12, 13 తేదీల్లో రాష్ట్రంలో వర్షాలు
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
- పెరిగిన చలి.. ఆదిలాబాద్‌లో 7 డిగ్రీల ఉష్ణోగ్రత
సాక్షి, హైదరాబాద్: తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 12, 13 తేదీల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తుపాను ప్రభావం ఎక్కువగా కోస్తాంధ్రపైనే ఉంటుందని వివరించారు. మరోవైపు రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. 2 నుంచి 4 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. దీంతో ఆ ప్రాంతంలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతలు ఇంతగా పడిపోవడం ఇదే మొదటిసారని వాతావరణ అధికారులు తెలిపారు.
ఆ తర్వాత మెదక్‌లో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, హకీంపేట, రామగుండంలలో 13 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని వై.కె.రెడ్డి తెలిపారు. ఆ తర్వాత సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు.