అబిద్ హసన్ శాఫ్రానీ! ‘తెహజీబ్’కి నిషానీ!!
తెహజీబ్ అనే ఉర్దూ పదానికి అర్థం సంస్కృతి. ‘గంగ-యమున ’ (సరస్వతి) హిందూ సంస్కృతికి ప్రతీక. ఈ రెండు సంస్కృతులు పాలూ-నీళ్లలా కలసిపోవడమే గంగా జమునా తెహజీబ్. ఈ ప్రవాహంలో ‘గర్వంగా చెప్పు నేను హిందువునని/ గర్వంగా చెప్పు నేను ముస్లింనని’ లేదా ఫలానా అనే నినాదాలు నిశ్శబ్దంగా లుప్తమవుతాయి! మానవత్వం సంగమించిన భారతీయత మాత్రమే ధ్వనిస్తుంది! గంగా జమునా తెహజీబ్‌కు అపూర్వ ఉదాహరణగా నిలిచిన ఒక వ్యక్తిత్వం గురించి ఈ వారం.
అబిద్ హసన్ శాఫ్రానీ (కాషాయం).. వింతైన పేరు కదా! వివరాల్లోకి కథ మూలాల్లోకి వెళదాం! హైదరాబాద్ స్టేట్ దీవాన్‌గా (1853-83)పని చేసిన మొదటి సాలార్‌జంగ్ పాలనా వ్యవస్థను ఆధునీకరించాలని భావించాడు. ఈ క్రమంలో బ్రిటిష్ ఇండియా నుంచి ఇంగ్లిష్ పరిజ్ఞానం కలిగిన ఉన్నతాధికారులను హైదరాబాద్‌కు రప్పించారు. వారిలో నవాబ్ మొహిసిన్-ఉల్-ముల్క్ ఒకరు.
అతని చిన్న తమ్ముడు అమీర్ హసన్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆయనకు హజియా బేగం (ఇరానీ)కు 1911లో అబిద్ హసన్ జన్మించాడు. అప్పట్లో కులీనుల పిల్లలు ఇంగ్లండ్‌లో చదవడం ఫ్యాషన్! హసన్ తల్లికి ఇంగ్లండ్ అంటే అయిష్టత. హసన్ ఇంజనీరింగ్ చదివేందుకు జర్మనీ వెళ్లాడు.
రెండో ప్రపంచయుద్ధం. బ్రిటిష్ వారితో పోరాడుతోన్న జర్మనీకి నేతాజీ సుభాష్‌చంద్రబోస్ వెళ్లాడు. జర్మనీకి ఖైదీలుగా దొరికిన భారతీయ సైనికుల శిబిరాలు సందర్శిస్తూ బోస్ వారిలో దేశభక్తిని రగిలిస్తున్నాడు. భారతీయ యువకులనూ కలుస్తున్నాడు. ఆ సందర్భంలో తన చదువు పూర్తయ్యాక స్వాతంత్య్ర సమరంలో చేరతానని అబిద్ హసన్ బోస్‌తో అన్నాడు. చదువు త్యాగం చేయలేని వారు ప్రాణాలు త్యాగం చేస్తారా’ అన్నాడు బోస్. తక్షణం పుస్తకాలను విసిరేసి బోస్‌కు సెక్రటరీగా, దుబాసీగా నియుక్తుడయ్యాడు. జర్మన్-జపాన్ జలాంతర్గాముల్లో అబిద్, బోస్ వెంట సింగపూర్ వెళ్లాడు. జపాన్ మద్దతుతో 1943 అక్టోబర్ 21న ప్రవాసంలో స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని నెలకొల్పిన నేతాజీ సరసన అబిద్ ఉన్నాడు! ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఆజాద్ హింద్ ఫౌజ్) మేజర్‌గా నియుక్తుడై బర్మా రంగంలో సైన్యానికి నాయకత్వం వహించారు.
‘జైహింద్, సృష్టికర్త!
ఆ సందర్భంలో సైనికులు ఇతర భారతీయులు పరస్పరం విష్ చేసుకునేందుకు ‘హలో’కు ప్రత్యామ్నాయంగా ఒక దేశీపదం ఉంటే బావుండునని బోస్ భావించాడు. ఎన్నో పేర్లు పరిశీలనకు వచ్చాయి. అబిద్ హసన్ ‘జై హింద్’ అన్నాడు! తక్షణ స్పందనగా నేతాజీ ‘జైహింద్’ అన్నాడు. స్వతంత్ర భారతదేశపు జెండా ఏ రంగులో ఉండాలి? హిందువుల్లో ఎక్కువ మంది కాషాయం (శాఫ్రాన్) అని ముస్లింలలో ఎక్కువ మంది ఆకుపచ్చ అనీ వాదులాట! వైరుధ్యాలు తీవ్రదశకు చే రాయి. ‘హిందూ శ్రేణులు’ కాషాయపు వాదనలు వదులుకుని ఆకుపచ్చకే సమ్మతి తెలిపాయి. ఈ సంఘటనకు అబిద్ హసన్ చలించిపోయాడు. ఆ క్షణం నుంచి తన పేరుకు ‘శాఫ్రాన్’ చేర్చుకున్నాడు.
‘ఐఎన్‌ఎస్ ట్రయల్’ అనంతరం సింగపూర్‌లో బ్రిటిషర్లకు ఖైదీగా చిక్కిన అబిద్ హసన్ శాఫ్రానీ 1946లో హైద్రాబాద్ వచ్చారు. కాంగ్రెస్‌లో చేరి ముఠాతగాదాలకు రోసిల్లి ‘బెంగాల్ ల్యాంప్ కంపెనీ’ ఉన్నతోద్యోగిగా కరాచీ వెళ్లాడు. దేశవిభజన నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి హైద్రాబాద్ వచ్చేసిన అరుదైన వ్యక్తి! భారత విదేశాంగశాఖలో ఉన్నతోద్యోగిగా చైనా-స్విట్జర్లాండ్-ఇరాక్-సిరియా-డెన్మార్క్ దేశాల్లో పనిచేశారు. 1969లో రిటైరైన తర్వాత హైద్రాబాద్‌కు విచ్చేసి దర్గాహుసేన్ షా వలి ప్రాంతంలో వ్యవసాయక్షేత్రం నెలకొల్పారు.
జీవితాంతం బ్రహ్మచారి. ముగ్గురు బాలలను పెంచి ప్రయోజకులను చేశారు. అమెరికాలో ప్రఖ్యాత మ్యూజియాలజిస్ట్‌గా పేరు తెచ్చుకున్న హహబాజ్ శాఫ్రానీ ముగ్గురిలో ఒకరు. ! మరొకరు ఇస్మత్ మెహది, ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్‌లో అరబిక్ ఆచార్యుడిగా పని చేస్తున్నారు. మలీహా కూడా ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నారు. నడచిన నేలనంతా హరితమయం చేసి అబిద్ హసన్ శాఫ్రానీ 1984లో 73వ ఏట పరమపదించారు. గంధపు చెక్క అరిగిపోయినా పరిమళిస్తుంది కదా!