గ్రామీణ జీవన పునర్వికాసానికి అద్భుత అవకాశం...
సంక్రాంతి!
ఏడాదిలోని 365 రోజులకూ 365 పండుగలున్న దేశం మనది. ఎప్పుడూ పండుగ వాతావరణంతో నిండి ఉండే సంస్కృతి మనది. ఈరోజు దుక్కిదున్నే రోజైతే, అదో రకమైన పండుగ. దుక్కిదున్నే కార్యక్రమానికి ఓ పాట... అందుకు తగ్గ ఆటా ఉండేవి. మరునాడు నాట్లువేసే రోజైతే, అది మరొక పండుగ. దానికీ ఓ పాటా, అందుకు తగ్గ ఆటా ఉండేవి. ఆ మరునాడు కలుపు తీసే రోజైతే, అదీ పెద్దపండగే. ఇక పంటకోత కోస్తే, అది కూడా ఓ గొప్ప పండుగే. అదే సంక్రాంతి పండుగ. ముందటి తరం వరకు కూడా మన దేశంలోని పల్లెల్లో ఆ సంబరమే వేరు. ఆటలు, పాటలు, గెంతులు, నాట్యాలతో మన జీవితాలు నిండి ఉండేవి.
ఉదాహరణకు సంక్రాంతి పండుగ రోజుల్లో తమ ఎడ్ల కొమ్ములకు, కాలి గిట్టలకు రంగులు వేసి, ముఖానికి నామాలు పెట్టి, మెడలో గంటలు కట్టి వీధుల్లో చాలా ఆనందంగా ఊరేగేవారు. బక్కచిక్కిన రెండే ఎడ్లున్న పేదరైతు కూడా తనకు చేతనైనంతగా వాటిని అలంకరించి సగర్వంగా వెంట నడుస్తూ, అందరికీ చూపిస్తూ పొంగిపోయేవాడు.
ఓ పది పదిహేనేళ్ల కిందటి వరకు కూడా నాట్లువేసే రోజులు వచ్చాయంటే అందరూ కలసిమెలసి నాట్లు వేసేవారు. మొత్తం పంట పండేవరకు కలసిమెలసే అన్నీ చేసుకొనేవారు. గ్రామం మొత్తం మీ పొలం దగ్గరకు వచ్చి అంతా పూర్తయ్యే వరకు సాయపడేవారు. రేపు మరొకరి పొలానికి, ఇలాగే అందరితో పాటు నువ్వూ పోయి సాయపడేవాడివి. అందరితో కలిసి ఆడిపాడేవాడివి. ఇప్పుడా ఆటపాటలే కనుమరుగైపోయాయి. వ్యవసాయం పండగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయం దండగ అనే దుస్థితి దాపురించింది. అందువల్ల గ్రామీణ పునర్వికాసం ఇప్పటి తక్షణావశ్యకత. ప్రభుత్వం చేయగలిగే పనికాదు ఇది. ప్రభుత్వం విధానాలు మార్చగలదు. ఆర్థికాభివృద్ధి సాధించడానికి అవకాశం ఇవ్వగలదు. కానీ ప్రతీ వ్యక్తి జీవితాన్నీ ఏ ప్రభుత్వమూ మార్చలేదు. ఈ దిశగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజానీకాన్ని జాగరూకం చేసే పనిని స్వచ్ఛంద సంస్థలు, బాధ్యతగల పౌరులు, కంపెనీలు కూడా చేపట్టాలి. అక్కడి జీవనంలోని వెనకటి ధైర్యోత్సాహాలను తీసుకురావడానికీ, వారి సరళమైన సామాజిక జీవనాన్ని పరిపుష్టం చేయడానికి నడుం బిగించాలి. దిక్కులేక నువ్వొక్కడివే ఈ ఊర్లో మిగిలావు అని కాకుండా బతకడానికి పల్లెపట్టును మించిందిలేదు అనే విధంగా మార్పు తేవడానికి ప్రయత్నించాలి. ఇందుకు ఈ సంక్రాంతి పండుగ ఓ సువర్ణావకాశం. దానిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలి. గ్రామీణులకు కొత్త ఊపిరిని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అందించాలి.