్ల వర్షాకాలంలో ఎవరైనా చనిపోతే అది మా ప్రాణాలమీదకొస్తుందని వారు బాధగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment