నాటి ప్రాభవం ఫణిగిరి | On April 21, Buddha Purnima | Sakshi
Sakshi News home page

నాటి ప్రాభవం ఫణిగిరి

Published Tue, May 17 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

నాటి ప్రాభవం ఫణిగిరి

నాటి ప్రాభవం ఫణిగిరి

ఈ నెల  21న  బుద్ధ పూర్ణిమ
ఫణిగిరి

 

అతి పెద్ద బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లిన ప్రాంతం   400 బౌద్ధ గదులు, 40 ధ్యానమందిరాలు మహాస్థూపంలో గత చరిత్ర ఆనవాళ్లు    అరుదైన నాణేం, అపురూప శిల్పకళ   తెలంగాణలోని నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన గ్రామం ఫణిగిరి. నల్గొండ నుంచి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం పరిమాణం, చారిత్రక ఆనవాళ్లను బట్టి ఒకప్పుడు బౌద్ధ కేంద్రంగా విరాజిల్లిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ తవ్వకాలు జరిపేకొద్ది చరిత్ర ఆనవాళ్లు తెలిపే కొత్త విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. బౌద్ధ క్షేత్రం గల ఈ కొండ పాము తల ఆకారంలో ఉండడంతో ఫణిగిరి అనే పేరు వాడుకలోకి వచ్చింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అమరావతి, నాగార్జునకొండ బౌద్ద క్షేత్రాలలాగే బౌద్ధ చరిత్ర ఆనవాళ్లు ఫణిగిరిలో అధికంగా వున్నాయి. రాష్ట్ర పురావస్తుశాఖ జరిపిన తవ్వకాలలో మహాస్థూపం, చైత్య గృహాలు, ఉద్దేశిక స్థూపాలు, విహారాలు, శిలామండపాలు, బుద్ధ పాదాలు, ప్రతిమలు, బౌద్ద చిహ్నాలు, జాతక కలలు, సిద్దార్థ గౌతముడి జీవిత ఘట్టాలు, అపురూప శిల్పాలు, శాతవాహన, ఇక్ష్వాకుల మహావతరణ నాణేలు, మట్టి సున్నపు బొమ్మలు ఇలా ఎన్నో.. ఇక్కడ బయట పడ్డాయి. 

 
చరిత్రను తెలిపే ఆధారాలు

శ్రీపర్వత విజయపురి (నాగార్జునకొండ) నుంచి పరిపాలించిన ఇక్ష్వాకరాజు ఎహుబలశాంతమూలిని 18 సంవత్సరాల పాలనాకాలానికి సంబంధించిన శాసనం దొరకడం ఇక్కడి ప్రత్యేకత. ఆ రాజు 11 సంవత్సరాలు మాత్రమే పాలించిన ఆధారాలు ఇప్పటి వరకు దొరకగా 18 సంవత్సరాలు పాలించాడని తెలిపే శాసనం ఇక్కడ లభించింది. ఇదే శాసనంలో శ్రీకృష్ణుని ప్రస్తావన కూడ ఉంది. ఇలా శ్రీకృష్ణుణ్ణి పేర్కొన్న తొలిశాసనం దొరకడం ఇక్కడి మరో ప్రత్యేకత. ఫణిగిరిలో 2001 నుంచి 2007 వరకు వరకు 42 శాసనాలు, క్రీ.పూ 5 వ శతాబ్దికి చెందిన నాణేలు దొరికాయి. అంతే కాకుండా 400 బౌద్ధ గదులు, 40 ధ్యానమందిరాలు వెలుగుచూశాయి. శాతవాహనుల కన్నా బౌద్ధమతం ముందే ఇక్కడ ప్రవేశించిందనడానికి ఎన్నో ఆధారాలు లభించాయి. 1944లో నిజాం ప్రభుత్వం ఈ బౌద్ధ క్షేత్రాన్ని గుర్తించగా, ఇప్పటి వరకు బయటపడిన బౌద్ధ క్షేత్రాలలో ఫణిగిరి అతిపెద్దదని నాటి ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల ఆధారాలు లభిస్తూనే ఉన్నాయి. గతవైభవాన్ని తెలిపే అద్భుతమైన శిల్పకళ నాటి సంస్కృతిని నేటికీ కళ్లకు కడుతూనే ఉంది.

