క్లస్టర్ విధానంలో సేంద్రియ సాగు
క్లస్టర్ విధానంలో సేంద్రియ సాగు
Published Wed, Nov 2 2016 11:19 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణకు సన్నాహాలు
రాష్ట్ర ప్రభుత్వ ప్రకృతి సేద్య సలహాదారు విజయ్‌కుమార్
గోకవరం : క్లస్టర్ విధానం ద్వారా రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రకృతిసేద్య సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.విజయ్‌కుమార్ తెలిపారు. గోకవరం మండలం వీరలంకపల్లిలోని కొరిపల్లి అప్పలస్వామి అనే రైతు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 131 క్లస్టర్లలో రెండు లక్షల మంది రైతులతో సేంద్రియ సాగు చేపట్టామన్నారు. సుమారు 300 రైతులతో మండలాన్ని ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న మూడేళ్లలో ఒక్కొక్క క్లస్టర్ నుంచి 30 మంది రైతులను ఎంపిక చేసి, వారి ద్వారా మిగిలిన చోట్ల సేంద్రియ సాగును విస్తరిస్తామన్నారు. ప్రస్తుతం రసాయన ఎరువులు వాడుతున్న పొలాలు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోలేకపోతున్నాయని విజయ్‌కుమార్ తెలిపారు. వాటితో పోలిస్తే సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పంటలే ప్రకృతి వైపరీత్యాల వల్ల సోకుతున్న అనేక చీడపీడలను తట్టుకుని నిలబడగలుగుతున్నాయన్నారు. సేంద్రియ సాగుకు అవసరమైన కషాయాల విక్రయ షాపులను త్వరలో అన్నిచోట్లా ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేడీఏ కేఎస్‌వీ ప్రసాద్, వ్యవసాయశాఖ సంచాలకుడు లక్ష్మణ్‌రావు, ఆత్మా పీడీ పద్మజ, ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్ సుబ్బారావు పాల్గొన్నారు.
సాఫ్ట్‌వేర్ యువతా ప్రకృతి సాగు వైపు..
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం): సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడిన యువత కూడా సేంద్రియ సాగుపై ఇప్పుడిప్పుడే ఆసక్తి కనబరుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రకృతి సేద్య సలహాదారు, రైతు సాధికారిక సంస్థ ఉపాధ్యక్షుడు పి.విజయ్‌కుమార్ అన్నారు.రైతులంతా సేంద్రియ సాగుపై మక్కువ చూపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయనన్నారు. వ్యవసాయశాఖ, కదలిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని చందా సత్రంలో నిర్వహిస్తున్న సహజ సేద్యం కళాజాతాలో బుధవారం సాయంత్రం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా నిరోధించి నాణ్యమైన దిగుబడిలే లక్ష్యంగా రాష్ట్రంలో వివిధ గ్రామాల్లో ప్రకృతి సేద్య ప్రదర్శనా క్షేత్రాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.జేడీఏ కేఎస్‌వీ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి సేద్యం కోసం వివిధ మండలాల్లో క్లస్టర్ గ్రామాలను ఎంపిక చేశామన్నారు. అనంతరం ఆర్‌అండ్ బీ అతిథి గృహంలో జిల్లాలోని ఏడీఏలు, ఏవోలు, ఏఈవో, ఎంపీఈవోలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మజ, ప్రకృతి సేద్య నిపుణులు వైవీ సుబ్బారావు, పవన్, రాజమహేంద్రవరం ఏడీఏ సూర్య రమేష్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement