రామాయణంలో ఒక చోట ‘‘సర్వే వేద విదః శూరః సర్వే లోకహితే రతః /సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః’’ అని ఉంటుంది. రామలక్ష్మణ భరత శతృఘ్నులకు గురువులు ఎన్నో విషయాలు నేర్పారు.ఎన్ని నేర్పినా, వాళ్ళకు నేర్పుతున్నప్పుడే అంతర్లీనంగా ఒక బోధ చే శారు. ‘‘ఈ చదువు మీకు ఒక కొత్త విభూతిని కట్టబెడుతుంది. ఈ చదువు మీకు ఒక కొత్త అధికారాన్ని తీసుకొస్తుంది. మీకున్న ఏ విభూతిని కూడా స్వార్థ ప్రయోజనానికి వాడుకోకుండా కేవలం ప్రజాహితానికి మాత్రమే వాడాలి.’’–అని.
చదువు లేనివాడు మోసం చేయడానికి సంతకం కూడా పెట్టలేడు. చదువుకున్నవాడు వాడిని పిలిచి నిలదీస్తే వాడు భయపడి ‘ఇంకెప్పుడూ ఇలా చేయనండీ ...’ అంటాడు. కానీ బాగా చదువుకున్నవాడు అందరికీ నియమనిష్టలు చెప్పగలిగినవాడు తప్పు చేసినప్పుడు.. ... తన తప్పును అంగీకరించక΄ోగా అదే ఒప్పు అని సమర్థించుకోవడానికి సవాలక్ష వాదనలు ముందు పెడతాడు. రావణాసురుడికి ఏ విద్యలు తెలియవని!!! అయినా ‘‘స్వధర్మో రక్షసాం భీరు సర్వథైన న సంశయః! గమనం వా పర స్త్రీణాం హరణం సంప్రమథ్య వా!!’’ అని వాదించాడు.
‘నా తప్పేముంది కనుక. నేను రాక్షసుడిని.నా జాతి ధర్మం ప్రకారం నాకు కావలసిన స్త్రీలను అవహరిస్తాను, అనుభవిస్తాను. నేను చూడు ఎంత ధర్మాత్ముడినో’’ అని సమర్ధించుకునే ప్రయత్నం చేసాడు. అంత చదువుకున్నవాడు అంత మూర్ఖంగా వాదిస్తే అటువంటివాడిని అభిశంసించగలిగిన వాడెవడుంటాడు!!! చదువు సంస్కారవంతమై ఉండాలి.సామాజిక నిష్ఠతో ఉండాలి. అందరి మేలు కోరేదై ఉండాలి.
విశ్వామిత్రుడుకానీ, వశిష్టుడు కానీ రామలక్ష్మణులకు విద్యను నేర్పించేటప్పుడు ‘ఇంత ధనుర్వేదాన్ని వీళ్లకు అందచేస్తున్నాం. వీళ్ళు తలచుకుంటే ముల్లోకాలను లయం చేయగలరు. అంత శక్తిమంతులవుతారు..’ అన్న ఆలోచనతో దానిని ఎక్కడా దుర్వినియోగపరచకుండా ఉండేవిధంగా విద్యాబోధనలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. నిజానికి రామచంద్రమూర్తి నేర్చుకున్న ధనుర్విద్యా΄ాటవం అటువంటిది.
ఆచరణలో ఆయన దానికి పూనుకుంటే ఆపడం ఎవరితరం కాదు. ఆయన బాణ ప్రయోగం చేస్తే అగ్నిహోత్రం కప్పేస్తుంది సమస్త భూమండలాన్ని... అది ప్రళయాన్ని సృష్టించగలదు. కానీ అంత బలాఢ్యుడై ఉండి కూడా రాముడు ఒక్కసారి కూడా స్వార్థం కోసం హద్దుదాటి ఎవరినీ శిక్షించలేదు. అంటే గురువులు ఇచ్చిన విద్య లోకప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగపడాలన్న స్పృహతో ఉండడమే కాదు, అందరికీ తన నడవడిక ద్వారా ఒక సందేశం ఇచ్చి ఆదర్శంగా నిలిచాడు.
రుషులు లోకహితం కోరి మనకు అందించిన పురాణాలు మనల్ని వారికి రుణగ్రస్థుల్ని చేసాయి. ఎప్పుడో వయసు మీరిన తరువాత, పదవీవిరమణ తరువాత చదవాల్సినవి కావు అవి. చిన్నప్పటినుంచి వాటిని చదువుకుంటే, అవగాహన చేసుకుంటే మన జీవితాలు చక్కబడతాయి. అదీకాక రుషిరుణం తీరదు కూడా. ఇది తీరడానికి బ్రహ్మచర్య ఆశ్రమం చాలు. బ్రహ్మచారిగా ఉండగా రామాయణ భారత భాగవతాదులు, ఇతర పురాణాలు, వేదాలు ఏవయినా చదువుకోవచ్చు. కానీ మిగిలిన రెండు రుణాలు–పితృరుణం, దేవరుణం మాత్రం గృహస్థాశ్రమ స్వీకారంతోనే తీరతాయి.
– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment