- నృత్యసాగరంగా మారిన గచ్చిబౌలి స్టేడియం
- సమూహ నాట్య ప్రదర్శనతో కొత్త రికార్డు
- పాలుపంచుకున్న వేలాదిమంది కళాకారులు
- గిన్నిస్‌బుక్‌లోకి మహా బృంద నాట్యం!
- ఘనంగా ముగిసిన అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం
హైదరాబాద్: అచ్చతెలుగు కూచిపూడి నృత్యానికి భాగ్యనగరం పులకించిపోయింది. ఆరేళ్ల చిన్నారుల నుంచి అరవై ఏళ్ల వృద్ధుల వరకు వేలాదిమంది నృత్యకారులు పాదం పాదం కలిపి ఒకేసారి చేసిన నృత్యానికి ‘రికార్డులు’ తలవంచాయి. ప్రవాసాంధ్ర సంస్థ సిలికానాంధ్ర నాల్గో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో భాగంగా చివరిరోజైన ఆదివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన మహాబృంద నాట్యం అద్భుతంగా సాగింది. కడలి అలలా సాగిన వేలాది మంది కళాకారుల నాట్యం ఆహూతులను ఆకట్టుకుంది. ఈ నృత్య ప్రదర్శన త్వరలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పాదం కలిపిన 6,327 మంది...
మహాబృంద నాట్యంలో మొత్తంగా 6,327 మంది కళాకారులు భాగస్వాములయ్యారు. నృత్య గురువులను అనుసరిస్తూ మొదట స్టేడియంలో నిలబడ్డారు. ఢమరుక శబ్ధం వినిపించగానే పాదం పాదం కలుపుతూ ఒకేసారి మహాబృంద నాట్యం ప్రారంభించారు. శివుడి జటాఝూటం నుంచి భగీరథుడు గంగను భూమిపైకి రప్పించిన ఘట్టాన్ని తలపించేలా కళాకారులు అందెల సవ్వడితో ఏకకాలంలో చేసిన నృత్యానికి ఆహుతులు మైమరిచిపోయారు. అనంతరం నిర్వహించిన రామాయణ శబ్ధం బృంద నృత్యం నయనానందకరంగా సాగింది. రామాయణ శబ్ధం (రామకథ) పేరుతో రాముని జీవిత ఘట్టాలు తెలుపుతూ ఈ నృత్యం సాగింది. చివరగా వేదాంతం రాఘవ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సాగిన మహారుద్ర నాట్యం ఆకట్టుకుంది. కార్యక్రమం అనంతరం నృత్యాలలో పాలుపంచుకున్న కళాకారులకు నిర్వాహకులు ప్రశంసాపత్రాలను అందజేశారు.
తెలుగువారి తరగని ఆస్తి కూచిపూడి: ఏపీ శాసన మండలి చైర్మన్ చక్రపాణి
తెలుగువారి తరగని ఆస్తి కూచిపూడి అని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి అన్నారు. ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు సంప్రదాయాలకు, సంస్కృతికి నిదర్శనం కూచిపూడి అని పేర్కొన్నారు. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. నాలుగో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తమ ప్రభుత్వం కూచిపూడి నృత్య అభివృద్ధికి కేంద్రంగా ఉంటుందన్నారు. కాగా, ఆరో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని కూచిపూడి గ్రామంలోని నాట్యారామంలో 2016 డిసెంబర్ 23, 24, 25 తేదీల్లో నిర్వహిస్తామని సిలికానాంధ్ర చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ ప్రకటించారు.
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి..
మహాబృంద నాట్య ప్రదర్శనకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కల్పిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. దీనికి సంబంధించిన పత్రాన్ని కూడా అందజేశారు. అనివార్య కారణాల వల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు రాలేకపోయారని, వారికి రికార్డ్స్‌కు సంబంధించిన వివరాలు పంపుతామని సిలికానాంధ్ర నిర్వాహకులు చెప్పారు. కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు శేషుబాబు, మామిడి హరికృష్ణ, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ యామినీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.