అలుపెరుగని పర్యాటకురాలు | Tourist efforts | Sakshi
Sakshi News home page

అలుపెరుగని పర్యాటకురాలు

Published Sun, Nov 2 2014 10:40 PM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM

అలుపెరుగని పర్యాటకురాలు - Sakshi

అలుపెరుగని పర్యాటకురాలు

భారతీయ ప్రాచీన కళలు, సాంస్కృతిక, వారసత్వ సంపదను కాపాడే ప్రతిష్టాత్మక సంస్థ పేరు ‘ఇన్‌టాక్.’ హైదరాబాద్‌లోని వారసత్వ సంపద విశేషాలు తెలుసుకోవడానికి, ఆయా ప్రాంతాలను సందర్శించి వివరాలు సేకరించడానికి ఈ ప్రతిష్టాత్మక సంస్థ ముప్పై ఏళ్ల క్రితం ఓ గృహిణిని ఆహ్వానించింది. తమ సంస్థలో ముఖ్య సభ్యురాలిగా స్థానమిచ్చింది. గృహిణిగా ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తూనే, తల్లిగా పిల్లల సంరక్షణ చూసుకుంటూనే, ట్రావెలర్‌గా ప్రపంచమంతా పర్యటిస్తూ  తనదైన కలను నెరవేర్చుకుంటూ భవిష్యత్తు తరాలకు తరగని సంపదను కానుకగా ఇస్తున్న ఆమె పేరు పి.అనూరాధా రెడ్డి. కాసేపు ఆమెతో మాట్లాడితే మన జీవితానికీ ఓ కొత్త ప్రయాణమార్గం కళ్లకు కడుతుంది.
 
గల్లీ నుంచి ఢిల్లీ వరకు అటు నుంచి ప్రపంచ దేశాల వరకు.. చారిత్రక ప్రదేశాలను సందర్శించి, అపురూపమైన వాటిని కెమరా కన్నుతో వీక్షించడం అనూరాధారెడ్డి ప్రత్యేకత. ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి భాష నేర్చుకోవడం ఆమెకున్న మరో ఆసక్తికరమైన అలవాటు. పాతికేళ్ల వయసు నుంచే ఒంటరిగా దేశాలు చుట్టిరావడం, అక్కడి ప్రత్యేకతలను తెలుపుతూ పుస్తకం రూపంలో తీసుకురావడం ఆమె ఒక దైవ కార్యంగా భావిస్తూ వచ్చారు. సాలార్‌జంగ్ మ్యూజియంలో వారసత్వ ప్రదేశాల వివరాలు తెలిపే ప్రజెంటేషన్స్ ఇస్తుంటారు. చారిత్రక కట్టడాల సంరక్షణకు ఏం చేయాలో ఉపన్యాసాలు ఇస్తుంటారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులను ‘హిస్టారికల్ వాక్’కు తీసుకెళుతుంటారు. ప్రతి ప్రభుత్వ స్కూల్‌లో విద్యార్థులకు ఒక ‘హెరిటేజ్ క్లబ్’ ఏర్పాటు చేయాలి అని సూచించే అనూరాధారెడ్డి ‘జీవితమంతా పర్యటనలతో ముడిపడింది’ అంటూ తన ప్రయాణమార్గం గురించి ఇలా వివరించారు...
 
గొప్పతనం తెలియజేయాలని...

‘‘మనం ఇప్పుడు జీవిస్తున్నది ముందు తరాలకు మార్గదర్శనం చేయడానికే అన్నది నా అభిమతం. డిగ్రీ వరకు చదువుకున్న నేను ఉద్యోగాలంటూ ఏమీ ఎంచుకోలేదు. పెళ్లై అత్తవారింట అడుగుపెట్టినా, ఇద్దరు అబ్బాయిలకు తల్లినైనా నా చూపు మన ప్రాచీన సంపద పరిరక్షణ వైపే ఉండేది. హైదరాబాద్‌లో ఎన్నో చారిత్రక కట్టడాలున్నాయి. అవన్నీ నిర్లక్ష్యానికి లోనవుతున్నాయి. వాటి చారిత్రక నేపథ్యం మరుగునపడకూడదని నా తాపత్రయం. అందుకే వాటి గురించి తెలుసుకోవడం, సందర్శించడం, ఫొటోలు తీసి పత్రికలకు అందజేయడం విధిగా పెట్టుకున్నా. ఈ పని ఎంతో మందిని కలిసే అవకాశాన్నిచ్చింది. హైదరాబాద్ ఇన్‌టాక్ సంస్థకు కన్వీనర్‌నీ చేసింది. పరిశోధక విద్యార్థులకు నా ప్రయత్నం ఉపయోగపడుతున్నందుకు ఆనందిస్తుంటా. ఇదంతా మా అమ్మ నాలో నింపిన స్ఫూర్తి!
 
పొత్తిళ్లలోనే పునాది

మా అమ్మ స్నేహలతా భూపాల్. ఆమె తొంభై ఏళ్లకు చేరువలో ఉన్నారు. నాన్న శ్రీరామ్ భూపాల్ (ఆరు  నెలల క్రితం మరణించారు) హెచ్.సి.ఎస్ ఆఫీసర్‌గా కొనసాగారు. వారు సిరినపల్లి సంస్థానాధీశులు. ఆ రోజుల్లో అమ్మకి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఆసక్తితో లెక్కల టీచర్‌గా, ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేశారు. అమ్మాయిల చదువుపై ఆమె అమితమైన శ్రద్ధ పెట్టేవారు. నన్నూ, తమ్ముడినీ చూసుకుంటూనే సాంస్కృతిక కార్యక్రమాలలో, క్రీడలలో పాల్గొనేవారు. ఆ రోజుల్లోనే బ్యాడ్మింటన్‌లో జాతీయ స్థాయిలో రాణించారు. సంగీతంలో మేటి అనిపించుకున్నారు. మా ఇంట మహిళా జాగృతికి సంబంధించిన చర్చలు జరుగుతుండేవి. అమ్మ, అమ్మమ్మల ధైర్యం, జీవితం పట్ల వారికున్న ఎనలేని గౌరవం ప్రతి దశలో నాకూ స్ఫూర్తిగా నిలిచాయి. వారి నుంచే తెలుగు, తమిళం, ఉర్దూ, మరాఠీ, కన్నడం నేర్చుకున్నా. పర్యటనలతో విదేశీ భాషలు పరిచయమయ్యాయి. అమ్మాయిల పురోభివృద్ధిలో అమ్మ పాత్ర చాలా ఉంటుంది అనడానికి మా అమ్మే ఉదాహరణ.
 
నిరంతర శోధనా భాండాగారం

ఐదేళ్ల వయసులో నాన్నగారిచ్చిన చిన్న కెమెరాతో నా శోధన మొదలైంది. నాన్నతో కలిసి ఎన్నో ప్రాంతాలు సందర్శించా. వ్యవసాయం, కళలు, ధనిక, పేద.. - అన్నింటినీ దగ్గరుండి చూశా. విషయాలన్నీ వివరంగా నాకు తెలియజేసేవారాయన. నాటి నుంచి ఎక్కడికెళ్లినా అక్కడి ప్రత్యేకతలు, వాతావరణం, చారిత్రక కట్టడాలు - ఇలా ప్రతి అంశాన్నీ ఫొటోలు, వీడియోలు తీయడం అలవాటుగా మారింది. చారిత్రక అంశాలను క్రోడీకరిస్తూ వ్యాసాలుగా భావితరాలకు అందించడం వ్యాపకమైంది.
 
జగమంత కుటుంబం

ఏ దేశానికి వెళ్లినా అక్కడ కొన్ని కుటుంబాలతో అనుబంధం ఏర్పడుతుంది. నలభై ఏళ్ల వయసులో జర్మనీ వెళ్లినప్పుడు అక్కడ స్థానిక రైలులో ప్రయాణిస్తున్నాను. ఒంటరి ప్రయాణం... ఒక స్టేషన్‌లో ఒక పెద్దావిడ రెలైక్కి, సీట్ కోసం అడిగింది. 90 ఏళ్లుంటాయి ఆమెకు. జర్మన్ భాషలోనే ఆమెకు సమాధానమిస్తూ సీట్ ఇచ్చాను. ఆమె నా వేషధారణ చూసి ఇండియన్ అని గుర్తుపట్టింది. ఆశ్చర్యపోయి, ‘మీరు ఇండియన్. అయినా జర్మన్ భాష బాగా మాట్లాడుతున్నారే’ అంది. అలా ఆమెతో మాట్లాడు తుండగా ‘మీరు మా దేశానికి అతిథిగా వచ్చారు. ఎక్కడ ఉండబోతున్నారు?’అనడిగింది. ఇంకా నిర్ణయించుకోలేదు అని చెప్పాను. ఆవిడ తన కుమారుడి ఇంటికి వెళుతున్నట్టు చెబుతూ నన్నూ రమ్మని ఆహ్వానించింది. నేను తన వెంట వాళ్లింటికి వెళ్లేంతవరకు నన్ను వదల్లేదు. ఆతిథ్యంతో పాటు ఆ ప్రాంతంలో చూడదగిన  ప్రాచీన కట్టడాలు, అందమైన ప్రదేశాలన్నింటినీ వారి కుటుంబసభ్యులంతా దగ్గరుండి మరీ చూపించారు. ఇప్పటికీ వారింటి మూడు తరాలతో నాకు అనుబంధం ఉంది. ఆ పెద్దావిడ మరణించేంతవరకు నన్ను బిడ్డగా భావించేది. ఇండియాకు వారు వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉంటారు. మన వంటలు నేర్చుకుంటారు.
 
ఏడాదికి రెండు టూర్‌లు...

ఇప్పుడైతే పిల్లలు విదేశాలలో స్థిరపడ్డారు కానీ వారు పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడూ సెలవుల సమయంలో టూర్లు ప్లాన్ చేసుకునేదాన్ని. నా పరిశోధనల కోసమే కాదు, కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకూ ఉత్సాహం చూపేదాన్ని. ఇందుకు నా భర్త జనార్దనరెడ్డి పూర్తి సహకారం అందించేవారు. పన్నెండేళ్ల క్రితం వరకు అయితే ఒంటరిగానే విదేశీ ప్రయాణాలు చేసేదాన్ని. ఆ తర్వాత ఒక ట్రావెల్ గ్రూప్‌ను ఏర్పాటు చేశా. వారితో కలిసి ఇప్పటికీ ఏడాదికి రెండు విదేశీ టూర్‌లు ఉండేలా ప్రణాళిక వేసుకుంటా. నిజానికి మా గ్రూప్ ఏర్పాటు కూడా గమ్మత్తుగా జరిగింది. ఒకసారి టాంజానియాలోని మా కజిన్ కుమారుడి పెళ్లికి నన్ను ఆహ్వానించారు. అక్కడికి దక్షిణ ఆఫ్రికా దగ్గర కావడంతో ఈ రెండు ప్రాంతాల వారసత్వ సంపదను కూడా చూసి రావాలనుకున్నాను. స్నేహితులు, బంధువులలో ఆసక్తి గలవారు తామూ వస్తామని ఉత్సాహం చూపారు. అలా పన్నెండు మందితో కలిసి కిలిమంజారో, జాంజిబార్ ఐలాండ్, అరుషా, గో రంగోరో నేషనల్ పార్క్, లేక్ విక్టోరియా, నైల్ రివర్ మొదలయ్యే ప్రాతం నుంచి మెడిటేరియన్ వరకు.. ఇవన్నీ ప్లాన్ చేసి మరీ చూసొచ్చాం. తర్వాత్తర్వాత ఈజిప్ట్, టర్కీ, బ్రెజిల్, వియత్నాం, కాంబోడియా, భూటాన్, థాయ్‌లాండ్, చైనా, రష్యా, ఇండొనేషియా, మెక్సికో, బర్మా, దుబాయ్ చూసొచ్చాం. ఇవన్నీ కాలానుగుణంగా ప్లాన్ చేసుకోవడం, వెళ్లి రావడం చేస్తూనే ఉన్నాం. మొదట 12 మందితో మొదలైన గ్రూప్ ఇప్పుడు 40 మందికి చేరింది. మా గ్రూప్‌లో 80 ఏళ్ల వయసున్నవారూ ఉండటం విశేషం!’’ అంటూ తమ పర్యటన అనుభవాలను తెలిపారు ఆమె.  టైమ్ గడవడం లేదు అంటూ ఖాళీ చేతులతో కాలాన్ని వెళ్లదీయడం కాదు. భావితరాలకు సుసంపన్నమైన ప్రాచీన భాండాగారాన్ని అందజేయాలి అనే ఆలోచన కలిగించే ఇలాంటి స్త్రీ మూర్తుల కృషి ఎప్పుడూ అనుసరణీయమే!
 
సంభాషణ: నిర్మలారెడ్డి
 
ఏ ప్రదేశానికి వెళ్లినా మనం మాట్లాడే భాష, ఎదుటివారికి ఇచ్చే మర్యాద, అలాగే వారితో స్నేహంగా ఉండటం.. బాగా తోడ్పడతాయి. అయితే, ఒక స్త్రీ గా అప్పుడూ ఇప్పుడూ నా జాగ్రత్తల్లో నేనుంటా. స్వచ్ఛందంగా చేసే ఈ పని భవిష్యత్ తరాలకు ఓ సూచిక అవుతుందని ఆనందిస్తుంటా. చదువు క్రమశిక్షణను నేర్పుతుంది. తల్లితండ్రులు కొంతవరకు దారి చూపుతారు. ఆ తర్వాత క్రమశిక్షణతో మన దారిని మనమే వెతుక్కుంటూ ముందుకెళ్లాలి. మనిషి ఎప్పుడూ నిత్య విద్యార్థి. నేర్చుకున్నదాంట్లో కొంతైనా భావితరాలకు అందజేయడం ఆ విద్యార్థి కనీస బాధ్యత. నేను చేస్తున్నది అదే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement