ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా ద్రోణి ఏర్పడడంతో తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
మూడు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు
గడిచిన 24 గంటల్లో ఆలంపూర్‌లో 8 సెంటీమీటర్ల వర్షం
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా ద్రోణి ఏర్పడడంతో తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆలంపూర్ 8 సెంటీమీటర్లు, కొల్లాపూర్ 6 సెంటీమీటర్లు, మక్తల్‌లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
అలంపూర్‌లో కురిసిన భారీ వర్షానికి జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లోకి వరదనీరు వచ్చి చేరింది. అలంపూర్ మండలంలోని భైరాంపురం వాగు ఉప్పొంగి అక్కడ తాత్కాలికంగా వేసిన వంతెన కొట్టుకుపోయింది. ఖమ్మం జిల్లా టేకులపల్లి, సత్తుపల్లిల్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్‌లో తగ్గిన ఉష్ణోగ్రతలు
నగరంలో ఉష్ణోగ్రతలు ఆదివారం స్వల్పంగా తగ్గాయి. గరిష్టంగా 39 డిగ్రీలు, కనిష్టంగా 28.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో తేమ 34 శాతంగా నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని పేర్కొంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 29 మంది మృత్యువాత పడ్డారు.
రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు
ప్రాంతం ఉష్ణోగ్రత (డిగ్రీలలో)
హన్మకొండ 44.4
రామగుండం 44
భద్రాచలం 42.6
ఆదిలాబాద్ 42.3
ఖమ్మం 41.4
నిజామాబాద్ 41.4
మెదక్ 40.7
హైదరాబాద్ 39