
ప్రశ్నించడం మంచి కల్చర్ కాదా?
న్యూఢిల్లీ: ప్రశ్న...ప్రశ్న...ప్రశ్న నుంచే ప్రపంచం ఇంతగా అభివద్ధి చెందిందని, ప్రశ్నతోనే మానవ వికాసం ప్రారంభమైందని కారల్ మార్క్స్ నుంచి ఖగోళశాస్త్రవేత్తల వరకు చెప్పారు. నేటి విజ్ఞాన సర్వస్వానికి ప్రశ్ననే ప్రాతిపదికని విజ్ఞులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. మరి మన కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి కిరణ్ రిజీజుకు మాత్రం ప్రశ్నించడమంటే అదో చెడ్డ అలవాటన్నది అభిప్రాయం.
‘తొలుత మనమంతా సందేహించడం, అధికారులను, పోలీసులను ప్రశ్నించడం మానుకోవాలి. ఇది ఎంతమాత్రం మంచి సంస్కతి కాదు. ఎప్పటి నుంచో మన భారతీయులు అనవసరంగా సందేహించడం, ప్రశ్నించడం అలవాటు చేసుకున్నారు’ అని రిజీజు మంగళవారం ఏర్పాటు చేసిన ఓ విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. భోపాల్‌లో జరిగిన ఎనిమిది మంది సిమీ కార్యకర్తల ఎన్‌కౌంటర్‌పై నెలకొన్న సందేహాలను నివత్తి చేసుకోవడానికి విలేకరులు ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన ఇలా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించడం ప్రాథమిక హక్కనే విషయాన్ని కూడా ఆయన విస్మరించారు.
సోమవారం నాడు జరిగిన సిమీ కార్యకర్తల ఎన్‌కౌంటర్ వివాదాస్పదం అవడం, రాజకీయ నాయకులు, అధికారులు చెబుతున్న కథనాలకు మధ్య పొంతన ఉండకపోవడం, నిర్జీవులపైకి కాల్పులు జరపుతున్న దశ్యాలు, లొంగిపోతామని చేతులూపుతున్న నిరాయుధులపై పోలీసులు కాల్పులు జరుపుతున్న వీడియో క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో పలు సందేహాలు, పలు ప్రశ్నలు తలెత్తిన విషయం తెల్సిందే.
ప్రశ్నించడం ద్వారానే పత్రికా రంగంలో రాణించిన జర్నలిస్టులకు ప్రతి ఏటా ఇస్తున్న గోయెంకా ఎక్స్‌లెన్స్ అవార్డులు బుధవారం ప్రదానం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తన కేబినెట్‌లోనే ప్రశ్నించడం మంచి అలవాటుకాదన్న మంత్రి ఉన్నారన్న విషయం తెలుసా?