సాక్షి, హైదరాబాద్ : ఎన్నాళ్లుగానో వేచిచూస్తున్న రుతుపవనాలు త్వరలోనే రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాల ఆగమనానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయని, ఈ నెల 22 లేదా 23వ తేదీల్లో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. కేరళలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయని, తమిళనాడులోనూ దాదాపు మొత్తం విస్తరించే దశలో ఉన్నాయని, ఇప్పుడు కర్ణాటకలో విస్తరిస్తున్నాయని ఆయన తెలిపారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయన్నారు. అక్కడకు వచ్చిన మరుసటి రోజు తెలంగాణలోకి వస్తాయన్నారు. ఇదిలావుండగా వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయన్నారు.
రైతన్నల ఎదురుచూపులు...
రాష్ట్రంలో రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. తొలుత ఈ నెల 8వ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని అనుకున్నారు. కానీ పలు కారణాలతో 8న రుతుపవనాలు రాలేదు. తర్వాత ఆ తేదీ నుంచి 11, 13, 16, 18 లేదా 19 తేదీలన్నారు. చివరకు ఈ నెల 22, 23 తేదీల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈసారి తప్పనిసరిగా వస్తాయని, అత్యంత సానుకూల వాతావరణ నెలకొందని అంటున్నారు. ఇదిలావుంటే రాష్ట్రంలో వాతావరణం చాలా వరకు చల్లబడింది. సోమవారం ఆదిలాబాద్, నిజామాబాద్‌లో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 39, హన్మకొండ, మహబూబ్‌నగర్, రామగుండంలో 38 డిగ్రీల చొప్పున నమోదైంది. హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండల్లో 37 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment