
మూడు రోజులు మంటలే
వచ్చే మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపనున్నాడు.
- నేటి నుంచి 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: వచ్చే మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపనున్నాడు. ఆదివారం నుంచి సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల సెల్సియస్ అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు మించి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఆదివారం మాత్రం ఎండ తీవ్రతతో పాటు కొన్నిచోట్ల వడగళ్లు, మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
ఇదిలావుండగా శనివారం అత్యధికంగా రామగుండంలో 42.4 డిగ్రీలు సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. దీంతోపాటు ఆదిలాబాద్‌లో 41.4 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 41 డిగ్రీలు, ఖమ్మంలో 40.6 డిగ్రీలు, నిజామాబాద్‌లో 40.6 డిగ్రీలు, నల్లగొండలో 40.2 డిగ్రీలు, హైదరాబాద్‌లో 39.8 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.