విద్యాధనం
‘విద్య నిగూఢ గుప్తమగు విత్తము’ – ఇతరుల కళ్ళకు కనిపించకుండా, వ్యక్తి లోపలనే గుప్తంగా దాగి ఉండే ధనరాశి వంటిది విద్య అని భర్తృహరి సుభాషితం చెప్పింది. విద్య వలన ప్రయోజనం అదొక్కటి మాత్రమే కాదనీ, మనిషి విద్యావంతుడు కావడం వలన సమకూరే ఉత్తమమైన ప్రయోజనాలు మరి కొన్ని వున్నాయనీ తెలుగు కవులు చెప్పారు. వారిలో, విక్రమార్కుడి సింహాసనపు సాలభంజికలు భోజరాజుకు చెప్పిన కథలను తెలుగులో ‘సింహాసన ద్వాత్రింశిక’ కావ్యంగా రచించిన కొఱవి గోపరాజు ఒకరు.
‘పరులకు, సోదరులకు, భూమిని పాలించే భూవరులకు నిలువెత్తు ధనం వెచ్చించైనా ఒకవ్యక్తి నుండి కొనలేనిది అతడి విద్య అని, ఏ వ్యక్తిలో ఉంటేఆ వ్యక్తికి మాత్రమే నూటికి నూరుపాళ్ళు వశ్యమై ఉండేది విద్య ఒక్కటే అని, ఒకరు తనలోని విద్యను మరొకరికి బోధించినపుడు, ఆ బోధనను గ్రహించిన వ్యక్తిలో తిరిగి అదే రకమైన వృద్ధికి ఆ విద్య దారితీస్తుందని ఆయన చెప్పిన మాటలు చిరస్మరణీయాలు. పరాయి ఊరికి వెళ్ళినప్పుడు వ్యక్తి లోపల ఉన్న విద్యా ధనం ఒక్కటే దొంగలకు కనపడకుండా ఉంటుందని, విద్య ఒక్కటి మాత్రమే ఒక్కొకసారి వ్యతిరేక పరి స్థితులలో సైతం స్నేహితులను పుట్టించగలిగే సామర్ధ్యం కలిగి ఉంటుందని, కాబట్టి విద్యను పోలిన ధనం మరొకటి ఉంటుందనుకోవడం అవివేకమే అవుతుందని కూడా చెప్పాడు కొఱవి గోపరాజు.
విద్యను గురించి కావ్యాంతర్గతమైన వివరణ అలా ఉండగా, భారతీయుల ఆధ్యాత్మిక చింతనకు ముఖ్యమైన మార్గదర్శకాలుగా భావించే అష్టాదశ పురాణాలలో ఒకటైన ‘శ్రీవిష్ణుపురాణం’ పంచమ అంశం, పదవ అధ్యాయం, 30వ శ్లోకంలో విద్యను గురించిన అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక భావన కనపడుతుంది.
విద్యయా యో యయా యుక్తస్తస్య సా దైవతం మహత్,
సైవ పూజ్యార్చనీయా చ సైవ తస్యోపకారికా.
ఏ విద్య ఆసరాతో ఒక వ్యక్తి తన జీవనాన్ని సాగిస్తుంటాడో, ఆ విద్యయే అతడికి ఇష్టదైవం వంటిది. ఆ విద్యయే ఆ వ్యక్తికి పూజనీయమైనది. ఆ విద్యయే ఆ వ్యక్తికి చిరకాలం ఆనందాన్ని కలిగించేదిగా కూడా ఉంటుంది అని పై శ్లోకంలో చెప్పబడింది.
– భట్టు వెంకటరావు
Comments
Please login to add a commentAdd a comment