రేపటి నుంచి 3 రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
- సిరిసిల్లలో 10 సెం.మీ. వర్షపాతం నమోదు
సాక్షి, హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం కారణంగా రుతుపవనాలు ఊపందుకోవడంతో బుధవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత 24 గంటల్లో సిరిసిల్ల, కోయిదాల్లో 10 సెంటీమీటర్ల చొప్పున భారీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో 8 సెంటీమీటర్లు, యల్లారెడ్డి, తాడ్వాయి, బాన్సువాడల్లో 7 సెంటీమీటర్లు, ఆదిలాబాద్, గూడూరు, నిజాంసాగర్, సదాశివనగర్, ఇల్లెందులలో 6 సెంటీమీటర్లు, గాంధారి, బోథ్, లింగపేట్, మాచారెడ్డి, చెన్నారావుపేట, బయ్యారం, ఉట్నూరు, జుక్కల్, చింతకాని, హసంపర్తిలలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డు అయింది.
మహబూబాబాద్, సత్తుపల్లి, హుజూరాబాద్, దోమకొండ, మొగుళ్లపల్లి, మద్నూరు, పిట్లం, జక్రాన్‌పల్లి, నందిపేట్, నాగారెడ్డిపేట్, నర్సంపేట్, ఎడపల్లిలలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. గత జూన్ ఒకటో తేదీ నుంచి ఈనెల 14వ తేదీ వరకు ఇప్పటివరకు పాత ఖమ్మం జిల్లాలో 7 శాతం అధిక వర్షపాతం నమోదుకాగా, మిగిలిన అన్ని జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదు కావడం గమనార్హం.
పాత ఆదిలాబాద్ జిల్లాలో 30 శాతం లోటు వర్షం నమోదైంది. ప్రస్తుత వర్షాలతో వర్షాధార పంటలకు ఢోకా లేదని, అయితే వరి విస్తీర్ణం మాత్రం పెరిగే అవకాశం లేదని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండేంత వర్షాలు రాకపోవడంతో వరి నాట్లు వెనుకబడ్డాయి.