Phanigiri
-
వెలికితీతే.. శాపమైంది !
సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే అత్యంత అరుదైన గార (డంగుసున్నంతో రూపొందిన) శిల్పం ఇప్పుడు వాతావరణ ప్రభావానికి గురై ముక్కలు ముక్కలుగా విడిపోయి శిథిలమవుతోంది... వందల ఏళ్లుగా భూగర్భంలో సురక్షితంగా ఉన్న ఆ ప్రతిమ, తవ్వకాల్లో వెలుగు చూశాక ఇప్పుడు రూపు కోల్పోతోంది. దాదాపు 6 అడుగుల పొడ వున్న ఈ బోధిసత్వుడి విగ్రహం ఇక్ష్వాకుల కాలంలో క్రీ.శ. మూడో శతాబ్దంలో రూపొందినట్టుగా పురావస్తుశాఖ అధికారులు భావిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఉన్న విఖ్యాత బౌద్ధస్థూప కేంద్రమైన ఫణిగిరిలో గత ఏప్రిల్‌లో ఇది బయటపడింది. అప్పటికే పగుళ్లు ఏర్పడి కొంతభాగం ముక్కలైన ఈ శిల్పాన్ని తవ్వకాల సమయంలో అధికారులు సురక్షితంగా వెలికి తీసి నగరంలో ఉన్న పురావస్తుశాఖ డైరెక్టరేట్‌కు తరలించారు. ఇది డంగు సున్నంతో రూపొందిన విగ్రహం కావటం, తయారై దాదాపు 1700 సంవత్సరాలు కావస్తుండటంతో దానికి వెంటనే సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం వానాకాలం కావటంతో గాలిలో అధికంగా ఉండే తేమను పీల్చుకుని అది వేగంగా శిథిలమవుతోంది. మరికొంతకాలం ఇలాగే ఉంటే అది ముక్కలుముక్కలై అనవాళ్లు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈలోపే దాన్ని సంరక్షించి తేమ చొరబడకుండా గాజు పెట్టెలో భద్రపరచాల్సి ఉంది. నిపుణులు సిద్ధంగా ఉన్నా... దాదాపు 1700 ఏళ్లక్రితం ఆ విగ్రహం రూపొందిందని స్థల చరిత్ర ఆధారంగా అధికారులు అప్పట్లో గుర్తించారు. ఫణిగిరి బౌద్ధక్షేత్రం కావటంతో ఈ ప్రతిమ కూడా బుద్ధుడిదే అయి ఉంటుందని భావించారు. కానీ విగ్రహంపైన ఆభరణాల గుర్తులున్నాయి. దీంతో అది ఓ రాజుదిగా తేల్చారు. బుద్ధుడి జాతక కథల్లో ఉండే బోధిసత్వుడుదిగా తేల్చారు. గతంలో బోధిసత్వుడికి సంబంధించి రెండు మూడు అడుగుల ఎత్తున్న గార ప్రతిమలు వెలుగు చూశాయి. కానీ 6 అడుగులకంటే ఎత్తున్న సున్నం విగ్రహం ఇప్పటివరకు ఎక్కడా బయటపడలేదు. విగ్రహంపై అలంకరణకు సంబంధించి కొన్ని ఆనవాళ్లు ఉన్నాయి, ఒక చేయి, కొంతభాగం కాళ్లు ఉన్నాయి. ఆ ఆకృతి ఆధారంగా విగ్రహానికి పూర్తి రూపు ఇవ్వగలిగే నిపుణులు ఢిల్లీ, ముంబై, పుణేల్లో ఉన్నారు. కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థలో కూడా ఇలాంటి నిపుణులున్నారు. వారిని పిలిపిస్తే విగ్రహంపై ప్రస్తుతానికి మిగిలిన ఆనవాళ్ల ఆధారంగా అదే డంగు సున్నం మిశ్రమంతో దాని పూర్వపు రూపాన్ని సృష్టిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక పద్ధతిలో దాన్ని గాలి చొరబడని గాజు పెట్టెలో భద్రపరిస్తే భావితరాలకు అందించే వీలుంటుంది. కానీ ఆ కసరత్తు లేకుండా పురావస్తుశాఖ విగ్రహాన్ని గాలికొదిలేసింది. ఇలా నెలల తరబడి నిర్లక్ష్యం కారణంగా సున్నపు విగ్రహం తేమను పీల్చుకుంటూ శిథిలమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి అరుదైన విగ్రహా లు ధ్వంసమైతే భావితరాలకు చరిత్ర తెలియకుండా పోతుందని అంటున్నారు. -
ఫణిగిరికి వెలుగులెప్పుడు?
సాక్షి, సూర్యాపేట: బౌద్ధం పరిఢవిల్లిన ప్రపంచ స్థాయి క్షేత్రం ఫణిగిరి. జిల్లాలోని నాగారం మండలం ఫణిగిరి గ్రామానికి సమీపంలో ఏకశిల కొండపై ఉన్న ఈక్షేత్రం బౌద్ధ ఆరామాల్లో ప్రత్యేకమైనది. ఇటీవల జరిపిన తవ్వకాల్లో బౌద్ధ ఆనవాళ్లు మరిన్ని బయటపడ్డాయి. కొండ పైన నలుమూలల తవ్వకాలకు పురావస్తు శాఖ ప్రణాళిక సిద్ధం చేసి కొంత మేర తవ్వకాలు జరిపింది. అయితే కొండపైకి రోడ్లు, మెట్లు లేకపోవడం, పరిసర ప్రాంతం అభివృద్ధి చేయకపోవడంతో ఈ క్షేత్రానికి రావడానికి పర్యాటకులకు అవస్థలు తప్పడం లేదు. క్రీ.శ 1,2 శతాబ్దాల్లో ఇక్కడ బౌద్ధ ఆరామం నిర్మించారు. గౌతమ బుద్ధుడి ప్రధాన శిష్యులు ఇక్కడ ఆరామాలు నిర్మించి బౌద్ధం వ్యాప్తం చేసినట్లు పలుమార్లు జరిపిన తవ్వకాల్లో బయటపడింది. 360 డిగ్రీల కోణంలో ఇక్కడ నిర్మించిన మహాస్థూపం ప్రధానమైంది. ఈ స్థూపం మధ్యలో కూర్చొని చూస్తే చుట్టూ పచ్చని పొలాలు కన్పి స్తాయి. బుద్ధుడి ప్రధాన శిష్యులు ఈ స్థూపం పై కూర్చొని ధ్యానం చేశారని, ఆతర్వాత ఈ కొండ ధ్యానం, బౌద్ధం వ్యాప్తికి అనువుగా ఉండడంతో ఇక్కడ బౌద్ధ పఠనం కూడా జరిగినట్లు తవ్వకాల్లో బయటపడిన ఆనవాళ్లను చూస్తే స్పష్టమవుతుంది. కొండపైన 16 ఎకరాల విస్తీర్ణంలో ఈ బౌద్ధ క్షేత్రానికి చెందిన ఆరామాలు, మహాస్థూపం, శాసనాలు, ఆనాటి నాగరికతను చాటిచెప్పే కట్టడాలు, గుట్ట కింది భాగంలో ప్రాచీనశిలా యుగం నాటి సమాధులు, మానవ జీవనం కొనసాగిన చరిత్ర ఉంది. ఫణి అంటే పడగ ..గిరి అంటే కొండ. ఈ గ్రామానికి సమీపంలో ఉన్న కొండ పాము ఆకారంలోని ఏకశిల. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి, నాగార్జునకొండ బౌద్ధ క్షేత్రాల లాగేనే బౌద్ధ చరిత్ర ఆనవాల్లు ఇక్కడ ఉన్నాయి. బౌద్ధ దేశాల్లో ఫణిగిరి చరిత్ర.. బౌద్ధం ఆచరిస్తున్న దేశాల్లో.. ఇప్పటికీ మన దేశంలోని ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాల చరిత్ర ఉంది. వీటిలో ఫణిగిరి కూడా ఒకటి కావడంతో ఇక్కడికి చైనా, భూటాన్, శ్రీలంక, బ్రిటన్ దేశాల నుంచి బౌద్ధ భిక్షువులు, రీసెర్చ్ స్కాలర్స్, పర్యాటకులు వస్తుంటారు. రాష్ట్ర పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో మహాస్థూపం, చైత్య గుహలు, ఉద్దేశిక స్థూపాలు, విహారాలు, శిలామండపాలు, బుద్ధుడి ప్రతిమలు, బౌద్ధ చిహ్నాలు, బుద్ధుడి జీవిత ఘట్టాలు, నాణేలు, సున్నపు బొమ్మలు, కుండలు తవ్వకాల్లో బయటపడ్డాయి. శ్రీపర్వత విజయపురి (నాగర్జునకొండ) నుంచి పరిపాలించిన ఇక్ష్వాకుల రాజుల పాలనాకాలానికి సంబంధించిన శాసనం దొరకడం ఇక్కడి ప్రత్యేకత. బౌద్ధ ఆరామాల్లో బంగారానికి సంబంధించిన వస్తువులు లభించవు. కానీ ఇక్కడ ఏడో రోమన్ చక్రవర్తి నెర్వి (క్రీ.శ. 96–98) విడుదలచేసిన 7.3 గ్రాముల బరువు గల బంగారునాణేం బయటపడింది. ఇక్కడ విశ్వ విద్యాలయం కూడా కొనసాగినట్లు గుర్తించారు. ఫణిగిరి బౌద్ధ ఆరామం చరిత్ర అంతా విదేశాల్లోని బౌద్ధ చరిత్రలో నిక్షిప్తం కావడం వల్లే అక్కడి నుంచి ఎక్కువగా పర్యాటకులు ఏటా ఇక్కడికి వస్తారు. రక్షణలేని సంపద .. కొండ పై జరిగిన తవ్వకాల్లో బయట పడిన బౌద్ధ శిల్పాలు, సీపపు నాణేలు లాంటి ఎన్నో విలువైన వస్తుసంపదకు ప్రత్యేక మైన మ్యూజియం లేకపోవడంతో వీటికి రక్షణ లేకుండా పోయింది. ఇక్కడ దొరికిన విగ్రహాలను కొన్నింటిని పానగల్లు మ్యూజియంలో మరికొన్నింటిని హైదరబాద్‌లోని మ్యూజియంకు తీసుకెళ్లారు. మిగిలిన వాటిని గ్రామంలోని శిథిలావస్థ భవనంలో పెట్టారు. కొండపై బౌద్ధ ఆరామం చుట్టూ రూ. 72 లక్షలతో ప్రహరీ, సోలార్ ఫెన్సింగ్ నిర్మాణం చేశారు. అయితే బౌద్ధారామం పై ఎలాంటి ప్రత్యేక రక్షణ లేకపోవడంతో దుండగలు కొండపైకి వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసినా బ్యాటరీలు పనిచేయకపోవడంతో ఈ క్షేత్రానికి రక్షణ లేకుండా పోయింది. ఫణిగిరి గ్రామంలో మ్యూజియం నిర్మాణం చేసేందుకు 30 గుంటల స్థలాన్ని కేటాయించారు. రూ.25 లక్షలతో మ్యూజియం నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదు. మ్యూజియం నిర్మించి కళాఖండాలను భద్రపరిస్తే ఇవి పర్యాటకులను ఆకట్టుకోనున్నాయి. పర్యాటకులను ఆకర్షించేందుకైనా.. పూనే దక్కన్కాలేజీ సహకారంతో రూ. 57 లక్షలతో ఇటీవల పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలను ప్రారంభించింది. ఈ తవ్వకాల్లో మరిన్ని బౌద్ధ ఆనవాళ్లు బయటపడ్డాయి. కొండ పై భాగంలో మహా స్థూపం ముందు భాగం అంతా బౌద్ధ పఠనం జరిగిన ఆరామాలున్నాయి. గతంలో ఇక్కడ తొలిసారి నిజాంల కాలంలో 1941 నుంచి1944 వరకు, రెండో సారి 2000 నుంచి 2005వరకు, మూడోసారి 2006 నుంచి 2009 , 5వ సారి 2010 నుంచి 2014 వరకు మొత్తం ఐదు పర్యాయాలు తవ్వకాలు జరిగాయి. ఇక్కడ బౌద్ధ క్షేత్రం అమరావతి, నాగార్జునకొండతో సమానమైన బౌద్ధ సంపదను కలిగి ఉన్నట్లు పురావస్తు శాఖ గుర్తించింది. వచ్చే ఏడాది న్యూయార్క్‌లో జరిగే ప్రపంచస్థాయి సాంస్కృతిక శిల్పప్రదర్శకు ఫణిగిరిలోని బౌద్ధ శిల్పాన్ని ప్రదర్శనకు పంపే ఏర్పాట్లో పురావస్తు శాఖ నిమగ్నమైంది. ఫణిగిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరగనుంది. కొండపైకి రోడ్డు, మెట్లు నిర్మిస్తే పర్యాటకులను ఈ క్షేత్రం మరింతగా ఆకర్షించనుంది. -
న్యూయార్క్‌కు ఫణిగిరి శిల్పం
సాక్షి, హైదరాబాద్: అది నాలుగు అడుగుల శిల్పం. వయసు దాదాపు 1800 సంవత్సరాలు. బుద్ధుడి జీవితాన్ని మూడు ఘట్టాలుగా విభజించి అద్భుతంగా చెక్కిన కళాఖండం. సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో లభించిన ఈ శిల్పం ఇప్పుడు ఆమెరికా గడ్డమీద అంతర్జాతీయ పర్యాటకులకు కనువిందు చేయబోతోంది. దేశంలోనే గొప్ప బౌద్ధ స్థూపమున్న ప్రాంతాల్లో ఒకటిగా వెలుగొందుతున్న సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో లభించిన క్రీ.శ. రెండో శతాబ్దం నాటి సున్నపురాయి శిల్పాన్ని విదేశీ ఎగ్జిబిషన్లకు ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం ఎంపిక చేసింది. ‘ది మెట్రోపాలిటన్ మ్యూజియమ్స్ ఆఫ్ ఆర్ట్ (ది మెట్)’150వ వార్షికోత్సవాన్ని అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహిస్తోంది. స్థానిక మెట్రోపాలిటన్ మ్యూజియంలో వచ్చే ఏడాది జరగబోయే ఈ వేడుకలో ‘ట్రీ అండ్ సర్పెంట్’పేరుతో బుద్ధుడి ఇతివృత్తంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ మ్యూజియాల్లో ఉన్న బుద్ధుడికి సంబంధించిన అరుదైన కళాఖండాలను ఇందులో ప్రదర్శనకు ఉంచాలని నిర్ణయించింది. ఈమేరకు మన దేశం నుంచి కొన్నింటిని ఎంపిక చేయాల్సిందిగా ఆ సంస్థ ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంను కోరింది. దీంతో రంగంలోకి దిగిన నేషనల్ మ్యూజియం.. ఏరికోరి హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ఉన్న బుద్ధుడి జీవితగాథను ప్రతిబింబించే శిల్పాన్ని ఎంపిక చేసింది. ఈ పురాతన విగ్రహాన్ని న్యూయార్క్‌కు పంపేలా ఏర్పాట్లు చేయమని హెరిటేజ్ తెలంగాణకు సూచించింది. దీంతో హెరిటేజ్ అధికారులు అనుమతి కోరుతూ రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డిసెంబరులో ఈ శిల్పాన్ని న్యూయార్క్‌కు పంపనున్నారు. విదేశీ నిపుణులతో పూర్వ వైభవం! నాలుగు అడుగుల ఎత్తున్న ఈ శిల్పాన్ని ఇక్ష్వాకుల కాలంలో రూపొందించారు. ఫణిగిరి బౌద్ధ స్థూపం పరిసరాల్లో 2001లో చేపట్టిన తవ్వకాల్లో ఇది వెలుగు చూసింది. సున్నపురాయితో రూపుదిద్దుకున్న ఈ శిల్పం బుద్ధుడి జీవిత పరమార్థాన్ని 3విభాగాలుగా వివరిస్తూ రూపొందింది. రాజమందిరంలో ఉండటం సరికాదని నిర్ధారించుకుని సిద్ధార్థుడు అడవికి వెళ్లిపోవటం, బుద్ధుడిగా మారి జీవిత పరమార్థాన్ని వివరిస్తూ తన బోధనలను విశ్వవ్యాప్తం చేయటం, తుదకు స్వర్గానికి చేరుకోవటం. శిల్పుల పనితీరు కూడా అద్భుతంగా ఉండటంతో అదిసాధారణ శిల్పం కాదని అప్పట్లోనే తేలిపోయింది. దీంతో దీనిపై స్మగ్లర్ల దృష్టి పడింది. అది లభించిన చోటే తాత్కాలికంగా ప్రదర్శనకు ఉంచటంతో, రాత్రి వేళ కొందరు స్మగ్లర్లు ఆ విగ్రహాన్ని అపహరించారు. గోనెపట్టాల్లో చుట్టి లారీలో సూర్యాపేట మీదుగా దాచేపల్లి తరలించి ఓ ఇంట్లో డ్రైనేజీ సంపులో దాచారు. ఈ క్రమంలో అది మూడు ముక్కలైంది. అప్పట్లోనే ఈ శిల్పం ఖ్యాతి అంతటా వ్యాపించడంతో.. ఈ చోరీ అంశాన్ని నాటి రాష్ట్రపతి కార్యాలయం కూడా తీవ్రంగా పరిగణించింది. దీంతో 2004లో నాటి రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని దొంగల వేట ప్రారంభించి చివరకు పట్టుకుంది. హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో.. తర్వాత ఆ శిల్పానికి స్థానిక పద్ధతులతో మరమ్మతు చేయించి హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టింది. రెండేళ్లక్రితం ప్రధాని నరేంద్ర మోదీ లండన్ పర్యటన సమయంలో.. బ్రిటిష్ మ్యూజియం ప్రతినిధులు ఆయనతో భేటీ అయ్యారు. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 7దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా అంతర్జాతీయ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ముంబై ఛత్రపతి శివాజీ మ్యూజియం, ఢిల్లీ నేషనల్ మ్యూజియంలతో కలిసి సంయుక్తంగా మూడు ప్రాంతాల్లో ఈ ప్రదర్శన ఏర్పాటుకు అనుమతి కోరారు. దీనికి మోదీ సరేననడంతో 2017 నవంబరులో ముంబైలో 3నెలల పాటు, గతేడాది ఢిల్లీలో 3నెలల పాటు ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శన కోసం ఫణిగిరి శిల్పాన్ని ఎంపిక చేశారు. కానీ విరగడంతో తిరిగి అతికించినట్టు స్పష్టంగా కనిపించటంతో శిల్పంలో లోపం స్పష్టంగా కనిపించింది. భవిష్యత్తులో అది లండన్, న్యూయార్క్‌ల్లో ప్రదర్శనకు తరలేందుకు అవకాశం ఉండడంతో.. ఆ విగ్రహానికి అంతర్జాతీయ ప్రమాణాలతో మరమ్మతు చేయించాలని నిర్ణయించారు. దీంతో ఈ మధ్యే ముంబైలో విదేశీ పరిజ్ఞానంతో నిపుణులు అందంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం దానిపై ఎక్కడా వెంట్రుక మందంలో కూడా గీతలు కనిపించకుండా పూర్వవైభవం కల్పించారు. రూ.3 కోట్లకు బీమా ఇటీవల దాన్ని ముంబైకి అక్కడి నుంచి ఢిల్లీకి తరలించే క్రమంలో హెరిటేజ్ తెలంగాణ ఈ విగ్రహానికి రూ.2 కోట్లకు బీమా చేయించింది. ఇప్పుడు న్యూయార్క్‌కు తీసుకెళ్లేక్రమంలో రూ.3 కోట్లకు బీమా చేయించనున్నట్టు సమాచారం. కిందపడ్డా విరగకుండా దాన్ని ప్రత్యేకంగా ప్యాక్ చేయించనున్నట్టు ఢిల్లీ మ్యూజియం అధికారులు పేర్కొన్నారు. -
ఫణిగిరి బుద్ధప్రతిమను పరిశీలించిన శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన ఫణిగిరిలో వెలుగుచూసిన అరుదైన బుద్ధ విగ్రహాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. రాష్ట్ర పురావస్తు శాఖ మ్యూజియంలో భద్రపరిచిన భారీ గార ప్రతిమను (డంగు సున్నంతో రూపొందించిన) సోమవారం మ్యూజియానికి వెళ్లి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో చరిత్ర ఉందని, ఆదిమానవుని అవశేషాలు రాష్ట్రంలో చాలా చోట్ల వెలుగు చూశాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో పురావస్తు శాఖ రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాల్లో తవ్వకాలు జరిపి చరిత్ర అవశేషాలను వెలికితీయటం అభినందనీయమన్నారు. దేశంలో ఇప్పటివరకు రెండు అడుగుల పరిమాణంలో ఉండే సున్నం ప్రతిమలు లభించాయని, ఆరు అడుగుల పొడవుతో డంగు సున్నంతో రూపొందించిన ప్రతిమ వెలుగుచూడడం క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దానికి చెందినట్లుగా భావిస్తున్నామని శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. -
నాటి ప్రాభవం ఫణిగిరి
ఈ నెల 21న బుద్ధ పూర్ణిమ ఫణిగిరి అతి పెద్ద బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లిన ప్రాంతం 400 బౌద్ధ గదులు, 40 ధ్యానమందిరాలు మహాస్థూపంలో గత చరిత్ర ఆనవాళ్లు అరుదైన నాణేం, అపురూప శిల్పకళ తెలంగాణలోని నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన గ్రామం ఫణిగిరి. నల్గొండ నుంచి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం పరిమాణం, చారిత్రక ఆనవాళ్లను బట్టి ఒకప్పుడు బౌద్ధ కేంద్రంగా విరాజిల్లిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ తవ్వకాలు జరిపేకొద్ది చరిత్ర ఆనవాళ్లు తెలిపే కొత్త విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. బౌద్ధ క్షేత్రం గల ఈ కొండ పాము తల ఆకారంలో ఉండడంతో ఫణిగిరి అనే పేరు వాడుకలోకి వచ్చింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అమరావతి, నాగార్జునకొండ బౌద్ద క్షేత్రాలలాగే బౌద్ధ చరిత్ర ఆనవాళ్లు ఫణిగిరిలో అధికంగా వున్నాయి. రాష్ట్ర పురావస్తుశాఖ జరిపిన తవ్వకాలలో మహాస్థూపం, చైత్య గృహాలు, ఉద్దేశిక స్థూపాలు, విహారాలు, శిలామండపాలు, బుద్ధ పాదాలు, ప్రతిమలు, బౌద్ద చిహ్నాలు, జాతక కలలు, సిద్దార్థ గౌతముడి జీవిత ఘట్టాలు, అపురూప శిల్పాలు, శాతవాహన, ఇక్ష్వాకుల మహావతరణ నాణేలు, మట్టి సున్నపు బొమ్మలు ఇలా ఎన్నో.. ఇక్కడ బయట పడ్డాయి. చరిత్రను తెలిపే ఆధారాలు శ్రీపర్వత విజయపురి (నాగార్జునకొండ) నుంచి పరిపాలించిన ఇక్ష్వాకరాజు ఎహుబలశాంతమూలిని 18 సంవత్సరాల పాలనాకాలానికి సంబంధించిన శాసనం దొరకడం ఇక్కడి ప్రత్యేకత. ఆ రాజు 11 సంవత్సరాలు మాత్రమే పాలించిన ఆధారాలు ఇప్పటి వరకు దొరకగా 18 సంవత్సరాలు పాలించాడని తెలిపే శాసనం ఇక్కడ లభించింది. ఇదే శాసనంలో శ్రీకృష్ణుని ప్రస్తావన కూడ ఉంది. ఇలా శ్రీకృష్ణుణ్ణి పేర్కొన్న తొలిశాసనం దొరకడం ఇక్కడి మరో ప్రత్యేకత. ఫణిగిరిలో 2001 నుంచి 2007 వరకు వరకు 42 శాసనాలు, క్రీ.పూ 5 వ శతాబ్దికి చెందిన నాణేలు దొరికాయి. అంతే కాకుండా 400 బౌద్ధ గదులు, 40 ధ్యానమందిరాలు వెలుగుచూశాయి. శాతవాహనుల కన్నా బౌద్ధమతం ముందే ఇక్కడ ప్రవేశించిందనడానికి ఎన్నో ఆధారాలు లభించాయి. 1944లో నిజాం ప్రభుత్వం ఈ బౌద్ధ క్షేత్రాన్ని గుర్తించగా, ఇప్పటి వరకు బయటపడిన బౌద్ధ క్షేత్రాలలో ఫణిగిరి అతిపెద్దదని నాటి ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల ఆధారాలు లభిస్తూనే ఉన్నాయి. గతవైభవాన్ని తెలిపే అద్భుతమైన శిల్పకళ నాటి సంస్కృతిని నేటికీ కళ్లకు కడుతూనే ఉంది. తవ్వకాలలో బంగారునాణెం సాధారణంగా బౌద్దరామాల్లో బంగారానికి సంబంధించిన వస్తువులు లభించవు. కాని ఇక్కడ 7వ రోమన్ చక్రవర్తి నెర్వి (క్రీ.శ. 96-98) విడుదల చేసిన 7.3 గ్రాముల బరువుగల బంగారునాణెం బయటపడింది. అంటే ఇక్కడ నుంచి బౌద్ధులు రోమ్కు వ్యాపారలావాదేవీలు జరిపారనేది తెలుస్తోంది. కొండ పక్కనే చెరువు ఫణిగిరి కొండపైన బౌద్ధారామం కింద కోదండరామ స్వామి అలయం పక్కనే పెద్ద చెరువు రాతిగుట్టల మధ్య ఉండడం గొప్ప విశేషం. నిజానికి ఇది మూడు చెరువుల కలయిక. ఒక చెరువు పై నుండి ఎస్సారెస్పి కాలువ వెలుతుండడంతో ప్రతి యేటా ఈ చెరువు నీటితో కళకళలాడుతుంది. ఈ చెరువును అభివృద్ది చేస్తే పర్యాటకులు ఇందులో బోటింగ్ చేసే అవకాశం లభిస్తుంది. పర్యాటక కేంద్రం ఈ బౌద్ధారామాన్ని సందర్శించడానికి చైనా, భూపాల్, భూటాన్, శ్రీలంక, బ్రిటన్ తదితర దేశాలనుండి బుద్ధుని చరిత్ర పై పరిశోధనలు చేయడానికి వేలాదిమంది విద్యార్థులు, పరిశోధకులు, బౌద్ధ్ద సన్యాసులు, పర్యాటకులు ఇక్కడ వస్తుంటారు. రక్షణలేని సంపద కొండ పై జరిగిన తవ్వకాలలో బయల్పడిన బౌద్ధ శిల్పాలు, సీసపు నాణేలు లాంటి ఎన్నో విలువైన వస్తుసంపదకు ప్రత్యేక మ్యూజియం లేకపోవడంతో వీటి కి రక్షణ లేకుండా పోయింది. ఇక్కడ దొరికిన విగ్రహాలను కొన్నింటిని పానగల్లు మ్యూజియంలో మరికొన్నింటిని హైదరాబాద్‌లోని మ్యూజియంకు తరలించారు. మిగిలిన వాటిని గ్రామంలోని ఓ పాత భవనంలో వుంచారు. ఘనమైన చరిత్ర వున్నా అటు ఆర్కియాలజీ శాఖ కాని, ఇటు దేవదాయ శాఖ, పర్యాటక శాఖగాని పట్టించుకోకపోవడంతో భావితరాలకు నాటి సంస్కృతి అందకుండా శిథిలమైపోతున్నదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. - కొమ్మిడి సుధీర్‌రెడ్డి, సాక్షి, తిరుమలగిరి ఇలా చేరుకోవచ్చు హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫణిగిరికి రోడ్డుమార్గాన చేరుకోవచ్చు. సూర్యాపేట నుంచి 40 కిలోమీటర్ల దూరం, వరంగల్ నుంచి 82 కిలోమీటర్లు, నల్గొండ నుంచి 84 కిలోమీటర్లు దూరం ఉంది. సమీప రైల్వే స్టేషన్ నల్గొండ.