15 రోజుల్లో రెట్టింపు వర్షాలు
15 రోజుల్లో రెట్టింపు వర్షాలు
Published Sat, Jun 17 2017 12:59 AM | Last Updated on Tue, Sep 4 2018 5:02 PM
నేడు, ఎల్లుండి భారీ వర్షాలకు సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విస్తృతంగా వర్షపాతం నమోదవుతోంది. వానాకాలం ప్రారంభమైన ఈ నెల 1 నుంచి 15 వరకు రాష్ట్రంలో సాధారణం కంటే రెట్టింపు వర్షపాతం నమోదైంది. ఈ 15 రోజుల్లో సరాసరి 54.6 మిల్లీమీటర్ల (ఎం.ఎం.)వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఏకంగా 109.8 ఎం.ఎం.లు (101%) రికార్డు అయింది. పాత జిల్లాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం 55.3 ఎంఎంలు కాగా, 163.9 ఎంఎంలు (196%) కురిసింది. హైదరాబాద్ జిల్లాలో 46.9 ఎంఎంలు కురవాల్సి ఉండగా, 125.6 ఎంఎం (168%) అధికంగా కురిసింది. ఖమ్మం జిల్లాలోనూ 57.1 ఎంఎంలకు గాను 119.2 ఎంఎంలు (109%) అధికంగా కురిసింది. మెదక్ జిల్లాలో 55.8 ఎంఎంలు కురవాల్సి ఉండగా, 117.9 ఎంఎంలు (111%) కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అధిక వర్షపాతమే నమోదైంది. రుతుపవనాలు రాష్ట్రంలోకి ఈ నెల 12న ప్రవేశించాక అధిక వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
నేడు, ఎల్లుండి భారీ వర్షాలు...
రాష్ట్రంలో రుతుపవనాల కారణంగా శని వారం, సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదిలావుండగా గత 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. జుక్కల్, మద్నూరులలో 12 సెంటీమీటర్ల వంతున వర్షపాతం నమోదైంది. నిర్మల్‌లో 10, బోథ్, కోస్గిలలో 9, దోమకొండలో 8, సంగారెడ్డిలో 7, బిక్నూరు, హకీంపేట్, నారాయణ్‌పేట్, కొడంగల్‌లలో 6 సెంటీమీటర్ల వంతున వర్షపాతం నమోదైంది. ఖానాపూర్, రంజల్, జఫర్‌గఢ్, కాన్పూర్, ము«థోల్, శామీర్‌పేట్, గండీడ్‌లలో 5 సెంటీమీటర్ల వంతున వర్షపాతం నమోదైంది.
Advertisement