నేడు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఒరిస్సా నుంచి తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో నైరుతి రుతుపవనాలు మరింత ఊపందుకున్నాయి. దీంతో తెలంగాణలో మంగళవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే నెల ఒకటో తేదీ వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నా రు. అదే రోజు మళ్లీ రుతుపవనాలు ఊపందుకొని మరో 2 రోజులు వానలు కురుస్తాయన్నారు.
గత 24 గంటల్లో కొల్హాపూర్‌లో 6 సెం.మీ. అధిక వర్షం కురిసింది. కూసుమంచి, సంగారెడ్డి, కొత్తగూడెంలలో 4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. నారాయణఖేడ్, జుక్కల్, మధిర, మాచారెడ్డిల్లో 3 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. వెంకటాపురం, మెదక్, పినపాక, మార్పల్లి, గట్టు, బోధన్, నల్లబెల్లి, బోనకల్, ఆలంపూర్‌ల్లో 2 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది.