సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు..తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు... ఇదీ ఆత్రేయ రాసిన పాట.. ఇప్పటి పరిస్థితులను బట్టి రాస్తే వాటి సరసన ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేర్చేవాడేమో మనసుకవి! నాటికీ నేటికీ పెళ్లి సంప్రదాయాల్లో ఎన్నో మార్పులు ఎప్పటికప్పుడు సరికొత్తగా చేరుతున్నాయి. ఉత్తర భారతంలో మెహందీ ఫంక్షన్ మన ప్రాంతాలకూ విస్తరించింది. ఇదో వేడుకలా చేసి పెళ్లి ఖర్చులను తడిసిమోపెడు చేస్తుంటే.. కొద్దికాలంగా ప్రీవెడ్డింగ్ షూట్ కల్చర్ క్రేజీగా తయారైంది. మధ్యతరగతి వర్గాలనూ ఇది ప్రభావితం చేస్తోంది. మన పరిసరాలు షూటింగులకు అనుకూలం కావడంతో దూరం వెళ్లకుండా జిల్లావాసులు ఇక్కడే ప్రీవెడ్డింగ్ షూట్‌లు చేసుకుంటున్నారు. (చదవండి: వడివేలు జీవితాన్ని మలుపు తిప్పిన రైలు జర్నీ)
సినిమా ప్రభావంతోనే ప్రీవెడ్డింగ్ షూట్ వచ్చింది. సినిమాలోని హీరో హీరోయిన్లు పెళ్లికి ముందు పలు అందమైన లొకేషన్లు తిరుగుతూ డ్యూయెట్లు పాడుకుంటారు. ఈ నాటకీయతకు .. అందమైన కలలకు నిజ జీవితంలోనూ దృశ్యరూపం ఇవ్వడం ఈ షూట్ ఉద్దేశం. నిశ్చితార్థం అయ్యాక పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కలిసి ఇందులో పాల్గొంటారు. జిల్లాలో వీటిపై ఇటీవల ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. మన జిల్లాలో అందమైన లోకేషన్లను వెతుక్కోనక్కరలేదు. గోదావరితోపాటు రంపచోడవరం, అడ్డతీగల, దేవీపట్నం తదితర ఏజెన్సీ ప్రాంతాలూ రా..రమ్మంటూ స్వాగతిస్తున్నాయి. దేవీపట్నంలోని తీగల బ్రిడ్జి వద్ద తప్పకుండా ఒక్క షాటైనా తప్పనిసరిగా తీస్తున్నారు. గోదావరి అందాలు, కడియం పూల నర్సరీలను బ్యాక్‌గ్రౌండుగా ఎంపిక చేసుకుంటున్నారు.
ఫొటోగ్రాఫర్ల ఫోకస్
ప్రీవెడ్డింగ్ షూట్ ఒక కళ. వీడియోగ్రాఫర్ లేదా ఫొటోగ్రాఫర్ల సృజనాత్మకతపై ఆధారపడి ఉంటుంది. జిల్లాలో కొందరు ఫొటోగ్రాఫర్లు ఈ షూట్లపై దృష్టి పెట్టారు. శిక్షణ పొందారు. థీమ్‌లు ఎంచుకుని వీడియో షూట్ చేస్తారు. కొన్నిచోట్ల డ్రోన్ కెమెరాలనూ వాడుతున్నారు. వధూవరుల హావభావాలు.. నేపథ్య గీతాలు.. అందమైన లొకేషన్లతో ఇది క్లిక్ అవుతుంది. ఈ షూట్‌కు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ వెచ్చిస్తున్నా రు. ఖరీదైనప్పటికీ తమ అభిరుచికి అనుగుణంగా ఉండటంతో మారుమాట్లాడటం లేదు చాలామంది.
వధూవరుల సేఫ్టీ కూడా చూడాలి
20 ఏళ్ల కిందటి వరకూ ఫొటోలు తీసుకునేవారు. తరువాత వీడియోలు వచ్చాయి. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్లు చేరాయి. కాలానుగుణంగా అభిరుచులు మారుతున్నాయి. అలాంటిదే ఈ ట్రెండ్ కూడా. కొన్ని లొకేషన్లలో వైవిధ్యం కోసం ప్రయత్నిస్తూ ప్రమాదాలపాలవుతున్నారు. ఏదైనా పరిధిలో.. పరిమితిలో ఉండాలి. షూటింగ్ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
– ఏపీ నారాయణరావు, రావ్ అండ్ రావ్ ఫొటో స్టూడియో, రాజమహేంద్రవరం
ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి..
ప్రీ వెడ్డింగ్ షూట్ల ద్వారా వధూవరులకు ఒకరిపై ఒకరికి అవగాహన వస్తోంది. అదే మెయిన్ కాన్సెప్ట్ అనుకుంటున్నాను. ఇద్దరిలో బెరుకు పోతుంది. షూట్ చేసేటప్పుడు ఇబ్బంది పెట్టకుండా వారి సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
– దారా మణి, వెడ్డింగ్ షూటర్
రాంగ్ ట్రెండ్
మన దేశంలో వివాహ వ్యవస్థకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాబోయే భార్యాభర్తలు పెళ్లికి ముందే ఒకరినొకరు అర్థం చేసుకోవడమే మంచిదే. కానీ ఈ రకంగా వీడియోలు, ఫొటోలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పెట్టుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులుంటాయి. కొద్ది కాలం తరువాత అభిప్రాయ భేదాలు వచ్చి భార్యాభర్తలు విడిపోవలసి వస్తే ఆ వీడియోలు ప్రతిబంధకంగా మారతాయి.
– నాగిరెడ్డి దారపు, వ్యక్తిత్వ జీవన, మానసిక వికాస నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment