సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోకి రుతుపవనాల ప్రవేశం సమీపిస్తున్న వేళ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురుస్తాయని, అలాగే బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని సోమవారం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలోని ప్రాంతాల్లో మధ్యస్థ ట్రోపోస్పీయర్ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి మరో 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి బలపడే అవకాశం ఉందని వివరించింది.
మధ్య అరేబియా సముద్రం, గోవా, కొంకణ్‌లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటక, రాయలసీమలో మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, కోస్తా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు, మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనికి నైరుతి రుతుపవనాలు రెండ్రోజుల్లో విస్తరించే అవకాశం ఉందని, తర్వాతి ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
సోమవారం నాటి ఉష్ణోగ్రతలు:
పట్టణం/ నగరం ఉష్ణోగ్రత
ఆదిలాబాద్ 39.3
భద్రాచలం 39.2
హన్మకొండ 38.5
హైదరాబాద్ 37.5
ఖమ్మం 40.2
మహబూబ్‌నగర్ 35.4
మెదక్ 37.6
నల్లగొండ 39.5
నిజామాబాద్ 38.4
రామగుండం 39.6
Comments
Please login to add a commentAdd a comment