
సాక్షి, హైదరాబాద్ : రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం, దీనికి అనుబంధంగా 7.5 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఏపీ, తెలంగాణలోని అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
సూర్యపేట, భద్రాద్రి కొత్త గూడెం, జైశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు కొమరంభీం, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జైశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కోస్తాంధ్రలో చాలా చోట్ల, ఎల్లుండి కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.