 
తవ్వకాలలో బంగారునాణెం

సాధారణంగా బౌద్దరామాల్లో బంగారానికి సంబంధించిన వస్తువులు లభించవు. కాని ఇక్కడ 7వ రోమన్ చక్రవర్తి నెర్వి (క్రీ.శ. 96-98) విడుదల చేసిన 7.3 గ్రాముల బరువుగల బంగారునాణెం బయటపడింది. అంటే ఇక్కడ నుంచి బౌద్ధులు రోమ్‌కు వ్యాపారలావాదేవీలు జరిపారనేది తెలుస్తోంది.

 
కొండ పక్కనే చెరువు

ఫణిగిరి కొండపైన బౌద్ధారామం కింద కోదండరామ స్వామి అలయం పక్కనే పెద్ద చెరువు రాతిగుట్టల మధ్య ఉండడం గొప్ప విశేషం. నిజానికి ఇది మూడు చెరువుల కలయిక. ఒక  చెరువు పై నుండి ఎస్సారెస్పి కాలువ వెలుతుండడంతో ప్రతి యేటా ఈ చెరువు నీటితో కళకళలాడుతుంది. ఈ చెరువును అభివృద్ది చేస్తే పర్యాటకులు ఇందులో బోటింగ్ చేసే అవకాశం లభిస్తుంది.

 
పర్యాటక కేంద్రం

ఈ బౌద్ధారామాన్ని సందర్శించడానికి చైనా, భూపాల్, భూటాన్, శ్రీలంక, బ్రిటన్ తదితర దేశాలనుండి బుద్ధుని చరిత్ర పై పరిశోధనలు చేయడానికి వేలాదిమంది విద్యార్థులు, పరిశోధకులు, బౌద్ధ్ద సన్యాసులు, పర్యాటకులు ఇక్కడ వస్తుంటారు.


రక్షణలేని సంపద
కొండ పై జరిగిన తవ్వకాలలో బయల్పడిన బౌద్ధ శిల్పాలు, సీసపు నాణేలు లాంటి ఎన్నో విలువైన వస్తుసంపదకు ప్రత్యేక మ్యూజియం లేకపోవడంతో వీటి కి రక్షణ లేకుండా పోయింది. ఇక్కడ దొరికిన విగ్రహాలను కొన్నింటిని పానగల్లు మ్యూజియంలో మరికొన్నింటిని హైదరాబాద్‌లోని మ్యూజియంకు తరలించారు. మిగిలిన వాటిని గ్రామంలోని ఓ పాత భవనంలో వుంచారు.  ఘనమైన చరిత్ర వున్నా అటు ఆర్కియాలజీ శాఖ కాని, ఇటు దేవదాయ శాఖ, పర్యాటక శాఖగాని పట్టించుకోకపోవడంతో భావితరాలకు నాటి సంస్కృతి అందకుండా శిథిలమైపోతున్నదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 

 - కొమ్మిడి సుధీర్‌రెడ్డి, సాక్షి, తిరుమలగిరి

 

 ఇలా చేరుకోవచ్చు
హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫణిగిరికి రోడ్డుమార్గాన చేరుకోవచ్చు. సూర్యాపేట నుంచి 40 కిలోమీటర్ల దూరం, వరంగల్ నుంచి 82 కిలోమీటర్లు, నల్గొండ నుంచి 84 కిలోమీటర్లు దూరం ఉంది. సమీప రైల్వే స్టేషన్ నల్గొండ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement