ప్రేమ:
‘ఏరా, కాఫీ మానేశావట!!!’
‘ఎప్పుడైతే కావ్యకు టీ తప్ప కాఫీ నచ్చదు అనే విషయం తెలిసిందో ఇక అప్పటి నుంచి కాఫీ ముఖం ఈ జన్మలో చూడొద్దని డిసైడైపోయాను’
అభిమానం:
‘మీరు ఏమైనా అనుకోండి. మీ హీరో సినిమా ఏమాత్రం బాగలేదు. అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి?’
‘సినిమా ఎందుకు చూడాలి? అనే మాట వాడి చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. అంతపెద్ద మాట అంటావా! ఇక ముందు మీ హీరో సినిమాలను బాయ్‌కాట్ చేస్తున్నాము’
కుటుంబం:
‘నాన్న పలకరించినా ముఖం తిప్పేస్తున్నావట! ఇది మంచి పద్ధతి కాదు. పెద్దవాళ్లు మన బాగు కోసం ఒక మాట అంటే తప్పేమిటి?!’
సామాజికం:
‘మిత్రులారా... ఫలానా షూస్ ఎవరూ వాడవద్దు. వాటిని జంతుచర్మంతో తయారుచేస్తారట’
∙∙
‘జెన్ జడ్’ జనరేషన్‌లో కీలకపాత్ర వహిస్తుంది ‘క్యాన్సిల్ కల్చర్’
దీనికి సోషల్‌మీడియా ప్రధాన వేదిక అయింది. ‘క్యాన్సిల్’ అంటే ఉన్న సాధారణ అర్ధాలలో రెండు.. రద్దు చేయడం, తుడిచివేయడం. ఇక పాప్–కల్చర్ డిక్షనరీ ప్రకారం తమ మనోభావాలను దెబ్బతీశారనే కారణంతో సెలబ్రిటీలు లేదా కంపెనీలను ఏదో ఒక రూపంలో బాయ్‌కాట్ చేయడం.
ఈ క్యాన్సిల్ కల్చర్ మూలాలు 2014 ‘లవ్ అండ్ హిప్–పాప్: న్యూయార్క్’ రియాల్టీ షోలో ఉన్నాయి అంటారు. ఆ షోలో ఒక నటుడికి తన గర్ల్‌ఫ్రెండ్‌కు అంతకుముందే కూతురు ఉందనే విషయం తెలిసి ‘యూ ఆర్ క్యాన్సిల్డ్’ అంటాడు. మొదట్లో ‘యూ ఆర్ క్యాన్సిల్డ్’ను సోషల్ మీడియాలో సరదాగా అనుకరించేవారు. అయితే ఈ సరదా కాస్త ఆ తరువాత సీరియస్ రూపంలోకి మారింది. మనలాంటి దేశాల్లోకి కూడా వచ్చేసి చాలామంది యూత్‌ను పట్టేసింది. ట్విట్టర్‌లో ‘బాయ్‌కాట్’ హ్యాష్‌టాగ్‌లు పెరిగాయి. ఫేస్‌బుక్‌లో ఒక కుర్రాడు ఇలా పోస్ట్ పెట్టాడు.
‘జాను లవ్స్ ఆరెంజ్. షీ ఈజ్ క్యాన్సిల్డ్’
యూత్‌లోని ఈ ‘క్యాన్సిల్ కల్చర్’ గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అనడం కంటే...‘ఇది సరికాదు’ అనే వారే ఎక్కువ. అమెరికన్ యానిమేటెడ్ టెలివిజన్ సిరీస్ ‘సౌత్ పార్క్’ ఈ ధోరణిని వెక్కిరించింది. స్టాండప్ కామెడి షో ‘స్పీక్స్ అండ్ స్టోన్స్’ కూడా అదే మార్గాన్ని అనుసరించింది.
‘కాలేజి క్యాంపస్‌లో ప్రత్యర్థి పక్షం భావాలను వ్యతిరేకించడం... అనే భావన క్యాన్సిల్ కల్చర్‌కు విత్తనంలాంటిది. అది కాస్త సోషల్ మీడియాకు విస్తరించింది’ అంటాడు ‘కోడింగ్ ఆఫ్ ది అమెరికన్ మైండ్’ పుస్తకం రాసిన జోనాధన్.
బాయ్‌కాట్‌లు, బహిష్కరణలు మన సామాజిక చరిత్రలో కొత్తేమీ కాదు. స్వాతంత్య్ర ఉద్యమంలో ‘విదేశీ వస్తు బహిష్కరణ’ ఎంత కీలక పాత్ర పోషించిందో మనకు తెలిసిందే. అలాంటి ఉద్యమాలకు అర్థం, పరమార్థం, అనంతమైన బలం ఉన్నాయి. అలా కాకుండా చిన్న చిన్న విషయాలు, అల్పమైన విషయాలపై ‘క్యాన్సిల్ కల్చర్’ను ఫాలోకావడం తగదని చెబుతున్నారు విజ్ఞులు. అయితే జెన్ జడ్‌లో ‘క్యాన్సిల్ కల్చర్’ని తలకెత్తుకుంటున్నవారితో పాటు ‘క్యాన్సిల్ ది క్యాన్సిల్ కల్చర్’ అని నినదిస్తున్నవారు కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment