ఫణిగిరిలో చిన్న బౌద్ధ స్థూపం
సాక్షి, సూర్యాపేట: బౌద్ధం పరిఢవిల్లిన ప్రపంచ స్థాయి క్షేత్రం ఫణిగిరి. జిల్లాలోని నాగారం మండలం ఫణిగిరి గ్రామానికి సమీపంలో ఏకశిల కొండపై ఉన్న ఈక్షేత్రం బౌద్ధ ఆరామాల్లో ప్రత్యేకమైనది. ఇటీవల జరిపిన తవ్వకాల్లో బౌద్ధ ఆనవాళ్లు మరిన్ని బయటపడ్డాయి. కొండ పైన నలుమూలల తవ్వకాలకు పురావస్తు శాఖ ప్రణాళిక సిద్ధం చేసి కొంత మేర తవ్వకాలు జరిపింది. అయితే కొండపైకి రోడ్లు, మెట్లు లేకపోవడం, పరిసర ప్రాంతం అభివృద్ధి చేయకపోవడంతో ఈ క్షేత్రానికి రావడానికి పర్యాటకులకు అవస్థలు తప్పడం లేదు.
క్రీ.శ 1,2 శతాబ్దాల్లో ఇక్కడ బౌద్ధ ఆరామం నిర్మించారు. గౌతమ బుద్ధుడి ప్రధాన శిష్యులు ఇక్కడ ఆరామాలు నిర్మించి బౌద్ధం వ్యాప్తం చేసినట్లు పలుమార్లు జరిపిన తవ్వకాల్లో బయటపడింది. 360 డిగ్రీల కోణంలో ఇక్కడ నిర్మించిన మహాస్థూపం ప్రధానమైంది. ఈ స్థూపం మధ్యలో కూర్చొని చూస్తే చుట్టూ పచ్చని పొలాలు కన్పి స్తాయి. బుద్ధుడి ప్రధాన శిష్యులు ఈ స్థూపం పై కూర్చొని ధ్యానం చేశారని, ఆతర్వాత ఈ కొండ ధ్యానం, బౌద్ధం వ్యాప్తికి అనువుగా ఉండడంతో ఇక్కడ బౌద్ధ పఠనం కూడా జరిగినట్లు తవ్వకాల్లో బయటపడిన ఆనవాళ్లను చూస్తే స్పష్టమవుతుంది. కొండపైన 16 ఎకరాల విస్తీర్ణంలో ఈ బౌద్ధ క్షేత్రానికి చెందిన ఆరామాలు,
మహాస్థూపం, శాసనాలు, ఆనాటి నాగరికతను చాటిచెప్పే కట్టడాలు, గుట్ట కింది భాగంలో ప్రాచీనశిలా యుగం నాటి సమాధులు, మానవ జీవనం కొనసాగిన చరిత్ర ఉంది. ఫణి అంటే పడగ ..గిరి అంటే కొండ. ఈ గ్రామానికి సమీపంలో ఉన్న కొండ పాము ఆకారంలోని ఏకశిల. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి, నాగార్జునకొండ బౌద్ధ క్షేత్రాల లాగేనే బౌద్ధ చరిత్ర ఆనవాల్లు ఇక్కడ ఉన్నాయి.
బౌద్ధ దేశాల్లో ఫణిగిరి చరిత్ర..
బౌద్ధం ఆచరిస్తున్న దేశాల్లో.. ఇప్పటికీ మన దేశంలోని ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాల చరిత్ర ఉంది. వీటిలో ఫణిగిరి కూడా ఒకటి కావడంతో ఇక్కడికి చైనా, భూటాన్, శ్రీలంక, బ్రిటన్ దేశాల నుంచి బౌద్ధ భిక్షువులు, రీసెర్చ్ స్కాలర్స్, పర్యాటకులు వస్తుంటారు. రాష్ట్ర పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో మహాస్థూపం, చైత్య గుహలు, ఉద్దేశిక స్థూపాలు, విహారాలు, శిలామండపాలు, బుద్ధుడి ప్రతిమలు, బౌద్ధ చిహ్నాలు, బుద్ధుడి జీవిత ఘట్టాలు, నాణేలు, సున్నపు బొమ్మలు, కుండలు తవ్వకాల్లో బయటపడ్డాయి. శ్రీపర్వత విజయపురి (నాగర్జునకొండ) నుంచి పరిపాలించిన ఇక్ష్వాకుల రాజుల పాలనాకాలానికి సంబంధించిన శాసనం దొరకడం ఇక్కడి ప్రత్యేకత. బౌద్ధ ఆరామాల్లో బంగారానికి సంబంధించిన వస్తువులు లభించవు. కానీ ఇక్కడ ఏడో రోమన్ చక్రవర్తి నెర్వి (క్రీ.శ. 96–98) విడుదలచేసిన 7.3 గ్రాముల బరువు గల బంగారునాణేం బయటపడింది. ఇక్కడ విశ్వ విద్యాలయం కూడా కొనసాగినట్లు గుర్తించారు. ఫణిగిరి బౌద్ధ ఆరామం చరిత్ర అంతా విదేశాల్లోని బౌద్ధ చరిత్రలో నిక్షిప్తం కావడం వల్లే అక్కడి నుంచి ఎక్కువగా పర్యాటకులు ఏటా ఇక్కడికి వస్తారు.
రక్షణలేని సంపద ..
కొండ పై జరిగిన తవ్వకాల్లో బయట పడిన బౌద్ధ శిల్పాలు, సీపపు నాణేలు లాంటి ఎన్నో విలువైన వస్తుసంపదకు ప్రత్యేక మైన మ్యూజియం లేకపోవడంతో వీటికి రక్షణ లేకుండా పోయింది. ఇక్కడ దొరికిన విగ్రహాలను కొన్నింటిని పానగల్లు మ్యూజియంలో మరికొన్నింటిని హైదరబాద్‌లోని మ్యూజియంకు తీసుకెళ్లారు. మిగిలిన వాటిని గ్రామంలోని శిథిలావస్థ భవనంలో పెట్టారు. కొండపై బౌద్ధ ఆరామం చుట్టూ రూ. 72 లక్షలతో ప్రహరీ, సోలార్ ఫెన్సింగ్ నిర్మాణం చేశారు. అయితే బౌద్ధారామం పై ఎలాంటి ప్రత్యేక రక్షణ లేకపోవడంతో దుండగలు కొండపైకి వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసినా బ్యాటరీలు పనిచేయకపోవడంతో ఈ క్షేత్రానికి రక్షణ లేకుండా పోయింది. ఫణిగిరి గ్రామంలో మ్యూజియం నిర్మాణం చేసేందుకు 30 గుంటల స్థలాన్ని కేటాయించారు. రూ.25 లక్షలతో మ్యూజియం నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదు. మ్యూజియం నిర్మించి కళాఖండాలను భద్రపరిస్తే ఇవి పర్యాటకులను ఆకట్టుకోనున్నాయి.
పర్యాటకులను ఆకర్షించేందుకైనా..
పూనే దక్కన్‌కాలేజీ సహకారంతో రూ. 57 లక్షలతో ఇటీవల పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలను ప్రారంభించింది. ఈ తవ్వకాల్లో మరిన్ని బౌద్ధ ఆనవాళ్లు బయటపడ్డాయి. కొండ పై భాగంలో మహా స్థూపం ముందు భాగం అంతా బౌద్ధ పఠనం జరిగిన ఆరామాలున్నాయి. గతంలో ఇక్కడ తొలిసారి నిజాంల కాలంలో 1941 నుంచి1944 వరకు, రెండో సారి 2000 నుంచి 2005వరకు, మూడోసారి 2006 నుంచి 2009 , 5వ సారి 2010 నుంచి 2014 వరకు మొత్తం ఐదు పర్యాయాలు తవ్వకాలు జరిగాయి. ఇక్కడ బౌద్ధ క్షేత్రం అమరావతి, నాగార్జునకొండతో సమానమైన బౌద్ధ సంపదను కలిగి ఉన్నట్లు పురావస్తు శాఖ గుర్తించింది. వచ్చే ఏడాది న్యూయార్క్‌లో జరిగే ప్రపంచస్థాయి సాంస్కృతిక శిల్పప్రదర్శకు ఫణిగిరిలోని బౌద్ధ శిల్పాన్ని ప్రదర్శనకు పంపే ఏర్పాట్లో పురావస్తు శాఖ నిమగ్నమైంది. ఫణిగిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరగనుంది. కొండపైకి రోడ్డు, మెట్లు నిర్మిస్తే పర్యాటకులను ఈ క్షేత్రం మరింతగా ఆకర్షించనుంది.
Comments
Please login to add a commentAdd a comment